98444421000
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 20/12/2020 02:00 IST

98444421000

ఫోర్త్‌ అంపైర్‌

‘‘ఇది మొబైల్‌ నంబర్‌ అనుకుంటున్నారా..? కాదు కాదు మన భారత బ్యాట్స్‌మెన్‌ అడిలైడ్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సాధించిన స్కోర్లు’’

‘‘9.. 8.. 4.. 4.. 4.. 4.. 2.. 1.. ఇవి పోటీ పరీక్షల్లో విద్యార్థులు సాధించి ర్యాంకులనుకుంటున్నారా? కాదు కాదు.. మన బ్యాట్స్‌మెన్‌ పరుగులు’’

‘‘దీన్ని చూసి ఏదైనా ఓటీపీ నంబర్‌ అనుకుంటున్నారా.. కాదు మనోళ్ల స్కోర్లు’’
సామాజిక మాధ్యమాల్లో శనివారం మధ్యాహ్నం నుంచి ఇలాంటి జోకులే పేలుతున్నాయి. ఇవి నవ్వుకోవడానికి బాగానే అనిపించినా.. సగటు భారత క్రికెట్‌ అభిమానికి లోలోన ఎంతో ఆవేదన, ఆగ్రహం ఉండుంటాయి. కోహ్లి లాంటి మేటి ఆటగాడి నాయకత్వంలో.. అతడికి తోడు పుజారా, రహానె లాంటి ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్‌ ఉన్న జట్టు కేవలం 36 పరుగులకు కుప్పకూలడం జీర్ణించుకోలేనిది. వాడేకర్‌ నేతృత్వంలోని భారత జట్టు 1974లో ఇంగ్లిష్‌ గడ్డపై కేవలం 42 పరుగులకే కుప్పకూలి అవమాన భారాన్ని మూటగట్టుకుంది. భారత క్రికెట్‌కు ఒక మచ్చగా మిగిలిపోయిన ఆ రికార్డును ఇప్పుడు కోహ్లీ జట్టు బద్దలు కొట్టింది. భారత్‌కు ఎప్పుడూ బ్యాటింగే బలం. 1974 ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లిన జట్టులోనూ గావస్కర్‌, వాడేకర్‌, ఫరూక్‌ ఇంజినీర్‌, విశ్వనాథ్‌ లాంటి మేటి బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. అలాంటి జట్టు అప్పట్లో 42 పరుగులకే కుప్పకూలడం అనూహ్యం. అయితే అప్పటితో పోలిస్తే క్రికెట్లో ఇప్పుడు బ్యాట్స్‌మెన్‌ ఆధిపత్యం ఎంతగానో పెరిగింది. బౌలర్లు అప్పటిలా భీకరంగా లేరిప్పుడు. ఇలాంటి సమయంలో ముగ్గురు మేటి బ్యాట్స్‌మెన్‌ ఉన్న జట్టు ఇలా కుప్పకూలిపోవడమేంటో అంతుబట్టని విషయం.
తొలి రెండు రోజుల ఆట తర్వాత పైచేయిలో ఉన్న జట్టు.. కొన్ని గంటల వ్యవధిలో ఇలా కుప్పకూలి ఘోర పరాభవం చవిచూస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఆటలో ఏ జట్టుకైనా కలిసి రాని రోజుంటుంది. పరిస్థితులు ఉన్నట్లుండి ఎదురు తిరుగుతాయి. కానీ ఆ సమయాల్లో ఆటగాళ్లు ఎంతగా ప్రతిఘటించారన్నది ముఖ్యం. సందేహం లేదు.. ఆస్ట్రేలియా ఫాస్ట్‌బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఒకే లైన్‌లో, ఆఫ్‌ స్టంప్‌ లక్ష్యంగా నిలకడగా బంతులేశారు. రెండు వైపులా బంతిని స్వింగ్‌ చేశారు. పిచ్‌ కూడా వారికి సహకరించింది. కానీ భారత బ్యాట్స్‌మెన్‌ ఇంతలా వణికిపోయేలా పరిస్థితులు, ఆస్ట్రేలియా బౌలింగ్‌ ఉందా అన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే అదే పిచ్‌ మీద తర్వాత ఆస్ట్రేలియా ఓపెనర్లు అలవోకగా బ్యాటింగ్‌ చేశారు. ఇదే ఆస్ట్రేలియా బౌలర్లను తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ ఎంతో ఓపిగ్గా ఎదుర్కొన్నారు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తేలిపోయారు. తేడా అంతా ఆటగాళ్ల ఆలోచనల్లోనే ఉందన్నది స్పష్టం. మానసికంగా అత్యంత దుర్బలమైన స్థితిలో మన బ్యాట్స్‌మెన్‌ ఆసీస్‌ బౌలింగ్‌ను ఎదుర్కొన్నారు. ఒక్కరూ సరైన టెక్నిక్‌ను ప్రదర్శించలేకపోయారు.
ఓపెనర్లు కనీసం 50-60 బంతులు ఆడితే.. వారికీ పట్టు చిక్కుతుంది. తర్వాతి బ్యాట్స్‌మెన్‌కు కూడా బంతి అనుకూలంగా మారుతుంది. కానీ కనీసం బుమ్రా మాదిరిగా కూడా డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేయలేదు పృథ్వీ. మయాంక్‌ టెక్నిక్‌ సైతం సరిగా లేదు. డిఫెన్స్‌లో తిరుగులేదని పేరున్న పుజారా సైతం హేజిల్‌వుడ్‌ బంతిని ఎదుర్కొన్న తీరు.. భారత బ్యాటింగ్‌లో లోపాన్ని తేటతెల్లం చేస్తుంది. బంతి ఒక దిశలో వస్తుంటే అతను మరో దిశగా బ్యాట్‌ పెట్టి డిఫెన్స్‌ ఆడాడు. ఎడ్జ్‌ తీసుకుని క్యాచ్‌ వెళ్లింది. రహానె బంతిని ఎలా ఆడాలన్న మీమాంసలో వికెట్‌ సమర్పించుకున్నాడు. రెండు మూడు ఫోర్లు కొడితే ప్రత్యర్థి బౌలర్లు కొంచెం వెనుకడుగు వేస్తారు.. ఒత్తిడి తగ్గుతుందన్న ఉద్దేశంలో కోహ్లి షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ గ్రీన్‌ పట్టిన చక్కటి క్యాచ్‌కు వెనుదిరగక తప్పలేదు. మిగతా బ్యాట్స్‌మెన్‌ కూడా కనీస పోరాటం చేయలేదు. కరోనా విరామం తర్వాత ఇంత ప్రతిష్ఠాత్మక సిరీస్‌కు మన వాళ్ల సన్నద్ధతపై అనేక సందేహాలు రేకెత్తించిందీ మ్యాచ్‌.
కొన్ని తప్పిదాల ప్రభావం అప్పటికి తెలియదు. తర్వాత వాటికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తొలి రోజు కోహ్లి అలా రనౌట్‌ కాకపోయి ఉంటే.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ భారీ స్కోరు చేసేది! తర్వాత ఫీల్డర్లు పదే పదే క్యాచ్‌లు వదిలేయకుంటే ఆస్ట్రేలియా 100కు అటు ఇటు స్కోరుకు పరిమితం అయ్యేదిది! ఆ స్థితిలో ఆతిథ్య జట్టు పూర్తి వెనుకంజలో ఉండేది. వాళ్ల బౌలర్ల నైతిక స్థ్యైర్యం దెబ్బ తినేది. ఏదేమైనప్పటికీ భారత జట్టు ఇలా కుప్పకూలడం మింగుడుపడని విషయం. ఈ పరాభవం తర్వాత కోహ్లి స్వదేశానికి వెళ్లిపోనున్న నేపథ్యంలో మరింత బలహీనపడనున్న భారత బ్యాటింగ్‌.. రెట్టించిన ఉత్సాహంతో రెండో టెస్టులో బరిలోకి దిగనున్న ఆసీస్‌ బౌలర్లను కాచుకుని నిలబడటం అంత తేలిక కాదు. సిరీస్‌పై ఆశలు నిలవాలంటే భారత్‌ అసాధారణంగా పుంజుకోవాల్సిందే.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన