రాహుల్‌కు చోటు లేదా?
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 24/12/2020 08:12 IST

రాహుల్‌కు చోటు లేదా?

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన భారత్‌.. రెండో టెస్టుకు తుది జట్టులో మూడు నుంచి అయిదు మార్పులు చేస్తుందన్న అంచనాలున్నాయి. కోహ్లి, షమి సిరీస్‌లో మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయారు కాబట్టి ఆ ఇద్దరి స్థానాల్ని వేరే ఆటగాళ్లతో భర్తీ చేయాలి. అలాగే తొలి టెస్టులో ఘోరంగా విఫలమై తీవ్ర విమర్శల పాలైన పృథ్వీ షాపై వేటు పడటమూ ఖాయమే. పృథ్వీ స్థానంలోకి గిల్‌, షమి బదులు సిరాజ్‌ లేదా సైని వస్తారని అంచనా. కోహ్లి బదులు రాహుల్‌ వస్తాడని అంతా అనుకుంటుండగా.. తాత్కాలిక కెప్టెన్‌ రహానె, కోచ్‌ రవిశాస్త్రి అందుకు భిన్నంగా యోచిస్తున్నట్లు సమాచారం. ఫిట్‌నెస్‌ సాధించిన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను కోహ్లి స్థానంలోకి తీసుకోనున్నారట. కోహ్లి స్థానంలో రాహులే ఖాయమని.. విహారి స్థానంలో జడేజాను తీసుకోవచ్చని, అలాగే సాహా బదులు పంత్‌ను ఎంచుకునే అవకాశాలున్నాయని వార్తలొచ్చాయి. కానీ విహారి, సాహాలను రెండో టెస్టుకు కొనసాగించనున్నారని తెలుస్తోంది. కోహ్లి స్థానంలోకి ఆల్‌రౌండ్‌ సేవలందించగల జడేజాకు తీసుకొస్తారట. గతంలో లెక్కకు మిక్కిలి అవకాశాలు వచ్చినా వాటిని ఉపయోగించుకోకపోవడం, చివరగా ఆడించిన టెస్టు సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేయడం, ఏడాదిన్నరకు పైగా టెస్టులకు దూరంగా ఉండటం రాహుల్‌కు ప్రతికూలంగా మారింది. అతణ్ని టెస్టు సిరీస్‌ ముంగిట వార్మప్‌ మ్యాచ్‌లోనూ ఆడించలేదు.
ప్రాక్టీస్‌ జోరుగా..: రెండో టెస్టు కోసం టీమ్‌ఇండియా ప్రాక్టీస్‌ ఆరంభించింది. తొలి టెస్టులో ఘోర పరాజయం తర్వాత అడిలైడ్‌ నుంచి మెల్‌బోర్న్‌కు చేరుకున్న భారత జట్టు.. కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం రెండో టెస్టు జరగనున్న మెల్‌బోర్న్‌ మైదానంలో బుధవారం ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది. ఈ మ్యాచ్‌కు పృథ్వీ స్థానంలో ఓపెనర్‌గా వస్తాడని భావిస్తున్న శుభ్‌మన్‌ గిల్‌.. నెట్స్‌లో బాగానే చెమటోడ్చాడు. టీ20 సిరీస్‌ సందర్భంగా కంకషన్‌కు గురైన జడేజా సైతం ప్రాక్టీస్‌కు హాజరయ్యాడు. అతను పుజారాకు బౌలింగ్‌ చేయడంతో పాటు బ్యాటింగ్‌ సాధన కూడా చేశాడు. దీన్ని బట్టి జడేజాకు తుది జట్టులో చోటు ఖాయమే అనుకోవచ్చు. రెండో టెస్టుకు చోటు సందేహంగానే ఉన్నప్పటికీ కేఎల్‌ రాహుల్‌ సైతం చాలాసేపు బ్యాటింగ్‌ సాధన చేశాడు. టీమ్‌ఇండియా సాధన గురించి బీసీసీఐ సైతం ట్విటర్లో స్పందించింది. ‘‘మనం ఇప్పుడు మెల్‌బోర్న్‌లో ఉన్నాం. ఎర్ర బంతితో టెస్టులు మొదలు కాబోతున్నాయి. పునరేకీకరణకు ఇది సమయం’’ అంటూ కొన్ని ప్రాక్టీస్‌ ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.

ఇవీ చదవండి..
స్టాండ్‌కు నా పేరు తీసేయండి

పుజారా కోసం ప్రత్యేక వ్యూహంTags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన