close

ప్రధానాంశాలు

Updated : 20/01/2021 06:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కల లాంటిది.. నిజమైనది

గబ్బాలో టీమ్‌ఇండియా అద్భుతం
328 పరుగుల ఛేదనతో సంచలనం
గిల్‌ మెరుపులు.. పుజారా పోరాటం
పంత్‌ వీరోచిత ఇన్నింగ్స్‌
ఆసీస్‌కు షాక్‌.. సిరీస్‌ 2-1తో భారత్‌ వశం
గబ్బా

నెల రోజుల వెనక్కి వెళ్దాం!
2020 డిసెంబరు 19. భారత కాలమానంలో సమయం ఉదయం ఆరున్నర.

అడిలైడ్‌లో తొలి టెస్టు మూడో రోజు ఆట మొదలై గంటన్నరే అయింది. అప్పుడే నిద్ర లేచి.. స్కోరు చూద్దామని టీవీ పెడితే భారత అభిమానులకు తమ కళ్లను తామే నమ్మలేని దృశ్యం. భారత్‌ స్కోరు 36/10.

ఎంత బాధ.. ఎంత కోపం.. ఎన్ని తిట్లు.. ఎన్ని నిట్టూర్పులు..!

అంతటి ఘోర పరాభవం తర్వాత తర్వాతి మ్యాచ్‌లో ప్రత్యర్థిని దెబ్బకు దెబ్బ తీయాలని.. ఘనంగా ప్రతీకారం తీర్చుకోవాలని ఆశిస్తాం మామూలుగా! కానీ కోహ్లి ఇంటికొచ్చేశాడు. షమి గాయపడ్డాడు. కీలక ఆటగాళ్లు ఫామ్‌లో లేరు. ప్రతీకారం ఏం ఆశిస్తాం? ఇంకో పరాభవం ఎదురవకుంటే చాలనుకునే పరిస్థితి!

వారం రోజులకు మెల్‌బోర్న్‌లో ఆట మొదలైంది.. ఈ జట్టు ఏం చేయగలదంటూ జాలి చూపులు చూసిన వాళ్లు ఆశ్చర్యంతో కళ్లు పెద్దవి చేశారు. కోహ్లి లేకుండా ఏం నిలుస్తారంటూ దెప్పిపొడుపులు పొడిచిన వాళ్లకు నోట మాట రాలేదు. వైట్‌ వాష్‌ తప్పదంటూ వేళాకోళాలు చేసిన వాళ్లు ముఖం చెల్లలేదు. నాలుగు రోజుల్లో ఆతిథ్య జట్టు ఆట కట్టు. సంచలన విజయం భారత్‌ సొంతం. 1-1తో సిరీస్‌ సమం.

కానీ ఇంకా రెండు మ్యాచ్‌లున్నాయి. గాయంతో పేసర్‌ ఉమేశ్‌ ఔట్‌. ప్రత్యర్థి జట్టిప్పుడు కసి మీదుంది. అన్నిసార్లూ అద్భుతాలు జరిగిపోవు.. ఈసారి కష్టమే అన్న అంచనాలు! అందుకు తగ్గట్లే మ్యాచ్‌లో ఎదురుగాలి. ఆతిథ్య జట్టు ఉచ్చు బిగించేసింది. ఓటమి తప్పదని అంతా ఓ నిర్ణయానికి వచ్చేసిన వేళ.. జరిగింది అద్భుతం! సిడ్నీలో  నమ్మశక్యం కాని ఫలితం.. మ్యాచ్‌ డ్రా!

మెల్‌బోర్న్‌లో గెలిచేశాం. సిడ్నీలో ఓటమికి ఎదురు నిలిచాం. కానీ గబ్బాలోనా.. అమ్మో! అది ఆస్ట్రేలియా అడ్డా. మహా మహా జట్లనూ వణికించిన గడ్డ. మెల్‌బోర్న్‌లో గెలిపించిన జడేజా లేడు. సిడ్నీలో కాపాడిన అశ్విన్‌, విహారి లేరు. ఆరంభం నుంచి ఆదుకుంటున్న బుమ్రా లేడు. బౌలింగ్‌ దళం అనుభవమంతా కలిపితే 4 టెస్టులు, తీసిన వికెట్లు 13. ఇలాంటి జట్టుతో గబ్బాలో కంగారూల్ని ఓడించడమా.. అదో కల మాత్రమే!

కానీ ఆ కలే నిజమైంది. గబ్బాలో అద్భుతం ఆవిష్కృతమైంది. పేరున్న జట్టయితే జాగ్రత్తకు పోయేదేమో! అనుభవజ్ఞులుంటే ఆచితూచి ఆడేవాళ్లేమో! ‘‘గబ్బానా.. అయితే ఏంటి’’.. ‘‘ఆస్ట్రేలియానా.. అయితే ఎవరికి గొప్ప’’.. అన్నట్లుగా కుర్రాళ్లు చెలరేగిపోయిన వేళ.. అనుభవజ్ఞుడు పుజారా కష్ట కాలంలో వారికి అండగా నిలిచిన  తరుణాన.. గబ్బాలో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది రహానేసేన.

అడిలైడ్‌ పరాభవం నుంచి సరిగ్గా     నెల రోజుల తర్వాత.. 2021 జనవరి 19.. మధ్యాహ్నం పన్నెండున్నర.

భారత క్రికెట్‌ చరిత్రలో.. ఆ మాటకొస్తే ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే ఒక అత్యద్భుత విజయం నమోదైన సమయం!

ఇన్నాళ్లూ 2001 ఈడెన్‌ గార్డెన్స్‌ విజయం గురించి చెప్పుకున్నాం! ఇకపై 2021 గబ్బా గెలుపు గురించి అంతే గొప్పగా చెప్పుకుంటాం! సాహో టీమ్‌ఇండియా!

డ్రా చేసుకుని బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని నిలబెట్టుకుంటే చాలు అనుకున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా సంచలన విజయం సాధించింది. 328 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఔరా అనిపించింది. మంగళవారం ముగిసిన నాలుగో టెస్టులో భారత్‌ 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రిషబ్‌ పంత్‌ (89 నాటౌట్‌; 138 బంతుల్లో 9×4, 1×6) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్నందించాడు. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (91; 146 బంతుల్లో 8×4, 2×6) విజయానికి బలమైన పునాది వేశాడు. చెతేశ్వర్‌ పుజారా (56; 211 బంతుల్లో 7×4) ఇన్నింగ్స్‌కు ఇరుసులా మారాడు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌ (4/55) ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 369 పరుగులు చేయగా.. భారత్‌ 336 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 294 పరుగులు సాధించింది. ఈ విజయంతో భారత్‌ బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని 2-1తో చేజిక్కించుకుంది.

అలా మొదలై..: ఓవర్లు 100. వికెట్లు 10. పరుగులు 324. ఇదీ సమీకరణం. ఉదయం ఆట ఆరంభమైన తీరు చూశాక డ్రాతో బయటపడితే చాలనే అనిపించి ఉంటుంది అందరికీ. కాసేపటికే రోహిత్‌ (7) ఔటైపోయాడు. కొంచెం మబ్బులు పట్టిన వాతావరణంలో ఆసీస్‌ పేస్‌ త్రయం మున్ముందు ఎలాంటి సవాళ్లు విసురుతుందో అని ఆందోళన నెలకొన్న సమయమది..


ఇటు పుజారా.. అటు వాళ్లు!

క ఆరంభంలోనే వికెట్‌ పడి.. జట్టు రోజంతా బ్యాటింగ్‌ చేయక తప్పని పరిస్థితిలో పుజారా నుంచి జట్టు ఏం ఆశించిందో అతను అదే చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వికెట్‌ ఇవ్వకూడదు, జట్టును గట్టెక్కించాక కానీ క్రీజును వదలకూడదు అన్నట్లుగా అతను పాతుకుపోయాడు. కొన్నిసార్లు ఊరించే బంతులతో షాట్‌ ఆడేందుకు ఉసిగొల్పినా అతను మాత్రం తొణకలేదు. ఎన్ని రకాలుగా పరీక్షించినా ఫలితం లేక.. చివరికి ఆసీస్‌ పేసర్లు పుజారా శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని బంతులేశారు. మెడ, చేతి వేళ్లు, మణికట్టు, మోచేయి.. ఇలా ఎన్నిచోట్ల బంతి బలంగా తాకిందో లెక్క లేదు. నొప్పితో కొన్నిసార్లు అతను పడ్డ బాధ వర్ణనాతీతం. అయినా అతను తలొగ్గలేదు. ఓ ఎండ్‌లో క్రీజు చుట్టూ గోడ కట్టేసి.. అవతలి బ్యాట్స్‌మన్‌కు స్వేచ్ఛగా ఆడుకునే వీలు కల్పించాడు. పుజారా అండతో మొదట శుభ్‌మన్‌, ఆ తర్వాత పంత్‌ మరో ఎండ్‌లో స్వేచ్ఛగా బ్యాట్‌ ఝులిపించారు. పుజారా-శుభ్‌మన్‌ ఆడుతున్నపుడు డ్రాపై ధీమా కలిగితే.. పుజారాకు పంత్‌ జత కలిశాక గెలుపుపై ఆశలు రేగాయి. పంత్‌కు సుందర్‌ తోడయ్యాక గెలుపు మనదే అన్న భరోసా కలిగింది. ఆఖర్లో కొంత ఉత్కంఠ నెలకొన్నప్పటికీ.. పంత్‌ మ్యాచ్‌ను భారత్‌ సొంతం చేశాడు.


పునాది పడింది..

దయం తొలి సెషన్లో ఆటంతా శుభ్‌మన్‌దే. గబ్బాలో ఆడుతున్నాం, అగ్రశ్రేణి పేస్‌ త్రయాన్ని ఎదుర్కొంటున్నాం అనే బెరుకే లేకుండా అతను.. స్వేచ్ఛగా బ్యాట్‌ ఝులిపించాడు. తన అమ్ములపొదిలోని షాట్లన్నింటినీ ప్రయోగించాడు. డ్రైవ్‌లను ఎంత కచ్చితత్వంతో ఆడాడో.. లాఫ్టెడ్‌ షాట్లను అంతే బలంగా కొట్టాడు. లంచ్‌ విరామానికి భారత్‌ స్కోరు 83/1. అందులో గిల్‌ వాటానే 64. పుజారా అప్పటికి చేసింది 8 పరుగులే. లంచ్‌ తర్వాత గిల్‌ మరింత ధాటిగా ఆడాడు. శరవేగంగా 90ల్లోకి వచ్చేశాడు. గిల్‌ ఊపు చూస్తే కెరీర్లో తొలి శతకం అందుకోవడం ఖాయంగా కనిపించింది. కానీ లైయన్‌ అతడిని బుట్టలో వేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చినరహానె (24).. గిల్‌లాగే దూకుడుగా ఆడాడు. లైయన్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాదాడు. కానీ అతణ్ని కమిన్స్‌ ఎంతోసేపు నిలవనివ్వలేదు.

132/1తో ఉన్న భారత్‌.. 167/3కి చేరుకుంది. అప్పటికింకా 44 ఓవర్లు మిగిలి ఉండగా.. ఇంకా చేయాల్సిన పరుగులేమో 161. డ్రా కోసం ఆడాలా.. గెలుపు కోసం ప్రయత్నించాలా అన్న సందిగ్ధత నెలకొన్న దశ అది.

ఈ స్థితిలో మరో ఆటగాడైతే డ్రా దిశగానే ఆలోచించేవాడేమో! కానీ సిడ్నీలో ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనే మెరుపు ఇన్నింగ్స్‌తో గెలుపాశలు రేపి, ఉన్నట్లుండి ఔటైపోయిన పంత్‌ మాత్రం ఇంకో రకంగా ఆలోచించాడు. సిడ్నీలో చేజారిన విజయాన్ని గబ్బాలో సాధించి చరిత్ర సృష్టించే అవకాశాన్ని విడిచిపెట్టొద్దనుకున్నాడు. సిడ్నీలో మాదిరే అవతల పుజారా దృఢంగా నిలబడి ఉండటంతో ఇవతల అతను దాడి చేశాడు. అలాగని అతనేమీ దొరికిన బంతినల్లా కొట్టేయాలని చూడలేదు. చెత్త బంతులకు మాత్రమే బౌండరీ మార్గం చూపించి.. మంచి బంతులను గౌరవించాడు. కొన్నిసార్లు మెయిడెన్లు కూడా ఆడాడు. ఒక షాట్‌ ఆడాక ఆత్రపడకుండా సంయమనం పాటించాడు. పంత్‌ రాకతో స్కోరు వేగం పెరిగి లక్ష్యం కరుగుతూ వెళ్లడంతో భారత్‌ విజయానికి దారులు తెరుచుకున్నాయి. దీంతో పుజారా సైతం వేగం పెంచాడు. అర్ధశతకం పూర్తి చేశాడు. 21 ఓవర్లలో సరిగ్గా వంద పరుగులే చేయాల్సి రావడంతో ఛేదన అంత కష్టమేమీ కాదనిపించింది. కానీ ఈ దశలో కమిన్స్‌ మళ్లీ భారత్‌ను దెబ్బ కొట్టాడు. పుజారాను వికెట్ల ముందు బలిగొన్నాడు. కాసేపటికే మయాంక్‌ (9) కూడా ఔటైపోవడంతో భారత్‌ 265/5తో నిలిచింది. 14 ఓవర్లలో 73 పరుగులు చేయాలి. ఈ స్థితిలో ఆసీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి భారత్‌పై ఒత్తిడి పెంచారు. 44 బంతుల్లో 49 పరుగులతో సమీకరణం కఠినంగా మారింది. ఈ స్థితిలో సుందర్‌.. కమిన్స్‌ బౌలింగ్‌లో వరుసగా 6, 4 బాది ఒత్తిడి తగ్గించాడు. ఇక్కడి నుంచి ఆసీస్‌ బౌలింగ్‌ లయ తప్పింది. లైయన్‌ వేసిన తర్వాతి ఓవర్లో పంత్‌ వరుసగా రెండు ఫోర్లు బాదడంతో సమీకరణం మరింత తేలికైంది. 26 బంతుల్లో 10 పరుగులే చేయాలి. గెలుపు లాంఛనమే అనుకున్న స్థితిలో సుందర్‌ (22).. త్వరగా పని పూర్తి చేసేద్దామని లైయన్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ ఆడబోయి బౌల్డయ్యాడు. హేజిల్‌వుడ్‌ వేసిన తర్వాతి ఓవర్లో తొలి బంతికే పంత్‌ ఫోర్‌ కొట్టేశాడు. తర్వాత వరుసగా 1, 2 పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి శార్దూల్‌ (2) ఔటైపోయినా.. ఓవర్‌ చివరి బంతికి స్ట్రెయిట్‌ డ్రైవ్‌తో బౌండరీ సాధించిన పంత్‌ చారిత్రక విజయాన్ని భారత్‌ వశం చేశాడు. పంత్‌ మంచి ఊపుమీదుండగా స్టంపింగ్‌ చేసే అవకాశాన్ని వదిలేయడంతో పాటు.. బైస్‌ రూపంలో కొన్ని ఫోర్లు కూడా విడిచిపెట్టిన ఆసీస్‌ కెప్టెన్‌ పైన్‌ భారత్‌కు ఇతోధిక సాయం చేశాడు.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 369;

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 336;

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 294

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) పైన్‌ (బి) కమిన్స్‌ 7; గిల్‌ (సి) స్మిత్‌ (బి) లైయన్‌ 91; పుజారా ఎల్బీ (బి) కమిన్స్‌ 56; రహానె (సి) పైన్‌ (బి) కమిన్స్‌ 24; పంత్‌ నాటౌట్‌ 89; మయాంక్‌ (సి) వేడ్‌ (బి) కమిన్స్‌ 9; సుందర్‌ (బి) లైయన్‌ 22; శార్దూల్‌ (సి) లైయన్‌ (బి) హేజిల్‌వుడ్‌ 2; సైని నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 29 మొత్తం: (97 ఓవర్లలో 7 వికెట్లకు) 329;

వికెట్ల పతనం: 1-18, 2-132, 3-167, 4-228, 5-265, 6-318, 7-325;

బౌలింగ్‌: స్టార్క్‌ 16-0-75-0; హేజిల్‌వుడ్‌ 22-5-74-1; కమిన్స్‌ 24-10-55-4; గ్రీన్‌ 3-1-10-0; లైయన్‌ 31-7-85-2; లబుషేన్‌ 1-0-4-0

2

ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌ గెలిచిన సిరీస్‌లు. ఉపఖండ జట్లలో టీమ్‌ఇండియా మాత్రమే ఆసీస్‌లో సిరీస్‌ నెగ్గింది.


3

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో గత మూడు సిరీస్‌ల్లో 2-1 ఫలితమే వచ్చింది. ఈ మూడింటనీ భారత జట్టే గెలుచుకుంది.


3

టెస్టుల్లో భారత్‌కు ఇది మూడో పెద్ద ఛేదన. ఆస్ట్రేలియాలో ఒక పర్యటక జట్టు చేసిన మూడో పెద్ద ఛేదన కూడా.


4

ఆస్ట్రేలియాలో ఓ జట్టు తొలి మ్యాచ్‌ ఓడి సిరీస్‌సాధించడం ఇది నాల్గోసారి. ఇంగ్లాండ్‌ మూడుసార్లిలా గెలిచింది.


5

రహానె సారథ్యంలో అయిదు టెస్టులు ఆడిన టీమ్‌ఇండియా.. నాలుగింట్లో గెలిచి.. ఒక మ్యాచ్‌ డ్రా చేసుకుంది.


32

గబ్బాలో ఆస్ట్రేలియాకు 32 ఏళ్ల తర్వాత ఇదే తొలి ఓటమి. చివరిగా 1988లో వెస్టిండీస్‌ చేతిలో ఓడింది.


928

ఈ సిరీస్‌లో పుజారా ఆడిన బంతులు. గత పర్యటనలో అతను 1258   బంతులను ఎదుర్కొన్నాడు.


624

ఆస్ట్రేలియా గడ్డపై అన్ని ఫార్మాట్లలో కలిపి రిషబ్‌ పంత్‌ చేసిన పరుగులు. ఆసీస్‌పై అత్యధిక పరుగులు సాధించిన పర్యాటక జట్టు కీపర్లలో పంత్‌ రెండో స్థానంలో ఉన్నాడు. అలెన్‌ నాట్‌ (643, ఇంగ్లాండ్‌) ముందున్నాడు.

దెబ్బ పడిన ప్రతిసారి బలంగా పుంజుకుని, సగర్వంగా నిలబడ్డాం. నిర్లక్ష్యంగా కాదు నిర్భయంగా క్రికెట్‌ ఆడగలమనే నమ్మకంతో హద్దులను దూరంగా నెట్టాం. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో గాయాలు, అనిశ్చితిపై పైచేయి సాధించాం. అత్యుత్తమ సిరీస్‌ విజయాల్లో ఇదొకటి. భారత్‌కు అభినందనలు.

- సచిన్‌


ఆస్ట్రేలియాలో చారిత్రక క్రికెట్‌ విజయం సాక్షాత్కారమైంది. టెస్టు సిరీస్‌ను పోరాడి సొంతం చేసుకున్న భారత యువ క్రికెట్‌ జట్టుకు అభినందనలు. అద్భుత నైపుణ్యాలను, పట్టుదలను జట్టు ప్రదర్శించింది. ఈ విజయం పట్ల దేశం గర్వపడుతోంది’’

- రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌


మా విజయం! అవును.. అడిలైడ్‌లో ప్రదర్శన తర్వాత మమ్మల్ని అనుమానించిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఏం జరిగిందో గమనించండి. అద్భుతమైన ప్రదర్శన ఇది. బలమైన వ్యక్తిత్వం, అంకితభావం మమ్మల్ని నిలబెట్టాయి. కుర్రాళ్లందరూ, జట్టు మేనేజ్‌మెంట్‌ గొప్పగా రాణించింది. ఈ చారిత్రక విజయాన్ని ఆస్వాదించండి.  

- విరాట్‌ కోహ్లి


‘సంతోషంతో వెర్రివాణ్ని అవుతున్నా. సరికొత్త భారత్‌ ఇది. అడిలైడ్‌లో ఓటమి నుంచి ఈ విజయం వరకూ జట్టును తీసుకొచ్చిన యువ ఆటగాళ్లు జీవితానికి సరిపడా ఆనందాన్ని ఇచ్చారు. ప్రపంచకప్‌ విజయాల కంటే ఇదే అత్యుత్తమం.

- సెహ్వాగ్‌


మాటలు రావట్లేదు. గబ్బా కోట కూలిపోయింది. టెస్టు క్రికెట్లో ఇదో గొప్ప మ్యాచ్‌.  ఈ విజయం జట్టు సమష్టితత్వంతో సాధ్యమైంది. ధైర్యంగా ఉన్నపుడు ఎలాంటి  అడ్డంకి అయినా సులభంగానే కనిపిస్తుంది’’

- మిథాలీ రాజ్‌


బ్రిస్బేన్‌ టెస్టులో అద్భుత విజయం సాధించి బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని అట్టిపెట్టుకున్న భారత్‌కు హృదయపూర్వక అభినందనలు. మీరు చరిత్ర సృష్టించారు. మీ సంకల్పం, వెనకడగు వేయని తత్వంతో దేశం గర్వపడేలా చేశారు.

- ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు


హా ఏమి మ్యాచ్‌. టీమ్‌ఇండియా.. దేశం గర్వపడేలా చేసింది. నవ భారత దృఢ సంకల్పానికి ఇది నిదర్శనం. చాలా రోజుల తర్వాత లభించిన అత్యుత్తమ సిరీస్‌ విజయమిది

- తెలంగాణ మంత్రి కేటీ రామారావు


త్యుత్తమ టెస్టు సిరీస్‌ విజయాల్లో ఇదొకటి. భారత్‌కు అభినందనలు. ఆస్ట్రేలియా కూడా బాగానే ఆడింది. అద్భుతమైన సిరీస్‌ ఇది’’

- గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచయ్‌


కుర్రాళ్లలో ఆత్మవిశ్వాసం నింపిన రహానె జట్టును అద్భుతంగా నడిపించాడు. పుజారా మరోసారి తన దృఢమైన సంకల్పాన్ని ప్రదర్శించాడు. యువ బౌలింగ్‌ విభాగాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. ఇదో అమోఘమైన జట్టు.

- వీవీఎస్‌ లక్ష్మణ్‌


‘‘అత్యుత్తమ విజయం.. అద్వితీయమైన సిరీస్‌. అడిలైడ్‌లో ఘోర పరాజయం తర్వాత టీమ్‌ఇండియా గొప్పగా పుంజుకుంది. స్టార్‌ ఆటగాళ్లు లేకపోయినా సిరీస్‌ను సొంతం చేసుకోవడం చాలా గొప్ప విషయం. కొత్త తరం ఆటగాళ్లు సిరాజ్‌, విహారి, గిల్‌, శార్దూల్‌, సుందర్‌ల మానసిక స్థైర్యానికి ఈ విజయం నిదర్శనం. ఈ ప్రతిభావంతుల్ని గుర్తించి.. ఈస్థాయిలో సత్తాచాటి సిరీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించేలా వారిని సానబెట్టడంలో నేను, నా సహచరుల పాత్ర ఉన్నందుకు గర్వపడుతున్నా’’

- ఎమ్మెస్కే ప్రసాద్‌, సెలెక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌


‘జాతీయ జట్టుకు సారథ్యం వహించడం గొప్ప గౌరవం. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు కాబట్టి నేను నాయకుడిగా నేను మెరుగ్గా కనిపిస్తున్నా. ఆటగాళ్లంతా మైదానంలో ఆ స్ఫూర్తి, తెగువ చూపించారు. అడిలైడ్‌ టెస్టులో పరాజయం తర్వాత పుంజుకోవడం అంత తేలికేం కాదు. కానీ తర్వాత జరిగే టెస్టుల్లో ఫలితం గురించి ఆలోచించకుండా మెరుగ్గా ఆడాలనుకున్నాం. నాలుగో టెస్టు చివరి రోజు పోరాడాలని అనుకున్నాం. సెషన్ల వారీగా ఆడాలని నిర్ణయించాం. పంత్‌ మొదటి నుంచి ఛేదన కోసమే ఆడాడు. అతనితో పాటు పుజారా ఇన్నింగ్స్‌ మా విజయానికి పునాది వేసింది. గిల్‌ అద్భుతంగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో సుందర్‌-శార్దూల్‌ గొప్పగా బ్యాటింగ్‌ చేశారు. ఆటగాళ్లందరితో పాటు సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు. ఆసీస్‌పై సిరీస్‌ విజయాన్ని మేమే కాదు భారతీయులంతా ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు మేం గెలుపు సంబరాలు చేసుకుంటున్నాం. భారత్‌లో అడుగుపెట్టిన తర్వాత ఇంగ్లాండ్‌ సిరీస్‌ గురించి ఆలోచిస్తాం’’

- రహానె


‘‘నీ జీవితంలో మరచిపోలేని సందర్భాల్లో ఇదొకటి. నాకు సంతోషాన్నిచ్చే విషయమేంటంటే.. నేను ఆడనప్పుడు కూడా సహాయ సిబ్బంది, నా సహచరులు నాకు మద్దతుగా నిలిచారు. ఈ సిరీస్‌ నాకు కల లాంటిది. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నాకు అండగా నిలిచింది. ‘నువ్వు మ్యాచ్‌ విన్నర్‌వి. నువ్వు జట్టును గెలిపించాలి’ అని నాతో చెప్పింది. జట్టును గెలిపించాలని ప్రతి రోజూ అనుకునేవాడిని. ఈ రోజు గెలిపించా. పిచ్‌ కాస్త స్పిన్‌కు సహకరించింది. షాట్‌ సెలక్షన్‌ విషయంలో క్రమశిక్షణతో ఉండాలని ముందే అనుకున్నా’’

- రిషబ్‌ పంత్‌


‘‘సాధారణంగా భావోద్వేగానికి గురైనా నా కంట్లో నీళ్లు రావు. కానీ ఈసారి వస్తున్నాయి. ఎందుకంటే ఇది నమ్మశక్యంగా అనిపించట్లేదు. కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు. వర్ణించడానికి మాటలు రావట్లేదు. అతి గొప్ప టెస్టు సిరీస్‌ల్లో ఒకటిగా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ఓ వైపు కరోనా భయం.. మరో వైపు గాయల బెడద.. ఆ ఆపై 36కే ఆలౌట్‌. అలాంటి స్థితిలో పుంజుకోవడమనేది ఊహకందనిది. కానీ భారత ఆటగాళ్లు గొప్పగా పోరాడారు. టీమ్‌ ఇండియా సాధించిన ఈ సిరీస్‌ విజయాన్ని క్రికెట్‌ ప్రపంచం ఎప్పటికీ మరిచిపోదు. భారత జట్టు పర్యటనల్లో దీన్ని మించిన కఠిన పర్యటన లేదు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును అజింక్య గొప్పగా నడిపించాడు. సంయమనంతో వ్యవహరించాడు. దేనికీ ఆందోళన చెందలేదు’’

- రవిశాస్త్రిTags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన