close

ప్రధానాంశాలు

Published : 20/01/2021 03:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కష్టాలను దాటి.. మేటిగా ఎదిగి

ఒక్క అవకాశం రాగానే రాత్రికి రాత్రే ఎదిగిపోయినట్లు సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం.. కానీ ఈ కుర్రాళ్లు మాత్రం నిజంగానే ఒక్క అవకాశంతోనే ఎదిగిపోయారు! టీమ్‌ఇండియాకు ఆడే స్థాయికి చేరేందుకు ప్రతి దశలోనూ ఇబ్బందులతో పోరాడుతూ సమస్యల సవాళ్లను దాటిన సిరాజ్‌, సుందర్‌, శార్దూల్‌, నటరాజన్‌లు.. కఠిన పరిస్థితులు ఎదురైనా బెదరకుండా.. ఆస్ట్రేలియా లాంటి బలమైన ప్రత్యర్థిని, వారి సొంతగడ్డపైనే మట్టికరిపించారు.


సిరాజ్‌.. నడిపించాడు

స్ట్రేలియాతో రెండో టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లో అడుగుపెట్టిన హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌.. సిరీస్‌ ముగిసే సరికి భారత్‌ తరపున అత్యధిక వికెట్లు (13) తీసిన వీరుడిగా నిలిచాడు. రెండు టెస్టుల అనుభవంతోనే చివరి మ్యాచ్‌లో భారత బౌలింగ్‌ దళాన్ని సమర్థంగా నడిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్‌ మాత్రమే తీసినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అయిదు వికెట్లతో విజృంభించాడు. ఇప్పుడు అందరి చేత ప్రశంసలు పొందుతున్న అతను.. ఈ స్థాయికి చేరడం వెనక తన తండ్రి కష్టం ఉంది. కొడుకును క్రికెటర్‌ చేయాలనే లక్ష్యం కోసం ఆటో నడుపుతూ ఆ తండ్రి పడ్డ శ్రమకు ఫలితమే సిరాజ్‌కు వస్తున్న పేరు, ప్రతిష్ఠలు. తండ్రి చనిపోయినప్పటికీ.. బాధను దిగమింగుకుని చేసిన ప్రదర్శన చిరస్మరణీయం.


సుందర్‌.. ఆల్‌రౌండర్‌

మొదట ఆస్ట్రేలియాతో టీ20ల కోసమే ఎంపికైన స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌.. అనుకోకుండా వచ్చిన టెస్టు అరంగేట్ర అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.  తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన స్మిత్‌తో సహా మూడు వికెట్లు పడగొట్టిన అతను.. క్లిష్ట సమయాల్లో 62 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఓ వికెట్‌తో పాటు బ్యాటింగ్‌లో 22 పరుగులతో కీలక పాత్ర పోషించాడు.  మధ్యతరగతి కుటుంబానికి చెందిన అతను.. తన తండ్రి స్ఫూర్తితో క్రికెట్లో అడుగుపెట్టాడు. క్రికెటరైన తాను భారత జట్టుకు ఆడలేకపోయానని.. తన కొడుకైనా ఆ కలను అందుకోవాలని ఆ తండ్రి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సుందర్‌ను ప్రోత్సహిస్తూనే వచ్చాడు. చిన్న వయసులోనే అద్భుత ప్రదర్శనతో అందరి మన్ననలు పొందాడు.


సూపర్‌.. శార్దూల్‌

2018లో అరంగేట్ర టెస్టులో పది బంతులు వేయగానే గాయం కారణంతో మ్యాచ్‌ మొత్తానికే దూరమైన శార్దూల్‌ ఠాకూర్‌.. దాదాపు రెండేళ్ల తర్వాత ఆడిన టెస్టులో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పేసర్‌గానే ఎక్కువ మందికి తెలిసిన అతను.. తన బ్యాటింగ్‌ నైపుణ్యాలతోనూ మెప్పించాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో 67 పరుగులతో (ఆ ఇన్నింగ్స్‌లో భారత అత్యధిక స్కోరు) జట్టును కాపాడాడు. 186కే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును సుందర్‌తో కలిసి ఆదుకున్నాడు. భీకరమైన ప్రత్యర్థి బౌలింగ్‌కు ఎదురొడ్డి నిలబడ్డాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్లతో సత్తాచాటిన ఈ మహారాష్ట్ర ఆటగాడు..  జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.


నటరాజన్‌.. అనూహ్యంగా

కే పర్యటనలో మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచిన తంగరసు నటరాజన్‌.. ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్నాడు. ప్రధాన బౌలర్లు గాయాల కారణంగా దూరమవడంతో చివరి టెస్టులో ఆడే అవకాశం దక్కించుకున్న ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌.. తన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. స్వింగ్‌ను సమర్థంగా ఉపయోగించుకుంటూ.. కచ్చితమైన ప్రదేశాల్లో బంతులేసిన అతను తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లతో మెరిశాడు. 29 ఏళ్ల ఈ తమిళనాడు పేసర్‌ పేద కుటుంబం నుంచి వచ్చాడు. అతని తండ్రి రోజువారీ కూలీ.. తల్లి రోడ్డు పక్కన చికెన్‌ అమ్ముతోంది. అయినప్పటికీ ఆ పేదరికం అతణ్ని ఆపలేకపోయింది. కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి.. యార్కర్లపై పట్టు సాధించి ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన అతను.. టీమ్‌ఇండియా తరపునా గొప్పగా రాణించాడు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన