
ప్రధానాంశాలు
సాహో భారత్!
టీమ్ఇండియాపై ఆసీస్ మీడియా ప్రశంసల జల్లు
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాకు విదేశీ జట్లు టెస్టు సిరీస్ కోసం వస్తే ఎంత తేడాతో ఓడుతాయనే లెక్కల్లో ఉంటుంది అక్కడి మీడియా. ప్రపంచ క్రికెట్లో కంగారూల్ని మించిన జట్టే లేదన్నది వాళ్ల ధీమా! ఒకప్పటితో పోలిస్తే ఆసీస్ బలహీన పడ్డా ఆ మాటను అంగీకరించదు అక్కడి మీడియా. గత పర్యటనలో స్మిత్, వార్నర్ లేకే తమ జట్టు ఓడిందని తీర్మానించి.. ఈసారి వాళ్లిద్దరూ ఉన్న నేపథ్యంలో భారత్‌కు పరాభవం తప్పదని అంచనా కట్టేశారు అక్కడి మీడియా వాళ్లు. అందులోనూ అడిలైడ్‌లో 36 పరుగులకే కుప్పకూలి టీమ్ఇండియా ఘోర పరాభవం ఎదుర్కొన్నాక మన జట్టుకు వైట్ వాష్ తప్పదని తేల్చేశారు. కానీ రెండో టెస్టు నుంచి అద్భుతంగా పుంజుకుని రహానె సేన 2-1తో సిరీస్‌ను ఎగరేసుకుపోయింది. ఇది ఆస్ట్రేలియా ఆటగాళ్లకే కాదు.. అక్కడి మీడియాకు కూడా పెద్ద షాకే. ఈ షాక్ నుంచి కాస్త తేరుకుని భారత జట్టును ప్రశంసల్లో ముంచెత్తాయి ఆస్ట్రేలియా పత్రికలు. తమకు అద్భుతమైన అనుభూతుల్ని మిగిల్చినందుకు టీమ్ఇండియాకు ధన్యవాదాలంటూ ‘ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ కొనియాడితే.. భారత జట్టు చేసిన సాహసం మొత్తం క్రికెట్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తుందని ‘ది వెస్ట్ ఆస్ట్రేలియన్’ పొగిడింది. అత్యద్భుత సిరీస్‌కు ఇది గొప్ప ముగింపని, భారత్ ఎంతో తపనతో ఈ విజయాన్ని సాధించిందని ‘ది ఆస్ట్రేలియన్’ ప్రశంసించింది. మరోవైపు తమ జట్టుపై ఆస్ట్రేలియా మీడియా తీవ్ర స్థాయిలోనే విమర్శలు గుప్పించింది. ఈ ఓటమికి బాధ్యతగా కెప్టెన్ టిమ్ పైన్‌పై వేటు తప్పదన్న అభిప్రాయం మీడియాలోనే కాక కొందరు మాజీల్లో సైతం వ్యక్తమైంది.
‘‘ఈ ఓటమి తాలూకు పర్యవసానాలు తీవ్రంగా ఉండబోతున్నాయనుకుంటున్నా. బౌలర్ల ప్రదర్శనపై ప్రశ్నలు తలెత్తుతాయి. కొందరి స్థానాలు కూడా ప్రశ్నార్థకం అవుతాయి. భారత్ చాలా బాగా ఆడిందని చెప్పి తప్పించుకునే అవకాశం లేదు. సిరీస్‌కు భారత్ ఎంపిక చేసిన తొలి తుది జట్టులో ఇద్దరో ముగ్గురో మాత్రమే చివరి మ్యాచ్‌లో ఆడారు. భారత్‌ను దెబ్బ తీయడానికి ఆస్ట్రేలియాకు చాలా అవకాశాలు వచ్చినా ఉపయోగించుకోలేదు. కెప్టెన్ పైన్, అలాగే బౌలర్ల తప్పిదాలున్నాయి. అయితే చివరికి కెప్టెన్‌గా పైన్ బాధ్యత తీసుకోక తప్పదు’’
- షేన్ వార్న్
‘‘ఆస్ట్రేలియా ఈ సిరీస్‌లో పలు సందర్భాల్లో ప్రతికూల దృక్పథంతో ఆడింది. దూకుడుగా ఆడి గెలిచేందుకు ప్రయత్నించడం పోయి.. ఓడిపోతామన్న భయంతో ఆడటమే దెబ్బ తీసింది. తొలి బంతి నుంచి చివరి బంతి వరకు ఇంకొంచెం దూకుడు ప్రదర్శించి ఉండాల్సింది’’
- మైకేల్ క్లార్క్
‘‘అడిలైడ్ ఓటమి తర్వాత భారత జట్టు సిరీస్‌లో 0-4తో ఓడుతుందని అంచనా వేశా. ఆ ఓటమి, అలాగే సెలక్షన్ సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని అలా అన్నా. భారత జట్టు పుంజుకుంటుందని భారత అభిమానులు కూడా చాలామంది అనుకుని ఉండరు. కానీ ఇప్పుడు వాళ్లు నాకు చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పారు’’
- మైకేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
ప్రధానాంశాలు
సినిమా
- తప్పతాగేసి.. తోచినట్లు తోలేసి..
- గ్లామర్‌తో కట్టిపడేస్తున్న జూనియర్ సమంతలు!
- ఈమె పాక్ ‘ఐష్’!
- నయా దందా..
- ఆ పాపకు రూ.16 కోట్ల ఇంజెక్షన్..
- తల్లికాబోతున్న హీరోయిన్ రిచా
- నా మాజీ ప్రియుడు ఇంకా అక్కడే ఉండిపోయాడు
- వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
- తను ఛిద్రమైనా... బిడ్డ భద్రం
- చైనా నుంచి యాంగూన్కు రహస్యంగా విమానాలు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
