
ప్రధానాంశాలు
యువ హవా
చెన్నై
అనూహ్యంగా అందివచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఆ భారత యువ ఆటగాళ్లు.. ఆస్ట్రేలియాలో చారిత్రక విజయంలో భాగస్వాములయ్యారు. అరంగేట్రంలోనే అదిరిపోయే ప్రదర్శనతో సత్తా చాటారు. భారత జట్టు భవిష్యత్‌కు భరోసా కల్పిస్తున్నారు. వాళ్లే కంగారూ జట్టుతో చివరి టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లో అడుగుపెట్టిన పేసర్ నటరాజన్, స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, ఓపెనర్ శుభ్‌మన్ గిల్. ఒకే పర్యటనలో అన్ని ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించిన నటరాజన్.. అలా జరుగుతుందని ఊహించలేదంటున్నాడు. మరోవైపు అవకాశం వస్తే టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుందర్ చెబుతున్నాడు. ఒకప్పుడు బౌన్సర్లంటేనే భయపడ్డ తాను ఇప్పుడు ఆస్ట్రేలియా మేటి పేసర్లను ఎదుర్కొనే స్థాయికి ఎదిగేందుకు ఎంతో కష్టపడ్డట్లు గిల్ చెప్పాడు. కెరీర్లో ఎదుగుదల, ఆస్ట్రేలియా పర్యటనపై ఈ ముగ్గురు కుర్రాళ్లు చెప్పిన విశేషాలు వారి మాటల్లోనే..
ఓపెనింగ్ చేస్తా..
టెటెస్టుల్లో టీమ్ఇండియాకు ఓపెనింగ్ చేసే అవకాశం వస్తే అదృష్టమనే చెప్పాలి. తాను ఆడే రోజుల్లో స్పిన్నర్ నుంచి ఓపెనర్‌గా మారిన మా కోచ్ రవిశాస్త్రి లాగే నేనూ ఆ సవాలును స్వీకరిస్తా. తన కెరీర్‌లోని స్ఫూర్తిమంతమైన కథలను అతను మాకు చెప్తాడు. ప్రత్యేక స్పిన్నర్‌గా న్యూజిలాండ్‌పై అరంగేట్ర మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడంతో పాటు పదో స్థానంలో బ్యాటింగ్ చేసిన అతను.. ఆ తర్వాత టెస్టు ఓపెనర్‌గా మారి అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్లను ఎదుర్కొన్నాడు. నేనూ అతనిలా టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడడాన్ని ఇష్టపడతా. అండర్-19 దశలో టాప్ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గానే ఆడేవాణ్ని. ఆ తర్వాత ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌పై దృష్టి పెట్టి ఆల్‌రౌండర్‌గా మారా. ఆస్ట్రేలియాతో చివరి టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేసి.. బ్యాటింగ్ (62, 22)లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడడంతో పాటు బంతితో నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఆస్ట్రేలియాలో పరిమిత ఓవర్ల సిరీస్ తర్వాత టెస్టుల కోసం నెట్ బౌలర్‌గా నన్నక్కడే ఉండమనడం నాకు మేలు చేసింది. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ సూచనలు ఉపయోగపడ్డాయి. అక్కడి పిచ్‌లు పేస్, బౌన్స్‌కు అనుకూలంగా ఉంటాయి. అందుకే బంతిని వీలైనంత ఎక్కువ స్పిన్ చేశా. బౌన్స్ రాబట్టేందుకు ప్రయత్నించా. బ్రిస్బేన్‌లో తొలి రోజు పిచ్ స్పిన్నర్లకు పెద్దగా సహకరించలేదు. కానీ తొలి టెస్టు వికెట్ రూపంలో స్మిత్‌ను ఔట్ చేయడంతో కల నిజమైనట్లనిపించింది. చివరి రోజు ఛేదనలో పది ఓవర్లలో సుమారు 50 పరుగులు చేయాల్సిన పరిస్థితి రావడంతో.. పంత్‌తో కలిసి లక్ష్యాన్ని చేరుకుంటామనే నమ్మకం కలిగింది. ఓ వైపు పంత్ క్రీజులో ఉండడంతో బౌలర్లపై ఒత్తిడి ఉందని నాకు తెలుసు. మేం వేగంగా 25 నుంచి 30 పరుగులు రాబడితే లక్ష్యాన్ని చేరుకుంటామనిపించింది. మరికొన్ని రోజుల్లో ఇంగ్లాండ్‌తో టెస్టుల కోసం చెన్నైలో బయో బబుల్‌లో అడుగుపెట్టబోతున్న నేను.. ప్రస్తుతం ఇంట్లో అమ్మ వండిపెడుతున్న చికెన్ బిర్యానీని ఆస్వాదిస్తున్నా. అలాగే ప్రొఫెషనల్ క్రికెటరైన అక్క శైలజతో గడుపుతున్నా. క్రికెట్ విషయాల్లో ఆమె నాకు మార్గదర్శిగా నిలుస్తోంది.
ఒత్తిడికి గురయ్యా
ఆస్ట్రేలియాలో భారత నెట్ బౌలర్‌గా నా బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాలనే ఉద్దేశంతో ఉన్న నాకు మూడో వన్డేలో ఆడే అవకాశం వస్తుందని ఊహించలేదు. తొలిసారి టీమ్ఇండియా జెర్సీ వేసుకుని మైదానంలో దిగడంతో ఒత్తిడికి గురయ్యా. జాతీయ జట్టుకు ఆడడం, వికెట్ తీసుకోవడం కలలా అనిపించింది. ఆ తర్వాత టీ20ల్లో, చివరి టెస్టులోనూ జట్టులో చోటు దక్కింది. భారత్ తరపున ఆడడంతో కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. కోచ్‌లు, సహచర ఆటగాళ్లు నాకెంతో మద్దతుగా నిలిచారు. నాలో స్ఫూర్తి నింపారు. వాళ్ల అండతోనే మెరుగ్గా బౌలింగ్ చేయగలిగా. ఆసీస్ పిచ్‌లపై ఉండే బౌన్స్, పేస్‌ను ఉపయోగించుకుని వికెట్లు పడగొట్టగలిగా. కోహ్లి, రహానేల నాయకత్వంలో ఆడడాన్ని ఆస్వాదించా. వాళ్లు నన్ను బాగా చూసుకున్నారు. సానుకూల విషయాలు చెప్పి ప్రోత్సహించారు. మూడు ఫార్మాట్లలోనూ ఆడడానికి ప్రధాన కారణం.. నా సాధన, కోచ్‌లు. నా బలం గురించి తెలిసే వాళ్లు నాకు అవకాశాలిచ్చారు. ఎడమ చేతి వాటం (లెఫ్టార్మ్) పేసర్ కావడం నాకు అదనపు ప్రయోజనాన్ని కలిగించింది. నేనెప్పుడూ నా బలాన్ని నమ్ముకుంటా. అరంగేట్ర టెస్టు (సిరీస్‌లో చివరి టెస్టు) తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీయడం సంతోషాన్ని కలిగించింది. బ్యాటింగ్ చేసేందుకు చాలా కాలం తర్వాత క్రీజులోకి వచ్చా. స్టార్క్ వేసిన తొలి బంతిని నేను చూడనేలేదు. అదంత వేగంగా వచ్చింది. అయినప్పటికీ అదో మంచి అనుభవం. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ నాకెప్పుడూ అండగా నిలుస్తాడు. మేమిద్దరం కలిసి తమిళనాడు తరపున, తమిళనాడు ప్రిమియర్ లీగ్‌లో చాలా మ్యాచ్‌లాడాం. నాతో ఎంతో స్నేహంగా ఉండే అతను.. నన్ను నట్టూ అని పిలుస్తాడు. అలాగే నాకెంతో చేసిన సేలం క్రికెట్ సంఘానికి ఎప్పుడూ అండగా ఉంటా. వాళ్ల సహకారంతోనే నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్నా. ఇక్కడి యువ ఆటగాళ్ల కోసం నాకు సాధ్యమైన సాయం చేస్తా. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనేదానికి నేనే నిదర్శనం. గతేడాది నవంబర్‌లో మాకు పాప పుట్టడం కంటే కూడా.. దేశానికి ప్రాతినిథ్యం వహించినందుకే నేను, నా భార్య ఎక్కువగా గర్వపడుతున్నాం.
బౌన్సర్లంటే భయం!
‘‘ఒకప్పుడు నేను బౌన్సర్లంటే చాలా భయపడేవాణ్ని. ఛాతి ఎత్తులో వచ్చే బంతుల కోసం చాలా ముందే సిద్ధమయ్యేవాణ్ని. బాగా డ్రైవ్‌లు ప్రాక్టీస్ చేసేవాణ్ని. క్రమంగా స్ట్రెయిట్ బ్యాట్‌తో పుల్ షాట్ ఆడడంతో పరిణతి సాధించా. నేను ఇంకో షాట్లో కూడా నైపుణ్యం సాధించా. అదే కాస్త పక్కకు జరిగి కట్ ఆడడం. షార్ట్ డెలివరీలంటే భయం వల్ల ఎప్పుడూ బంతి లైన్‌కు దూరంగా ఉంటూ కట్ షాట్ ఆడేవాణ్ని. చిన్నప్పుడు ఈ రెండు మూడు షాట్లు నా ఫేవరెట్ షాట్లు. అవి ఇప్పుడు నాలో భాగమయ్యాయి. అప్పటికి నా వయసు తొమ్మిదేళ్లు. పెద్ద వయసు విభాగంలో ఆడమన్నారు. అక్కడో బౌలర్ ఉండేవాడు. చాలా వేగంగా బంతులేసేవాడు. అతడి బౌలింగ్‌లో ఆడేటప్పుడు బౌన్సర్లు వస్తాయని భయపడేవాణ్ని. అందుకే బౌన్సర్ వచ్చినప్పుడు వంగి తప్పించుకోవాలని ముందే నిర్ణయించుకున్నా. అతడు బౌన్సర్ వేశాడు. కానీ అది చాలా ముందు పిచ్ అయింది. అయినా నేను వంగడంతో బంతి నా బ్యాట్ అంచుకు తాకి బౌండరీకి వెళ్లింది. అతడు మరీ అంత ఫాస్ట్బౌలరేమీ కాదని అర్థమైంది. ఆ తర్వాత అతడి బౌలింగ్‌లో మరో 2-3 బౌండరీలు కొట్టాను. అందరూ ఆశ్చర్యపోయారు. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. తోలు బంతులు, బౌన్సర్ల విషయంలో నాలోని భయాలన్నీ పోయాయి. నేను 2007లో మొహాలీలో అకాడమీలో చేరాను. అయితే నా వయో విభాగం పిల్లలతో ఆడడాన్ని ఆస్వాదించలేకపోయా. ఈ విషయంలో మా నాన్నతో చెప్పా. నన్ను మరో విభాగంలో మార్చాలని ఆయన కోచ్‌ను కోరాడు. కానీ కోచ్ నాకు బంతి తగులుతుందేమోనని భయపడ్డాడు. కానీ ఒక్కసారి నా ఆట చూసి నిర్ణయం తీసుకోవాలని మా నాన్న విజ్ఞప్తి చేశాడు. దాంతో కోచ్ ఓ బౌలర్‌ను పిలిచి నాకు బౌలింగ్ చేయించాడు. బాగా ఆడడంతో నన్ను అండర్-14లోకి పంపించాడు. అప్పటికి నా వయసు ఎనిమిదేళ్లు.
ప్రధానాంశాలు
సినిమా
- మాగంటిబాబు కుమారుడి కన్నుమూత
- ఆఫర్ కోసం చిరు, పవన్‌లకు కాల్ చేశా: కోట
- సొంతవాళ్లే నన్ను మోసం చేశారు: రాజేంద్రప్రసాద్
- అఫ్రిది అల్లుడవుతున్న షహీన్
- తెలుగు హీరోయిన్ కోసం బన్నీ పట్టుబట్టాడు
- జూమ్‌కాల్‌లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్!
- ఆచార్య ఫొటో వైరల్.. ఇలియానా బెంగ
- ఆ సినిమా ఫ్లాప్..నితిన్‌కి ముందే తెలుసు
- ఐపీఎల్ 2021 భారత్‌లో.. అంతా బయటే
- సచిన్ వదిలేశాడు.. ధోనీ అందిపుచ్చుకున్నాడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
