నిరీక్షణ ముగిసేనా?
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 01/02/2021 01:10 IST

నిరీక్షణ ముగిసేనా?

తుది జట్టులో చోటుపై కుల్‌దీప్‌ ఆశ
ఇంగ్లాండ్‌తో టెస్టుల్లో ఆడేనా?
చెన్నై

ఆస్ట్రేలియాలో సిరీస్‌లో దాదాపు టీమ్‌ఇండియా ప్రధాన ఆటగాళ్లందరూ గాయాలతో దూరమవడంతో.. తుది పదకొండు మందిని వెతుక్కోవాల్సిన పరిస్థితుల్లోనూ కుల్‌దీప్‌ యాదవ్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. నెట్‌ బౌలర్లకూ అరంగేట్రం చేసే అవకాశం దక్కింది కానీ జట్టుతో పాటే ఉన్న అతనికి మాత్రం మొండిచేయే ఎదురైంది. ఇప్పుడు గాయంతో జడేజా ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరమవడంతో స్వదేశంలో ఆడే అవకాశం దక్కుతుందనే ఆశతో ఈ మణికట్టు స్పిన్నర్‌ ఉన్నాడు. మరి అతని నిరీక్షణ ఫలిస్తుందా?

ణికట్టు స్పిన్నర్‌గా కెరీర్‌ ఆరంభంలో గొప్పగా రాణించి జట్టులో సుస్థిర స్థానం దిశగా సాగిన కుల్‌దీప్‌ యాదవ్‌.. ఇప్పుడు జట్టులో చోటు కోసం ఎదురుచూసే స్థితికి  చేరుకున్నాడు. 2017లో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన ఈ చైనామన్‌ స్పిన్నర్‌ ఇప్పటివరకూ కేవలం ఆరు టెస్టుల్లో మాత్రమే ఆడగలిగాడు. ఓ వైపు అశ్విన్‌, జడేజా సుదీర్ఘ ఫార్మాట్లో పాతుకుపోవడం.. మరోవైపు తన  ప్రదర్శన దిగజారడంతో అతనికి అవకాశాలు రావట్లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ స్పిన్నర్ల కోటాను వాషింగ్టన్‌ సుందర్‌, చాహల్‌ భర్తీ చేస్తున్నారు. ఐపీఎల్‌లోనూ అతను విఫలమవడం తన ఎంపికపై ప్రభావం చూపిస్తోంది. 2019లో కేకేఆర్‌ తరపున 9 మ్యాచ్‌లాడి కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. గత సీజన్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో ఒకే వికెట్‌ పడగొట్టాడు.

‘‘ఓ దశలో మంచి ప్రదర్శన చేయట్లేదంటే మన బౌలింగ్‌ను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పటివరకూ చేసిన తప్పులను భవిష్యత్‌లో పునరావృతం చేయకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడూ మెరుగవుతూనే ఉండాలి. అత్యుత్తమ ప్రమాణాలను కొనసాగించాలి. ఐపీఎల్‌లో ఆడినపుడు నాపై ఉండే అంచనాలు ఒత్తిడిని కలిగిస్తాయి. దాని నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలి. చిన్నతనంలో ఫాస్ట్‌బౌలర్‌గా కెరీర్‌ మొదలెట్టిన నేను.. ఆ తర్వాత నా తక్కువ ఎత్తు కారణంగా స్పిన్నర్‌గా మారాల్సి వచ్చింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపైనే నా దృష్టి’’

- కుల్‌దీప్‌

వచ్చినట్టే వచ్చి..: ఆస్ట్రేలియా పర్యటనలో (2020-21) ఓ వన్డేలో ఆడే అవకాశం వచ్చిన కుల్‌దీప్‌ కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే పడగొట్టగలిగాడు. ఆ తర్వాత టెస్టుల్లో ఆటగాళ్లు ఒక్కొక్కరిగా గాయాలతో దూరమవడంతో తుది జట్టు కోసం క్రికెటర్లను వెతుక్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా మూడో టెస్టులో అశ్విన్‌, జడేజా ఇద్దరూ గాయపడి చివరి మ్యాచ్‌కు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడే జట్టుతో ఉన్న కుల్‌దీప్‌ ఆ మ్యాచ్‌లో ఆడతాడని అంతా అనుకున్నారు. ఎందుకంటే చివరగా ఆస్ట్రేలియాలో అతనాడిన టెస్టు (2019లో సిడ్నీ) ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లూ తీశాడు. కానీ అతణ్ని కాదని అనూహ్యంగా నెట్‌    బౌలర్‌గా ఉన్న వాషింగ్టన్‌ సుందర్‌కు అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. ఆ మ్యాచ్‌లో అతనే ఏకైక స్పిన్నర్‌గా ఆడాడు. బంతిని తిప్పడంతో పాటు బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం ఉండడంతో అతణ్ని ఆడించారు. తన ఎంపికకు న్యాయం చేసిన అతను.. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మెప్పించాడు. అలా ఆ అవకాశం కుల్‌దీప్‌ చేజారింది.
ఇప్పుడైనా..: గాయంతో ఉన్న జడేజాను ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు ఎంపిక చేయకపోవడంతో ఆ స్థానంలో కుల్‌దీప్‌ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మ్యాచ్‌ జరిగే చెపాక్‌ పిచ్‌పై పచ్చిక ఎక్కువగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ పిచ్‌ ఎప్పటిలాగే ఉన్నప్పటికీ జట్టు ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగనుంది. ఈ నేపథ్యంలో ఆ పిచ్‌పై జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌ కంటే కూడా కుల్‌దీప్‌ ఎక్కువ ప్రభావవంతంగా కనిపించగలడని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘‘పిచ్‌ పరిస్థితిని బట్టి ఆటగాళ్ల ఎంపికపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలని అనుకుంటే అక్షర్‌ కంటే కుల్‌దీప్‌నే తీసుకోవాలని చెప్తా’’ అని టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ శివరామకృష్ణన్‌ చెప్పాడు. కాగితంపై చూస్తే జడేజాకు ప్రత్యామ్నాయంగా అక్షర్‌ కనిపిస్తున్నప్పటికీ.. బ్యాటింగ్‌కు అనుకూలించే ఆ పిచ్‌పై ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ను కుల్‌దీప్‌ ఇబ్బంది పెట్టగలడని టీమ్‌ఇండియా మాజీ మేనేజర్‌ సునీల్‌ సుబ్రమణ్యం అన్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన