అలాంటి అశ్విన్‌.. ఇలా!
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 17/02/2021 04:09 IST

అలాంటి అశ్విన్‌.. ఇలా!

‘‘కొందరు అంచనా వేస్తున్నట్లు స్పిన్‌ వల్లే వికెట్లు పడ్డాయని అనుకోవట్లేదు. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఆలోచన విధానమే మాకు వికెట్లిచ్చింది. పేస్‌, మేధస్సుతో వికెట్లు తీశా. పిచ్‌కు తగ్గట్లుగా సన్నద్ధమైన విధానం ఫలితాల్ని ఇస్తోంది. నేను భిన్నంగా సిద్ధమయ్యా. గాలి వేగాన్ని ఉపయోగించుకున్నా. భిన్న కోణాల్లో బంతిని విడుదల చేశా. రనప్‌ వేగంలోనూ మార్పులు చేసుకున్నా. ఇవన్నీ పనిచేశాయి’’  

-అశ్విన్‌

ఇంగ్లాండ్‌తో సొంతగడ్డపై సిరీస్‌లో టీమ్‌ఇండియానే ఫేవరేట్‌గా కనిపించింది. కానీ తొలి టెస్టులో రూట్‌సేన చేతిలో ఓటమితో భారత్‌కు భంగపాటు ఎదురైంది. తర్వాతి మ్యాచ్‌లో గెలవకపోతే అంతే సంగతులు! అలాంటి స్థితిలో జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌ ఎవరాడతారు? అంటే అందరి చూపు.. కోహ్లి, పుజారా, రహానె లాంటి అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌పైనే నిలిచింది. కానీ వీళ్లను దాటి అద్భుత ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించాడు అశ్విన్‌. పిచ్‌ స్పిన్‌కు అనుకూలం కాబట్టి బౌలింగ్‌లో తనకు తిరుగులేదని తెలిసిందే. కానీ బ్యాటింగ్‌కు క్లిష్టంగా మారిన పిచ్‌పై.. ప్రధాన ఆటగాళ్లే చేతులెత్తేసిన పరిస్థితుల్లో అతను శతకం చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. కానీ అనూహ్యంగా సెంచరీ కొట్టేశాడు. బంతితోనే కాదు బ్యాట్‌తోనూ రాణించి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. అశ్విన్‌ అంటే జట్టులో ప్రధాన స్పిన్నరని అంటారు. కానీ కెరీర్‌ ఆరంభంలో ఉవ్వెత్తున ఎగసి.. ఆ తర్వాత నిలకడగా రాణించిన అతనికి.. ఓ దశలో జట్టులో చోటే లేకుండా పోయింది. అందుకు కారణం మణికట్టు స్పిన్నర్లైన చాహల్‌, కుల్‌దీప్‌. వాళ్ల రాకతో వేళ్ల స్పిన్నరైన అశ్విన్‌కు ప్రాధాన్యత తగ్గింది. క్రమంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో స్థానం గల్లత్తైంది. ఆ తర్వాత టెస్టుల్లోనూ చోటు ప్రశ్నార్థకమైంది. విదేశాల్లో రాణించట్లేదని పక్కకుపెట్టారు. 2018లో భారత్‌ 14 టెస్టులాడితే అతను 10 మ్యాచ్‌ల్లోనే ప్రాతినిథ్యం వహించాడు. 2019లో ఎనిమిదింట్లో మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ప్రతి ఒక్క ఆటగాడికి కెరీర్‌లో గడ్డుకాలమనేది ఉంటుంది. ఆ పరిస్థితులను అతనెలా ఎదుర్కొంటాడనేది ముఖ్యం. అశ్విన్‌ ఇక్కడే తన ప్రత్యేకతను చాటాడు. జాతీయ జట్టులో స్థానం దక్కని సమయంలో దేశవాళీల్లో తమిళనాడు తరపున ఆడుతూ బౌలింగ్‌కు సానబెట్టాడు. వైవిధ్యముంటేనే పోటీని తట్టుకోగలమని నమ్మి లెగ్‌స్పిన్‌ కూడా నేర్చుకున్నాడు. క్యారమ్‌ బంతి, ఆఫ్‌ కట్టర్‌ లాంటి అస్త్రాలను అమ్ములపొదిలో చేర్చుకున్నాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ ఆలోచనలను చదవడంలో ఆరితేరాడు. తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో బ్యాట్స్‌మన్‌గానూ తిరిగి ప్రాణం పోసుకున్నాడు. సిడ్నీ టెస్టుల్లో వెన్నునొప్పి బాధిస్తున్నా విహారితో కలిసి పోరాడి జట్టును గట్టెక్కించిన అతను.. అదే ఆత్మవిశ్వాసంతో ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో శతకం అందుకున్నాడు. బంతితో మాయ చేసే అతను.. బ్యాట్‌తోనూ ఇదే జోరు కొనసాగిస్తే జట్టుకు మరింత బలం చేకూరినట్లే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన