దిగ్గజాలకు దగ్గరగా..
close

ప్రధానాంశాలు

Published : 22/02/2021 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిగ్గజాలకు దగ్గరగా..

జకో ఖాతాలో 18వ గ్రాండ్‌స్లామ్‌
తొమ్మిదో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సొంతం
ఫైనల్లో మెద్వెదెవ్‌పై గెలుపు
మెల్‌బోర్న్‌

ఫెదరర్‌.. నాదల్‌.. పురుషుల టెన్నిస్‌లో ఆల్‌ టైమ్‌ గేట్స్‌! ఒకానొక సమయంలో వీరికి   సమీపంగానైనా రాగలడా అన్నట్టుండేవాడు జకోవిచ్‌. కానీ పునరాగమనంలో అదిరే ఫామ్‌తో చెలరేగుతున్న ఈ ప్రపంచ నంబర్‌వన్‌ రోజర్‌, రఫెల్‌లకు దగ్గరగా వచ్చేశాడు. మెద్వెదెవ్‌ను ఓడించి రికార్డు స్థాయితో తొమ్మిదో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలవడం ద్వారా గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల సంఖ్యను 18కి పెంచుకున్న జకో.. రోజర్‌, నాదల్‌ (చెరో 20 టైటిళ్లు)లను అందుకునే దిశగా మరో అడుగు ముందుకేశాడు. ఈ విజయంతో ఫెదరర్‌ (310)ను దాటి అత్యధిక వారాలు (311) నంబర్‌వన్‌గా ఉన్న రికార్డును కూడా నొవాక్‌ సొంతం చేసుకోబోతున్నాడు.
వింబుల్డన్‌ అనగానే ఫెదరర్‌.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ పేరు చెబితే  నాదల్‌.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రస్తావన వస్తే జకోవిచ్‌ పేరే చెప్పుకోవాలేమో! ఎందుకంటే ఈ సెర్బియా యోధుడు రాడ్‌లేవర్‌ మైదానంలో వేసిన ముద్ర అలాంటిది మరి! గత పదమూడు టోర్నీల్లో నొవాక్‌ ఏకంగా తొమ్మిదింటిని గెలిచాడంటేనే అతడి ఆధిపత్యాన్ని ఊహించొచ్చు. ఆదివారం కూడా అతడిదే! దాదాపు ఏకపక్షంగా సాగిన పురుషుల సింగిల్స్‌ తుది పోరులో టాప్‌సీడ్‌, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జకో 7-5, 6-2, 6-2తో నాలుగో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా)పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఆద్యంతం జకోదే జోరు. క్రాస్‌కోర్టు విన్నర్లతో పాటు తనకెంతో ఇష్టమైన నెట్‌ గేమ్‌తో డానియల్‌ను ముప్పతిప్పలు పెట్టిన నొవాక్‌ చూస్తుండగానే మ్యాచ్‌పై పట్టు సాధించేశాడు. గత పన్నెండు మ్యాచ్‌ల్లో టాప్‌-10 ఆటగాళ్లందరిని ఓడించిన రికార్డు ఉన్న డానియల్‌కు ఫైనల్లో మాత్రం జకో చిక్కలేదు. సుదీర్ఘ ర్యాలీలు ఆడినా పాయింట్లు దక్కకపోవడంతో మెద్వెదవ్‌ ఒక దశలో రాకెట్‌ను నేలకేసికొట్టి అసహనం వ్యక్తం చేశాడు. ఈ పోరులో 13 గేమ్‌లలో 11 గేమ్‌లను నొవాక్‌నే సొంతం చేసుకున్నాడు. తొలి సెట్‌లో తప్ప.. మెద్వెదెవ్‌కు జకో అవకాశమే ఇవ్వలేదు. నేరుగా మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన ఏడు వేల మందికి పైగా అభిమానులకు వినోదాన్ని పంచుతూ శక్తివంతమైన ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో తన శైలిలో విజృంభించాడు. మెద్వెదెవ్‌ను కోర్టులో పరుగులెత్తెలా చేసి పాయింట్లు సాధించిన ఈ టాప్‌సీడ్‌ మ్యాచ్‌లో ఎక్కువశాతం డ్రాప్‌ షాట్లకే ప్రాధాన్యం ఇచ్చాడు. దీంతో కెరీర్‌లో రెండో ఫైనల్‌ ఆడుతున్న మెద్వెదెవ్‌ ఒత్తిడికి లోనై పదే పదే అనవసర తప్పిదాలు చేశాడు. ఎక్కువసార్లు బంతిని నెట్‌కు కొట్టాడు. తొలి రెండు సెట్లలో అయిదుసార్లు డానియల్‌ సర్వీస్‌ చేజార్చుకున్నాడంటేనే నొవాక్‌ జోరును అర్థం చేసుకోవచ్చు. అయితే మధ్య మధ్యలో కొన్ని మెరుపు షాట్లు ఆడినా.. జకో దూకుడు ముందు అవి ఏమాత్రం సరిపోలేదు. ఆఖరి సెట్లో అతని జోరు మరింత ఎక్కువైంది. వరుసగా తొలి మూడు గేమ్‌లు సొంతం చేసుకున్న జకో ఆపై 5-2తో ఆధిక్యంలో నిలవడమే కాక.. అదే జోరును కొనసాగిస్తూ ఓ మెరుపు ఫోర్‌హ్యాండ్‌ విన్నర్‌తో ఘనంగా మ్యాచ్‌ను ముగించాడు. విజయం సాధించిన తర్వాత కోర్టులో వెల్లకిలా పడుకుని చేతులు చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఈ పోరులో మూడు ఏస్‌లు సంధించిన జకో.. 20 విన్నర్లు కొట్టాడు. కెన్‌ రోజ్‌వెల్‌ (36 ఏళ్లు), రోజర్‌ ఫెదరర్‌ (35 ఏళ్లు) తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గిన పెద్ద వయస్కుడు జకో (33)నే.

6 గత పది గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో జకో గెలిచిన టైటిళ్లు

90 ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో నొవాక్‌ ఆడిన మ్యాచ్‌లు. ఇందులో 82 గెలిచి.. 8 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడాడు.

9 జకోవిచ్‌ నెగ్గిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిళ్లు. వరుసగా అతడికిది మూడో ట్రోఫీ. ఫైనల్‌కు వచ్చిన ప్రతిసారీ అతణ్ని విజయం వరించింది. ఈ టోర్నీలో పురుషుల్లో అత్యధిక టైటిళ్ల రికార్డు  జకోదే.

‘‘డానియల్‌ గొప్పగా ఆడావ్‌. కోర్టులో నేను తలపడిన కఠిన ప్రత్యర్థుల్లో నువ్వొకడివి. నువ్వు కచ్చితంగా గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుస్తావు. కానీ కొన్నేళ్లు ఆగాలి మరి (నవ్వుతూ).. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో నా ప్రేమాయణం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా’’

- జకోవిచ్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన