close

ప్రధానాంశాలు

Updated : 24/02/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహా మైదానంలో మెగా సమరం

మొతేరాలో గులాబి బంతి పోరు
ఇంగ్లాండ్‌తో భారత్‌ ఢీ
అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంలో తొలి మ్యాచ్‌ నేడే
మధ్యాహ్నం 2.30 నుంచి
అహ్మదాబాద్‌

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంలో మ్యాచ్‌..  పైగా అది డేనైట్‌లో, గులాబి బంతితో జరిగే టెస్టు సమరం.. అందులో తలపడేదేమో అగ్ర జట్లు భారత్‌, ఇంగ్లాండ్‌.. ఇరు జట్ల మధ్య సిరీస్‌ 1-1తో సమమై, ఆధిక్యం సాధించేదెవరనే ఉత్కంఠ రేకెత్తిస్తోంది.. ఈ మ్యాచ్‌ ఫలితం మీదే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో పోటీ పడే రెండో జట్టేదో దాదాపు తేలిపోతుంది. బుధవారం మొతేరా మైదానంలో ఆరంభమయ్యే భారత్‌-ఇంగ్లాండ్‌ మూడో టెస్టును క్రికెట్‌ ప్రపంచమంతా అమితాసక్తితో చూడటానికి ఇంతకంటే కారణాలేం కావాలి?

క్షా పది వేల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంగా రూపుదిద్దుకున్న మొతేరా మైదానంలో తొలి మ్యాచ్‌కు సర్వం సిద్ధం! భారత్‌-ఇంగ్లాండ్‌ మూడో టెస్టు ఇక్కడ బుధవారమే ఆరంభం కానుంది. అసలే భారీ స్టేడియం.. పైగా డేనైట్‌లో, గులాబి బంతితో మ్యాచ్‌ జరగబోతుండటం క్రికెట్‌ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. చెన్నైలో తొలి టెస్టులో  భారత్‌కు షాకిచ్చిన ఇంగ్లాండ్‌.. రెండో మ్యాచ్‌లో అంతకంటే పెద్ద షాక్‌ తింది. ఇప్పుడు మూడో టెస్టులో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరం. తొలి టెస్టులో చిత్తయ్యాక రెండో టెస్టులో బలంగా పుంజుకుని ప్రత్యర్థిని గట్టి దెబ్బ తీయడం భారత్‌ ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. టెస్టు ఛాంపియన్‌షిప్‌ పట్టికలో రెండో స్థానాన్ని నిలబెట్టుకుని, ఫైనల్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్‌ ఈ మ్యాచ్‌లో ఓడకూడదు. భారత ఫాస్ట్‌బౌలర్‌ ఇషాంత్‌ శర్మకు ఇది వందో టెస్టు కావడం విశేషం.


బహుపరాక్‌

రెండో టెస్టులో చిత్తుగా ఓడినప్పటికీ ఇంగ్లాండ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదన్నది స్పష్టం. ఈ మ్యాచ్‌ పరిస్థితులు ఆ జట్టుకు బాగా కలిసొచ్చేవే. పైగా బెయిర్‌స్టో, అండర్సన్‌, ఆర్చర్‌, క్రాలీల పునరాగమనంతో ఆ జట్టు బలం పెరగబోతోంది.  ఆ జట్టు పుంజుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. పరిస్థితులు స్వింగ్‌కు అనుకూలిస్తే అండర్సన్‌, ఆర్చర్‌లను ఆపడం కష్టమే. గత మ్యాచ్‌లో మాదిరి బ్యాట్స్‌మెన్‌ భారీ స్కోరు చేయడం ఎంతో అవసరం. రోహిత్‌ తరహా ఇన్నింగ్స్‌లు ఒకట్రెండు పడాల్సిందే. కోహ్లి ఈ మ్యాచ్‌తో అయినా తన శతక దాహాన్ని తీర్చుకుంటాడేమో చూడాలి. గిల్‌, పుజారా, రహానెల నుంచి కూడా భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది భారత్‌. ఇంగ్లాండ్‌కు అడ్డుకట్ట వేయాలంటే విదేశాల్లో మాదిరే బుమ్రా సొంతగడ్డ మీదా విజృంభించాల్సిన అవసరముంది. అనుకూల పరిస్థితుల మధ్య ఇషాంత్‌ శర్మ తన వందో టెస్టును చిరస్మరణీయం చేసుకోవాలని జట్టు కోరుకుంటోంది.


తుది జట్టులో ఎవరు?

గులాబి టెస్టుకు ఇరు జట్ల తుది జట్లు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.చెపాక్‌ స్పిన్‌ పిచ్‌ పైనా పెద్దగా ప్రభావం చూపని కుల్‌దీప్‌ యాదవ్‌పై వేటు తప్పదు. అతడి స్థానంలో ఉమేశ్‌ యాదవ్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. గత మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న బుమ్రా ఈ టెస్టులో ఆడనున్న నేపథ్యంలో అతడి కోసం సిరాజ్‌ తన స్థానాన్ని త్యాగం చేయాల్సిందే. ఆడిన తొలి టెస్టులోనే ఆకట్టుకున్న అక్షర్‌ పటేల్‌.. అశ్విన్‌తో స్పిన్‌ బాధ్యతలు పంచుకునే అవకాశముంది. ఇంగ్లిష్‌ జట్టు మూణ్నాలుగు మార్పులతో బరిలోకి దిగబోతోంది. క్రాలీ ఫిట్‌నెస్‌ సాధించడంతో బర్న్స్‌పై వేటు తప్పదు. బెయిర్‌స్టో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో లారెన్స్‌ తుది జట్టుకు దూరం కానున్నాడు.గత మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న అండర్సన్‌, ఆర్చర్‌ పునరాగమనం ఖాయం. బ్రాడ్‌కు తుది జట్టులో చోటుండకపోవచ్చు. స్పిన్నర్‌ లీచ్‌ కచ్చితంగా మ్యాచ్‌ ఆడతాడు. రెండో స్పిన్నర్‌ను ఆడించాలనుకుంటే బెస్‌కు అవకాశం దక్కుతుంది. లేదంటే వోక్స్‌ను మూడో స్పెషలిస్టు పేసర్‌గా ఎంచుకునే అవకాశముంది.


తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌, గిల్‌, పుజారా, కోహ్లి (కెప్టెన్‌), రహానె, పంత్‌ (వికెట్‌ కీపర్‌), అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, ఇషాంత్‌, ఉమేశ్‌, బుమ్రా

ఇంగ్లాండ్‌: సిబ్లీ, క్రాలీ, బెయిర్‌స్టో, రూట్‌ (కెప్టెన్‌), స్టోక్స్‌, పోప్‌, ఫోక్స్‌ (వికెట్‌ కీపర్‌), బెస్‌/వోక్స్‌, ఆర్చర్‌, లీచ్‌, అండర్సన్‌


పిచ్‌ మర్మమేంటో?

తొలి రెండు టెస్టుల్లో పిచ్‌ గురించి ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. మూడో టెస్టు ముంగిట ఆ చర్చ మరింత ఊపందుకుంది. సాధారణంగా మొతేరా పిచ్‌ స్పిన్నర్లకు   అనుకూలం. కానీ గులాబి బంతితో మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో పిచ్‌పై పచ్చిక  ఉంచాల్సిందే. అయితే అది ఏ స్థాయిలో ఉంటుందన్నదే కీలకం. మ్యాచ్‌కు రెండు రోజుల ముందు పిచ్‌పై బాగా పచ్చిక కనిపిస్తోందని, కానీ ఆట ఆరంభమయ్యేసరికి ఆ స్థాయిలో ఉండదని తేల్చి చెప్పేశాడు అండర్సన్‌. ఈ నేపథ్యంలో పిచ్‌ను ఎలా సిద్ధం చేస్తారో, మ్యాచ్‌లో అది ఎప్పుడు ఎలా స్పందిస్తుందో అంతుబట్టని స్థితిలో ఉన్నారంతా. పిచ్‌ను పూర్తిగా పేసర్లకు అనుకూలంగా మారిస్తే మంచి ఫాస్ట్‌బౌలింగ్‌ దళం ఉన్న ఇంగ్లాండ్‌ నుంచి ముప్పు తప్పదు కాబట్టి.. పేస్‌, స్పిన్‌కు సహకరించేలా సమతూకంతో ఉండే పిచ్‌ను సిద్ధం చేసే అవకాశముంది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ గురించి మేమిప్పుడు ఆలోచించట్లేదు. ఒక మ్యాచ్‌ గెలిచి ఒక మ్యాచ్‌ డ్రా చేసుకుని ఆ మ్యాచ్‌కు అర్హత సాధిద్దామని చూడట్లేదు. రెండు మ్యాచ్‌లూ గెలవాలన్నదే మా లక్ష్యం. ఇవి రెండు క్రికెట్‌ మ్యాచ్‌లు. అంతవరకే మా ఆలోచన. మ్యాచ్‌లో బంతి స్వింగవుతుందా లేదా అని కచ్చితంగా చెప్పలేం. ఎరుపు బంతితో పోలిస్తే గులాబి బాగా స్వింగ్‌ అవుతుందని మాత్రం తెలుసు. ఈ మ్యాచ్‌లోనూ స్పిన్నర్ల ప్రభావం కచ్చితంగా ఉంటుంది. కానీ కొత్త బంతితో పేసర్ల ప్రభావాన్ని తక్కువగా చూడలేం. ఇంగ్లాండ్‌ బలాబలాల గురించి మేం పెద్దగా ఆలోచించట్లేదు. ఆ జట్టును వారి సొంతగడ్డ మీదే ఓడించాం. పిచ్‌ పేసర్లకు అనుకూలంగా ఉంటే మాకూ మంచిదే. మా జట్టులోనూ నాణ్యమైన పేసర్లున్నారు’’

- విరాట్‌ కోహ్లి


2

భారత్‌ ఆడిన డేనైట్‌ టెస్టులు. 2019లో తొలి మ్యాచ్‌లో (ఈడెన్‌ గార్డెన్స్‌) బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్‌ విజయం సాధించింది. అడిలైడ్‌లో గత డిసెంబరులో ఆస్ట్రేలియాతో మరో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. మూడు డేనైట్‌ టెస్టులాడిన ఇంగ్లాండ్‌ ఒకటి నెగ్గి, రెండు ఓడింది.
* పునర్నిర్మాణానికి ముందు చివరగా మొతేరాలో జరిగిన టెస్టులోనూ భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లే తలపడ్డాయి. పుజారా డబుల్‌ సెంచరీ (206) సాధించిన ఆ మ్యాచ్‌లో భారత్‌ 9 వికెట్ల తేడాతో నెగ్గింది.


15

ప్రపంచ క్రికెట్లో ఇప్పటిదాకా జరిగిన డేనైట్‌ టెస్టులు. వీటిలో పేసర్లు 24.47 సగటుతో 354 వికెట్లు తీస్తే.. స్పిన్నర్లు 35.38 సగటుతో 115 వికెట్లే పడగొట్టారు.


34

సెంచరీ లేకుండా కోహ్లి ఆడిన ఇన్నింగ్స్‌లు. చివరగా 2019లో బంగ్లాదేశ్‌పై ఈడెన్‌ గార్డెన్స్‌లో అతను మూడంకెల స్కోరును అందుకున్నాడు. అది భారత్‌ ఆడిన తొలి డేనైట్‌ టెస్టు కావడం విశేషం. గతంలో ఎప్పుడూ కోహ్లి ఇన్ని ఇన్నింగ్స్‌ల పాటు శతకాన్నందుకోకుండా లేడు.


100

ప్రస్తుత మ్యాచ్‌తో కలిపి ఇషాంత్‌ టెస్టుల సంఖ్య. కపిల్‌ దేవ్‌ (131) తర్వాత ఈ మైలురాయిని అందుకోనున్న భారత ఫాస్ట్‌బౌలర్‌ అతనే.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన