close

ప్రధానాంశాలు

Published : 28/02/2021 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మంచి పిచ్‌ అంటే ఏంటి?

మండిపడ్డ అశ్విన్‌

అహ్మదాబాద్‌: భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు కోపమొచ్చింది. మొతేరాలో స్పిన్‌కు దాసోహమన్న పిచ్‌ మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఓ బ్రిటిష్‌ జర్నలిస్టు వేసిన ప్రశ్నకు అతను తనదైన శైలిలో జవాబిచ్చాడు. మొతేరా పిచ్‌ టెస్టు మ్యాచ్‌కు సరిపోయే పిచ్‌యేనా అంటూ అశ్విన్‌ను వర్చువల్‌ విలేకరుల సమావేశంలో ఓ బ్రిటిష్‌ జర్నలిస్టు ప్రశ్నించాడు. దీనికి అశ్విన్‌ బదులిస్తూ.. ‘‘అసలు మంచి పిచ్‌ ఏంటి మీ ఉద్దేశంలో ఏంటో చెప్పండి. దాన్ని ఎవరు నిర్వచిస్తారు. తొలి రోజు పేసర్లకు సహకరించి, తర్వాత బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించి.. చివర్లో స్పిన్నర్లు ఆధిపత్యం చలాయిస్తే అది మంచి వికెటా? ఇలాంటి వాటి నుంచి బయటికి రండి. పిచ్‌ గురించి రాద్దాంతం అనవసరం. ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల నుంచి పిచ్‌పై ఎలాంటి ఫిర్యాదుల్లేవు. వాళ్లు ఇక్కడి పిచ్‌లపై మెరుగు పడాలనుకుంటున్నారు. బయటి వాళ్లే పిచ్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మేం ఏ పర్యటనలోనూ పిచ్‌ గురించి ఫిర్యాదులు చేయలేదు’’ అని అశ్విన్‌ కుండబద్దలు కొట్టాడు. చివరి టెస్టుకు సమతూకం ఉన్న పిచ్‌ ఉంటుందా అని అడిగితే.. ‘‘దాని గురించి మాకు తెలియదు. మేమైతే మంచి క్రికెట్‌ మ్యాచ్‌ కోసం చూస్తున్నాం’’ అని అశ్విన్‌ చెప్పాడు.  మన గురించి అవతలి వారు ఏమనుకుంటారన్నది పట్టించుకోవాల్సిన అవసరం లేదని అశ్విన్‌ అన్నాడు. మొతేరా టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిపోవడంపై విమర్శల నేపథ్యంలో అతనీ వ్యాఖ్యలు చేశాడు. ‘‘దశాబ్దం నుంచి చూస్తున్నా.. ఎవరెవరో ఏదో అంటారు. వాటన్నింటినీ పట్టించుకుని మనసు పాడు చేసుకోవాల్సిన పని లేదు. మొన్న మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగిసిపోయిందని చాలామంది రకరకాల సందేశాలు పంపారు. వాళ్లందరికీ సమాధానంగానే నేను తర్వాతి రోజు ట్వీట్లు పెట్టా. వాటిని సరిగా అర్థం చేసుకోవాలి’’ అన్నాడు. మొతేరా పిచ్‌పై వ్యంగ్యంగా స్పందిస్తూ ఇలాంటి వికెట్లపై అయితే కుంబ్లే, హర్భజన్‌ 1500, 800 వికెట్లు పడగొట్టేవారంటూ మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై అశ్విన్‌ మాట్లాడుతూ.. ‘‘నేను ఏ ఒక్క వ్యక్తినో ఉద్దేశించి ఆ ట్వీట్లు చేయలేదు. యువీ ట్వీట్‌ చూసినపుడు నేనేమీ ప్రభావితం కాలేదు. అతను మమ్మల్ని ఉద్దేశించి ఏమీ అనలేదు. మాకు ఏ సూచనా చేయలేదు కూడా’’ అన్నాడు. మరోవైపు భారత అత్యధిక వికెట్ల వీరుడిగా కుంబ్లే (619) రికార్డుపై గురి పెట్టారా అని అశ్విన్‌ను అడిగితే.. ‘‘సరిగ్గా చెప్పాలంటే ఆ రికార్డుకు 218 వికెట్ల దూరంలో ఉన్నా. కానీ నేను రికార్డుల గురించి ఆలోచించడం మానేసి చాలా కాలమైంది. మనం ఏం చేయగలం, మెరుగవ్వడానికి ఏం చేయాలి, జట్టుకు ఏ రకంగా సాయపడగలం అని మాత్రమే నేను ఆలోచిస్తున్నా. నేను నా ఆటను ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నా’’ అన్నాడు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన