close

ప్రధానాంశాలు

Published : 01/03/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మైదానంలో మాణిక్యాలు

క్రికెట్లో రాణిస్తున్న అమ్మాయిలు
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

అనుకున్నది సాధించాలనే తపన.. లక్ష్యం కోసం పోరాడే పట్టుదల.. అడ్డంకులను అధిగమించే ఆత్మవిశ్వాసం.. సరైన మార్గనిర్దేశనం ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తున్నారు ఈ అమ్మాయిలు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో వాళ్ల గ్రామాలున్నాయి.. అయితేనేం తమ ప్రతిభతో వెలుగులోకి వస్తున్నారు. వాళ్లవి పేద కుటుంబాలే.. అయితేనేం ప్రతిభ, నైపుణ్యాలనే ఆస్తి వాళ్ల సొంతం. వాటిని నమ్ముకుని అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఈ నెల 11 నుంచి ఆరంభం కానున్న బీసీసీఐ సీనియర్‌ మహిళల వన్డే ట్రోఫీ కోసం ఇటీవల ప్రకటించిన హైదరాబాద్‌ అమ్మాయిల జట్టులో తొలిసారి చోటు దక్కించుకుని సత్తాచాటారు. వాళ్లే.. అంజలి, నిఖిత, అనిత, పార్వతి. వీళ్లలో అంజలి, నిఖిత తెలంగాణ సాంఘిక సంక్షేమ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు కాగా.. అనిత, పార్వతి గిరిజన సంక్షేమ పాఠశాలలో చదువుతున్నారు.

ఆటో డ్రైవర్‌ తనయ..

కుటుంబాన్ని పోషించేందుకు తండ్రి ఆటో డ్రైవర్‌గా కష్టపడుతుంటే.. తనయ అంజలి మాత్రం భారత మహిళల క్రికెట్‌ జట్టుకు ఆడాలనే కలను నెరవేర్చుకునే దిశగా శ్రమిస్తోంది. ఖమ్మం జిల్లా మేడిపల్లి గ్రామానికి చెందిన ఈ 16 ఏళ్ల టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌వుమన్‌ దనవాయ్‌ గూడెంలోని సాంఘిక సంక్షేమ విద్యాలయంలో ఇంటర్‌ చివరి ఏడాది చదువుతోంది. చిన్నప్పటి నుంచే క్రికెట్‌ అంటే ఇష్టం పెంచుకున్న తను.. మూడేళ్ల కింద ఆటలో అడుగుపెట్టింది. తల్లిదండ్రులూ ఆమెను ప్రోత్సహించారు. మహబూబ్‌నగర్‌లోని కమ్మదనం క్రికెట్‌ అకాడమీ శిక్షణలో రాటుదేలుతున్న అంజలి బ్యాట్స్‌వుమన్‌గా సత్తాచాటుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ టోర్నీల్లో రాణించడంతో పాటు హెచ్‌సీఏ సెలక్షన్స్‌లో మెరిసి హైదరాబాద్‌ జట్టులో చోటు దక్కించుకుంది. భారత దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ను ఆరాధించే ఆమె.. హైదరాబాద్‌ జట్టు తరపున వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెబుతోంది.

మిథాలీ స్ఫూర్తితో..

భారత మహిళా క్రికెట్‌ దిగ్గజం మిథాలీ రాజ్‌ను స్ఫూర్తిగా తీసుకుని సిద్దాపురం నిఖిత క్రికెట్లో దూసుకెళ్తోంది. అయితే తన ఆరాధ్య క్రికెటర్‌ మిథాలీ లాగా బ్యాట్స్‌వుమన్‌గా కాకుండా పేస్‌ బౌలర్‌గా సత్తాచాటుతోంది. నిజామాబాద్‌లోని నందిపేట్‌ మండలం అన్నారం గ్రామానికి చెందిన ఈ 14 ఏళ్ల బాలిక గత మూడేళ్ల నుంచే ఫాస్ట్‌బౌలింగ్‌తో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం కంగర సాంఘిక సంక్షేమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న తను.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆటలో అడుగుపెట్టానని తెలిపింది. కమ్మదనం క్రికెట్‌ అకాడమీలో శిక్షణతో మెరుగై.. వివిధ టోర్నీల్లో మంచి ప్రదర్శన కనబరచింది. కారు డ్రైవర్‌గా పని చేస్తున్న తండ్రి.. తన కూతురు భవిష్యత్‌ కోసం కష్టపడుతున్నాడు. హైదరాబాద్‌ సీనియర్‌ మహిళల జట్టుకు తొలిసారి ఎంపికైనందుకు ఎంతో సంతోషంగా ఉందని, జాతీయ జట్టుకు ఆడే దిశగా సాగుతానని నిఖిత చెప్పింది.

అదిరే ఆల్‌రౌండర్‌..

బ్యాట్‌తో పరుగులు రాబట్టడంతో పాటు పేస్‌ బౌలింగ్‌తో వికెట్ల వేటలో ముందుకు సాగుతోంది.. 13 ఏళ్ల పార్వతి. మెదక్‌ జిల్లా తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన ఈ చిచ్చర పిడుగు ఇప్పటికే హెచ్‌సీఏ అండర్‌-16 తరపున ప్రాతినిథ్యం వహించడం విశేషం. నర్సాపూర్‌ గిరిజన సంక్షేమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న తను.. 10 ఏళ్ల వయసులోనే బ్యాటు, బంతి చేతబట్టింది. తల్లిదండ్రులది వ్యవసాయ నేపథ్యం అయినప్పటికీ.. తమ కూతుర్ని మాత్రం క్రికెట్‌ వైపు ప్రోత్సహించారు. వనపర్తి అకాడమీలో చేరి ఆటలో ఓనమాలు దిద్దుకున్న ఆమె.. మేటి ఆల్‌రౌండర్‌గా ఎదగాలనే లక్ష్యం పెట్టుకుంది. ఆ దిశగా రోజుకు ఆరు గంటల పాటు సాధన చేస్తోంది. ఇంత చిన్న వయస్సులోనే సీనియర్‌ జట్టుకు ఎంపికైన ఆమె.. తన ప్రదర్శనతో జట్టు విజయాలకు దోహదపడతానని తెలిపింది.

రైతు బిడ్డ..

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన హనుమాన్‌పల్లి తండాకు చెందిన 15 ఏళ్ల ముదావత్‌ అనిత.. పేస్‌ ఆల్‌రౌండర్‌గా రాణిస్తోంది.    కల్వకుర్తి గిరిజన సంక్షేమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న తను.. రెండేళ్ల క్రితం క్రికెట్‌ కెరీర్‌ను మొదలెట్టింది. భద్రాచలంలో జరిగిన శిక్షణ శిబిరంలో అనితలో ప్రతిభను గుర్తించిన కోచ్‌ ఝాన్సీ.. ఆమెను ఆటవైపుగా ప్రోత్సహించింది. ఆ తర్వాత అనిత్‌ వనపర్తి అకాడమీలో చేరి క్రమంగా మెరుగవుతోంది. తండ్రి పంటలను పండించేందుకు పొలంలో కష్టపడుతుంటే.. ఆమె పరుగుల వేటలో మైదానంలో బ్యాట్‌ పడుతోంది. రెండేళ్లుగా రాష్ట్ర స్థాయి టోర్నీలతో పాటు జాతీయ స్థాయి పోటీల్లోనూ తెలంగాణ తరపున మంచి ప్రదర్శన చేస్తోంది. భారత జట్టుకు ఆడడమే తన లక్ష్యమని.. దాన్ని చేరుకునేందుకు నిరంతరం శ్రమిస్తూనే ఉంటానని పేర్కొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన