close

ప్రధానాంశాలు

Published : 02/03/2021 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధనాధన్‌.. శార్దూల్‌

57 బంతుల్లో 92 పరుగులు
క్వార్టర్స్‌లో ముంబయి

జైపుర్‌: ఆస్ట్రేలియాలో చివరి టెస్టులో బ్యాట్‌తో కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించిన టీమ్‌ఇండియా పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ (92; 57 బంతుల్లో 6×4, 6×6) మరోసారి బ్యాటింగ్‌లో సత్తాచాటాడు. విజయ్‌ హజారె వన్డే ట్రోఫీలో సోమవారం హిమాచల్‌ప్రదేశ్‌తో గ్రూప్‌- డి మ్యాచ్‌లో ఈ ముంబయి ఆటగాడు ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.   అతనితో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌ (91; 75 బంతుల్లో 15×4), ఆదిత్య తారె (83; 98 బంతుల్లో 6×4, 1×6) రాణించడంతో ఆ జట్టు 200 పరుగుల తేడాతో హిమాచల్‌ప్రదేశ్‌ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి  50 ఓవర్లలో 9 వికెట్లకు 321 పరుగులు చేసింది. ఓ దశలో 49/4తో కష్టాల్లో పడ్డ జట్టును ఆదిత్య తారెతో కలిసి సూర్య ఆదుకున్నాడు. ఈ జోడీ అయిదో వికెట్‌కు 99 పరుగులు జోడించింది. సూర్యకుమార్‌ ఔటయ్యాక క్రీజులో  అడుగుపెట్టిన శార్దూల్‌ ఆరంభం నుంచే బాదుడు మొదలెట్టాడు. అతని దూకుడుతో ఒక్కసారిగా ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. ఆరో వికెట్‌కు ఆదిత్యతో కలిసి 112 పరుగులు జతచేశాడు. ఆదిత్య ఔటయ్యాక మరింతగా రెచ్చిపోయిన శార్దూల్‌ లిస్ట్‌- ఎ క్రికెట్లో తొలి శతకం చేసేలా కనిపించాడు. కానీ 49వ ఓవర్లో సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో ఔటయ్యాడు. లిస్ట్‌- ఎ క్రికెట్లో అతనికిదే తొలి అర్ధశతకం. ప్రత్యర్థి బౌలర్లలో రిషి ధావన్‌ (4/84), పంకజ్‌ జస్వాల్‌ (3/65) రాణించారు. అనంతరం ఛేదనలో హిమాచల్‌ ప్రదేశ్‌ 24.1 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. ముంబయి బౌలర్లలో ప్రశాంత్‌ సోలంకి (4/31), శామ్స్‌ ములాని   (3/42) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఈ విజయంతో గ్రూప్‌- డిలో అగ్రస్థానంలో నిలిచిన ముంబయి నేరుగా క్వార్టర్స్‌ చేరింది. మరోవైపు గ్రూప్‌-ఈ నుంచి సౌరాష్ట్ర నాకౌట్‌కు అర్హత సాధించింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన