close

ప్రధానాంశాలు

Published : 02/03/2021 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫ్రాంచైజీల నిరసన గళం

వేదికల ఎంపికపై మూడు జట్ల అసంతృప్తి
పునరాలోచించాలని బీసీసీఐకి విజ్ఞప్తి
దిల్లీ

రానున్న ఐపీఎల్‌ను ఆరు వేదికల్లోనే నిర్వహించాలన్న బీసీసీఐ నిర్ణయంపై మూడు ఫ్రాంచైజీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సొంతగడ్డపై మ్యాచ్‌లు లేకపోతే స్థానిక అనుకూలత దూరమవుతుందని ఆందోళన తెలుపుతున్నాయి. ఈ విషయంలో పునరాలోచించాలంటూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలిని కోరుతున్నాయి.

కరోనా మహమ్మారి నేపథ్యంలో నిరుడు ఐపీఎల్‌ను యూఏఈలో  నిర్వహించిన బీసీసీఐ.. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ ద్వారా సొంతగడ్డపై  అంతర్జాతీయ క్రికెట్‌ను పునఃప్రారంభించింది. చెన్నైలో రెండో టెస్టు నుంచి 50 శాతం సామర్థ్యంతో స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతిస్తోంది. చెన్నై, అహ్మదాబాద్‌ టెస్టులకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావడంతో అభిమానుల సమక్షంలోనే ఐపీఎల్‌ నిర్వహించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఆరు వేదికల్లో బయో బబుల్‌ వాతావరణంలో ఐపీఎల్‌ నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోంది. చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, దిల్లీ, అహ్మదాబాద్‌ వేదికల్ని ప్రాథమికంగా ఎంపిక చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే ముంబయిలోనూ మ్యాచ్‌లు నిర్వహించే ఆలోచనలో ఉంది. ఈ   పరిణామాలపై హైదరాబాద్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ ఫ్రాంచైజీలు ఆగ్రహం వ్యక్తజేస్తున్నాయి. ‘‘ఈ నిర్ణయం మా మూడు జట్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సొంతగడ్డపై సత్తాచాటుతున్న జట్లే ఐపీఎల్‌లో రాణిస్తున్నాయి. సొంతగడ్డపై ఐదు లేదా ఆరు విజయాలు నమోదు చేస్తూ ప్లేఆఫ్‌కు దూసుకెళ్తున్నాయి. బీసీసీఐ నిర్ణయంతో బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, దిల్లీ, ముంబయి జట్లకు స్థానిక అనుకూలత లభిస్తుంది. మేం అన్ని మ్యాచ్‌ల్ని బయటే ఆడాల్సి ఉంటుంది’’ అని ఒక ఫ్రాంచైజీ అధికారి వ్యాఖ్యానించాడు. ఏ ఫ్రాంచైజీకి సొంతగడ్డ కాని అహ్మదాబాద్‌ను వేదికగా ఎంపిక చేయడంపై మూడు జట్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తంజేస్తున్నాయి.

వేదికల ఎంపికపై తమ అభ్యంతరాల్ని మూడు ఫ్రాంచైజీలు విడివిడిగా బీసీసీఐ సీఈఓ హేమంగ్‌ అమిన్‌ దృష్టికి తీసుకెళ్లాయి. వేదికలపై బోర్డు పునరాలోచించాలంటూ మూడు ఫ్రాంచైజీలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని కూడా భావిస్తున్నాయి.  ఐపీఎల్‌ ఆతిథ్యం కోసం ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటం.. కరోనా రెండో దశ ప్రభావం కనిపిస్తుండటాన్ని మూడు ఫ్రాంచైజీలు ఎత్తిచూపుతున్నాయి. ఎన్నికలు లేని.. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న హైదరాబాద్‌లో మ్యాచ్‌లు నిర్వహించాలంటూ సన్‌రైజర్స్‌ గట్టిగా పట్టుబడుతుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సైతం హైదరాబాద్‌లో మ్యాచ్‌లు నిర్వహించాలంటూ బీసీసీఐ, ఐపీఎల్‌ కార్యవర్గ సభ్యులకు ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించే మ్యాచ్‌లకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ కూడా ఇచ్చారు. అయితే  బీసీసీఐ మాత్రం మూడు ఫ్రాంచైజీలను బుజ్జగించే పనిలో నిమగ్నమైంది. కరోనా మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా తాము నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు ఫ్రాంచైజీలకు చెప్తోంది. గత ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తోంది.  కానీ అన్ని జట్లకు యూఏఈ తటస్థ వేదిక కాబట్టి ఎవరూ అభ్యంతరం చెప్పలేదని ఫ్రాంచైజీలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పుడు 5 జట్లు సొంతగడ్డపై ఆడటం తమ అవకాశాల్ని ప్రభావితం చేస్తాయని ఆందోళన చెందుతున్నాయి. బోర్డు నిర్ణయంతో క్రికెటే కాకుండా వ్యాపార పరంగానూ తమకు  నష్టమేనంటున్నాయి. ఇదిలా ఉంటే వేదికల  ఎంపికపై బీసీసీఐ తన పని తాను చేసుకుపోతుంది. ఈ నెలాఖరులోపు వేదికల్ని ప్రకటిస్తామని ఫ్రాంచైజీలకు ఇప్పటికే సమాచారం అందించింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన