close

ప్రధానాంశాలు

Updated : 05/03/2021 06:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అదే మాయ..

విజృంభించిన అక్షర్‌, అశ్విన్‌
ఇంగ్లాండ్‌ 205 ఆలౌట్‌

తొలి రోజు భారత్‌దే ఆధిపత్యం
మొతేరాలో నాలుగో టెస్టు

అహ్మదాబాద్‌

ఇంగ్లాండ్‌ను మరోసారి టాస్‌ కరుణించింది. కానీ భారత స్పిన్నర్లు మాత్రం దయతలచలేదు. గత మ్యాచ్‌లో అంత కాకపోయినా మంచి టర్న్‌, బౌన్స్‌ లభించిన పిచ్‌పై అక్షర్‌, అశ్విన్‌ మాయ చేసిన వేళ.. తొలి రోజు టీమ్‌ఇండియా పైచేయి సాధించింది. బ్యాట్స్‌మెన్‌ మరోసారి తడబడ్డా.. ఇంగ్లాండ్‌ అయిదు ఇన్నింగ్స్‌ల తర్వాత ఎట్టకేలకు రెండొందలు దాటగలిగింది. కానీ ఆ స్కోరుతో కోహ్లీసేనను అడ్డుకోవడం కష్టమే..!

స్పిన్‌కు అనుకూలిస్తున్నప్పటికీ.. గత మ్యాచ్‌లో అంత కష్టంగా అయితే పిచ్‌ లేదు. అయినా ఇంగ్లాండ్‌కు స్పిన్‌ కష్టాలు తప్పలేదు. కాస్త మెరుగే కానీ.. అది గత మ్యాచ్‌లో పోల్చినప్పుడే. మాయాజాలాన్ని కొనసాగిస్తూ స్పిన్‌ ద్వయం అక్షర్‌ పటేల్‌ (4/68), అశ్విన్‌   (3/47) మరోసారి విజృంభించడంతో చివరిదైన నాలుగో టెస్టు తొలి రోజు, తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 205 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్‌ (2/45) రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. బెన్‌ స్టోక్స్‌ (55; 121 బంతుల్లో 6×4, 2×6) టాప్‌ స్కోరర్‌. లారెన్స్‌ (46) రాణించాడు. గురువారం ఆట ముగిసే సమయానికి భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 24 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (0)ను అండర్సన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. పుజారా (15), రోహిత్‌ (8) క్రీజులో ఉన్నారు. రెండో రోజు టీమ్‌ ఇండియా ఎలా బ్యాటింగ్‌ చేస్తుందన్నదే మ్యాచ్‌ గమనాన్ని నిర్దేశించనుంది. ప్రస్తుతానికైతే భారత్‌ మెరుగ్గా ఉన్నట్లే!

టపటపా.. ఆపై స్టోక్స్‌: టాస్‌ మరోసారి కలిసొచ్చింది. పిచ్‌ కూడా కిందటి మ్యాచ్‌లో అంత కఠినంగా ఏమీ లేదు. కానీ అదనపు బ్యాట్స్‌మన్‌తో బరిలోకి దిగినా ఇంగ్లాండ్‌ తగినంత స్కోరు చేయలేకపోయింది. భారత బౌలర్లు ఆ జట్టుకు భారీ భాగస్వామ్యాలు నమోదు చేసే అవకాశం ఇవ్వలేదు. నలుగురు బ్యాట్స్‌మెన్‌ బాగానే ఆరంభించినా... ఆ ప్రారంభాలను మంచి స్కోర్లుగా మలచలేకపోయారు. అయితే ఎదురుదాడిలో, డిఫెన్స్‌లో ఆకట్టుకున్న స్టోక్స్‌ తమ జట్టు రెండొందలు దాటడంలో కీలక పాత్ర    పోషించాడు. లేదంటే.. అక్షర్‌ పటేల్‌ ధాటికి 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ చాలా తక్కువ స్కోరుకే పరిమితమయ్యేదే. అక్షర్‌ తన రెండో బంతికే వికెట్‌ చేజిక్కించుకున్నాడు. ఆరో ఓవర్లో బౌలింగ్‌కు దిగిన అతడు వెంటనే ఫలితం చూపాడు. ఓ స్ట్రెయిట్‌ డెలివరీతో సిబ్లి (2)ని బౌల్డ్‌ చేసి ఇంగ్లాండ్‌ పతనాన్ని ఆరంభించాడు. తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్‌ క్రాలే (9)నూ వెనక్కి పంపాడు. అక్షర్‌ బౌలింగ్‌లో ఎదురుదాడే ఉత్తమం అనుకుని.. ముందుకొచ్చి భారీ షాట్‌ ఆడబోయిన అతడు.. సిరాజ్‌కు తేలికైన క్యాచ్‌ ఇచ్చేశాడు.  కాసేపటికే సిరాజ్‌ ఓ ఇన్‌స్వింగర్‌తో కెప్టెన్‌ రూట్‌ (5)ను ఎల్బీగా ఔట్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ కుప్పకూలే ప్రమాదంలో పడింది. అయితే చక్కని ఇన్నింగ్స్‌ ఆడిన స్టోక్స్‌.. బెయిర్‌స్టో (28; 67 బంతుల్లో 6×4)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. బ్యాట్స్‌మెన్‌  ఇద్దరూ...డిఫెన్స్‌ బాగుంటే పరుగులు చేయడం కష్టమేమీ కాదని చూపించారు. వీళ్లిద్దరు స్పిన్నర్లను ఎక్కువసార్లు శరీరానికి దగ్గరగా ఆడారు.. ముఖ్యంగా ఫ్రంట్‌ఫుట్‌పై. సుందర్‌ బౌలింగ్‌లో రివర్వ్‌ స్వీప్‌ బౌండరీతో స్టోక్స్‌ అర్ధశతకం పూర్తి చేశాడు. కానీ భాగస్వామ్యం (48) బలపడుతున్న దశలో బెయిర్‌స్టోను ఔట్‌ చేయడం ద్వారా సిరాజ్‌.. భారత్‌లో ఉత్సాహం నింపాడు. వికెట్ల ముందు దొరికిపోయిన బెయిర్‌స్టో.. సమీక్ష కోరినా ఫలితం లేకపోయింది.  అప్పటికి స్కోరు 78/4. అయితే చక్కటి బ్యాటింగ్‌ కొనసాగించిన స్టోక్స్‌.. ఒలి పోప్‌తో కలిసి మరో విలువైన భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేశాడు. అయితే ఈ జోడీనీ భారత్‌ కుదురుకోనివ్వలేదు. సాధికారికంగా ఆడుతున్న స్టోక్స్‌ను సుందర్‌ పెవిలియన్‌ చేర్చాడు. నేరుగా వచ్చిన బంతికి స్టోక్స్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు.
39కే ఆ అయిదు: 121/5. స్టోక్స్‌ నిష్క్రమించేటప్పటికి ఇంగ్లాండ్‌ స్కోరిది. కానీ లారెన్స్‌, పోప్‌ (29) ఆ జట్టును కుప్పకూలనివ్వలేదు. టీ తర్వాత ఇంగ్లాండ్‌ ఓ దశలో 166/5తో నిలిచింది. కాస్త మెరుగైన స్కోరుపై ఆ జట్టుకు ఆశలు కలిగిన దశ అది. కానీ భారత స్పిన్నర్లు ఆ జట్టు ఆశలు తీరనివ్వలేదు. 39 పరుగులకే ఇంగ్లాండ్‌ చివరి అయిదు వికెట్లను చేజార్చుకుంది. పోప్‌ను ఔట్‌ చేయడం ద్వారా 45 పరుగుల ఆరో వికెట్‌ భాగస్వామ్యాన్ని అశ్విన్‌ విడదీశాడు. అశ్విన్‌ కాసేపటికే ఫోక్స్‌ (1)నూ పెవిలియన్‌ చేర్చాడు. అక్షర్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఓ భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో లారెన్స్‌ స్టంపౌటయ్యాడు. అక్షర్‌ అదే ఓవర్లో డాన్‌ బెస్‌ (3)ను ఔట్‌ చేయగా.. లీచ్‌ (7)ను అశ్విన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది.


ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలే (సి) సిరాజ్‌ (బి) అక్షర్‌ పటేల్‌ 9; సిబ్లే (బి) అక్షర్‌ 2; బెయిర్‌స్టో ఎల్బీ (బి) సిరాజ్‌ 28; రూట్‌ ఎల్బీ (బి) 5; స్టోక్స్‌  ఎల్బీ (బి) సుందర్‌ 55; పోప్‌ (సి) శుభ్‌మన్‌ (బి) అశ్విన్‌ 29; లారెన్స్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) అక్షర్‌ 46; ఫోక్స్‌ (సి) రహానె (బి) అశ్విన్‌ 1; బెస్‌ ఎల్బీ (బి) అక్షర్‌ 3; లీచ్‌ ఎల్బీ (బి) అశ్విన్‌ 7; అండర్సన్‌ నాటౌట్‌ 10; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (75.5 ఓవర్లలో ఆలౌట్‌) 205; వికెట్ల పతనం:  1-10, 2-15, 3-30, 4-78, 5-121, 6-166, 7-170, 8-188, 9-189; బౌలింగ్‌: ఇషాంత్‌ 9-0-23-0; సిరాజ్‌ 14-2-45-2; అక్షర్‌ పటేల్‌ 26-7-68-4; అశ్విన్‌ 19.5-4-47-3; వాషింగ్టన్‌ సుందర్‌ 7-1-14-1
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: శుభ్‌మన్‌ ఎల్బీ (బి) అండర్సన్‌ 0; రోహిత్‌ బ్యాటింగ్‌ 8; పుజారా బ్యాటింగ్‌ 15; ఎక్స్‌ట్రాలు 1 మొత్తం: (12 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 24; వికెట్ల పతనం: 1-0; బౌలింగ్‌:  అండర్సన్‌ 5-5-0-1; స్టోక్స్‌ 2-1-4-0; లీచ్‌ 4-0-16-0; డామ్‌ బెస్‌ 1-0-4-0


అక్షర్‌.. అదరహో

ప్పటివరకూ ఆడింది రెండున్నర (మూడో టెస్టులో ఇంకో ఇన్నింగ్స్‌ మిగిలి ఉంది) టెస్టులే కానీ పడగొట్టిన వికెట్లేమో 22. అతని బౌలింగ్‌ సగటు 10.81. ఇవీ.. అరంగేట్ర టెస్టు సిరీస్‌లో అదరగొడుతున్న భారత స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ గొప్ప బౌలింగ్‌ నైపుణ్యానికి నిదర్శనాలు. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లో అడుగుపెట్టిన ఈ గుజరాతీ స్పిన్నర్‌ వికెట్ల వేటలో నిలకడ ప్రదర్శిస్తున్నాడు. సాధారణంగా అయితే కొత్తబంతితో పేసర్లు స్వింగ్‌, పేస్‌ రాబట్టి వికెట్లు తీస్తారు. కానీ మ్యాచ్‌ మ్యాచ్‌కు మెరుగవుతున్న అక్షర్‌ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కొత్త బంతితోనూ సత్తాచాటడం విశేషం. మూడో టెస్టు అంటే వేగంగా దూసుకొస్తూ, అనూహ్యంగా ప్రవర్తించే గులాబి బంతితో జరిగింది కాబట్టి అక్షర్‌ ఆ మ్యాచ్‌లో కొత్త బంతితో అద్భుతంగా రాణించాడు. కానీ ఈ మ్యాచ్‌లో పిచ్‌ చూస్తే బ్యాటింగ్‌కు అనుకూలంగానే కనిపిస్తోంది.. అలాంటి పరిస్థితుల్లో ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లోనే అతనికి బంతి అందించడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ తన రెండో బంతికి ఓపెనర్‌ సిబ్లీని బౌల్డ్‌ చేసి జట్టుకు తొలి వికెట్‌ అందించిన అతను తన ప్రతిభను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని చాటాడు. బంతి కొత్తదైనా.. పాతదైనా.. తన ఎత్తును చక్కగా సద్వినియోగం చేసుకుంటూ.. దాన్ని కచ్చితమైన ప్రదేశాల్లో వేస్తూ ఫలితాలు సాధిస్తున్నాడు. ఎక్కువ ఎత్తుతో వేసిన బంతిని డిఫెన్స్‌ ఆడదామని సిబ్లీ ప్రయత్నించగా.. అది అతని బ్యాట్‌ లోపలి అంచును ముద్దాడి స్టంప్స్‌ను  ఎగరగొట్టింది. తాను ఔటైన విధానాన్ని నమ్మలేనట్లుగా అతను పెవిలియన్‌ బాట పట్టాడు. క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేస్తున్న మరో ఓపెనర్‌ క్రాలేని ఓ ఊరించే బంతితో వెనక్కుపంపాడు. చివర్లో ఒకే ఓవర్లో లారెన్స్‌, బెస్‌ల వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి పతనాన్ని  వేగవంతం చేశాడు. దాదాపు గంటకు పైగా నిలబడి అర్ధశతకం దిశగా సాగుతున్న లారెన్స్‌ను.. క్రీజు వదిలి ముందుకు వచ్చి భారీ షాట్‌ ఆడేలా ప్రేరేపించి  స్టంపౌట్‌గా బయటకు పంపాడు. ఆ వెంటనే జాక్‌ లీచ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.


కోహ్లి × స్టోక్స్‌

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ కోహ్లి, ప్రత్యర్థి ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ మధ్య వాగ్వాదం జరిగింది. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ తొలి బంతికి రూట్‌ను సిరాజ్‌ ఔట్‌ చేయడంతో స్టోక్స్‌ క్రీజులోకి వచ్చాడు. ఆ ఓవర్‌ చివరి బంతికి సిరాజ్‌ బౌన్సర్‌ వేయడంతో స్టోక్స్‌ అతణ్ని దూషించాడు. దీంతో స్టోక్స్‌ దగ్గరికి కోహ్లి వెళ్లి మాట్లాడాడు. ఇద్దరి మధ్య సంభాషణ తీవ్రంగానే సాగడంతో అంపైర్లు మధ్యలో వచ్చి సర్దిచెప్పారు. ఈ విషయం గురించి తొలి రోజు ఆట తర్వాత సిరాజ్‌ మాట్లాడుతూ.. ‘‘స్టోక్స్‌ నన్ను దూషించడంతో కోహ్లి మధ్యలో కలగజేసుకుని ఆ పరిస్థితుల్లో తగిన రీతిలో స్పందించాడు. ఇలాంటివి మైదానంలో జరుగుతూనే ఉంటాయి’’ అని తెలిపాడు.


రూట్‌ను.. అలా బుట్టలో వేశా

ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ రూట్‌ క్రీజులో నిలబడితే ప్రత్యర్థికి చిక్కులు తప్పవు. అతణ్ని వీలైనంత త్వరగా పెవిలియన్‌ చేర్చాలని బౌలర్లు వ్యూహాలు రచిస్తారు. ఆ జట్టుతో నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ ప్రత్యేక ప్రణాళికతో అతణ్ని ఔట్‌ చేశానని టీమ్‌ఇండియా పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ అంటున్నాడు. వరుసగా ఔట్‌ స్వింగర్లు వేసిన అతను.. ఒక్కసారిగా ఇన్‌స్వింగర్‌ విసరడంతో రూట్‌ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. ‘‘నేను వికెట్లకు దూరంగానే బంతులేస్తానని రూట్‌ అనుకోవాలని వరుసగా ఔట్‌ స్వింగర్లు విసిరా. ఆ తర్వాత మరో కొత్త ఓవర్‌ వేసేందుకు వచ్చి.. తొలి బంతినే ఇన్‌స్వింగర్‌గా మలిచి వికెట్‌ సాధించా. నా ప్రణాళికను సమర్థంగా అమలు చేశా. ఒకే ప్రదేశంలో నిలకడగా బంతులేస్తూ బెయిర్‌స్టోను ఔట్‌ చేశా. అతనికి ఆరంభంలో ఎక్కువ పేస్‌తో బంతులేయలేదు. కానీ అతను ఇన్‌స్వింగ్‌ డెలీవరీలకు ఎక్కువగా ఔట్‌ అవుతాడని తన బ్యాటింగ్‌ వీడియోల్లో చూసి తెలుసుకున్నా. ఒకే ప్రదేశంలో నిలకడగా బంతులేయాలనుకున్నా. అలా చేసి ఫలితం అందుకున్నా. ఒకే చోట బంతులేసి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచమని కోహ్లి చెప్పాడు’’ అని సిరాజ్‌ పేర్కొన్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన