close

ప్రధానాంశాలు

Updated : 06/03/2021 04:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పేలింది పంత్‌ పటాకా

రిషబ్‌ సంచలన ఇన్నింగ్స్‌

మెరిసిన సుందర్‌, రోహిత్‌
తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 294/7

 ఇంగ్లాండ్‌తో చివరి టెస్టు

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ ఆడాలంటే ఈ మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకోవాలి. తొలి రోజు ఇంగ్లిష్‌ జట్టును మన స్పిన్నర్లు 205 పరుగులకే కుప్పకూల్చడం చూసి.. డ్రా ఏం కర్మ, విజయం మనదే అని అందరిలోనూ ఒక ధీమా!
కానీ రెండో రోజు మధ్యాహ్నం పరిస్థితి చూస్తే.. మొతేరాలో అంతటా నిశ్శబ్దం! ఏ పిచ్‌పై  అయినా అలవోకగా పరుగులు సాధిస్తాడని పేరున్న కోహ్లి ఔటైపోయాడు. క్రీజు చుట్టూ గోడ కట్టి ప్రత్యర్థి బౌలర్లను విసిగించే పుజారా వెనుదిరిగాడు. ఆత్మవిశ్వాసంతో ఆడుతున్న రోహిత్‌, రహానెలకూ బ్రేకులు పడ్డాయి.
ఆరు వికెట్లు పడ్డాయి. ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 50 పరుగుల వెనుకే ఉంది భారత్‌. ఆధిక్యంపై ఆశలు గల్లంతైనట్లే! కచ్చితంగా ఫలితం తేలేలా కనిపిస్తున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓటమి గురించి ఆలోచనలు  రేకెత్తిన సమయమది. ఈ స్థితిలో ఎవరైనా కాస్త నిలబడి ప్రత్యర్థి స్కోరు దాటిస్తే చాలనుకున్నారు అభిమానులు.
అయితే చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్లు.. జట్టుకు ముప్పు తప్పించమని కోరుకుంటే,  తిరుగులేని స్థితిలో నిలబెట్టేశాడు రిషబ్‌ పంత్‌.  కెరీర్లో మరో మేటి ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయావకాశాలు సృష్టించాడు. మరో యువ ఆటగాడు సుందర్‌ శ్రమ కూడా తోడవడంతో మ్యాచ్‌పై పట్టు బిగించే దిశగా వెళ్తోంది భారత్‌.

పంత్‌ ఎంత గొప్పగా ఆడుతున్నాడు? నమ్మశక్యంగా లేదు. ఒత్తిడిలో గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. అతనికిది తొలిసారి కాదు.. అలా అని చివరిది కూడా కాదు.  భవిష్యత్‌లో అన్ని ఫార్మాట్లలోనూ ఆల్‌టైమ్‌ దిగ్గజంగా అతను ఎదిగే అవకాశముంది. దూకుడుగా బ్యాటింగ్‌ చేయడంతోనే మ్యాచ్‌ విన్నర్‌గా మారాడు.

- బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ

అహ్మదాబాద్‌

పరిస్థితులు అనుకూలంగా ఉన్నపుడు ఎవరైనా ఆడేస్తారు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో ప్రత్యర్థికి ఎదురు నిలిచి.. ఎదురుదాడి చేసేవాడే మొనగాడు! రిషబ్‌ పంత్‌ అదే చేశాడు. మొతేరాలో మేటి ఇన్నింగ్స్‌తో జట్టును కష్టాల నుంచి  బయటపడేశాడు. పంత్‌ (101;  118 బంతుల్లో 13×4, 2×6) అద్భుత శతకం సాధించడంతో ఇంగ్లాండ్‌తో చివరి టెస్టులో రెండో రోజు ఆట ఆఖరుకు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 294 పరుగులు చేసింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (49; 144 బంతుల్లో 7×4), ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (60 బ్యాటింగ్‌; 117 బంతుల్లో 8×4) కూడా విలువైన ఇన్నింగ్స్‌ ఆడారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో అండర్సన్‌  (3/40), లీచ్‌ (2/66), స్టోక్స్‌  (2/73) మెరిశారు. సుందర్‌కు తోడుగా అక్షర్‌ పటేల్‌ (11 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. భారత్‌ ప్రస్తుతం 89 పరుగుల  ఆధిక్యంలో ఉంది.
సగం ఇలా.. సగం అలా!:  శుక్రవారం భారత ఇన్నింగ్స్‌ను రెండు భాగాలుగా విభజించి చూడొచ్చు. తొలి అర్ధం ముగిసేసరికి భారత్‌ పూర్తిగా ఆత్మరక్షణలో ఉంది. సగం ఆటలో ఇంగ్లాండ్‌దే పూర్తి ఆధిపత్యం. పంత్‌ అనేవాడు లేకుంటే రెండో అర్ధంలోనూ ఇంగ్లాండ్‌కు ఎదురుండేది కాదేమో! ఈపాటికి ఇంగ్లిష్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌ నడుస్తూ ఉండేది. కానీ ఆ జట్టు జోరుకు కళ్లెం వేస్తూ.. అనూహ్యంగా భారత్‌ను పైచేయిలో నిలిపాడతను.


తొలి అర్ధం భయం
17-11-19-2.. రెండో రోజు ఆటలో ఒక దశలో ఇంగ్లాండ్‌ ప్రధాన ఫాస్ట్‌బౌలర్‌  అండర్సన్‌ గణాంకాలివి. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఇంగ్లాండ్‌ ఆధిపత్యం ఎలా సాగిందో చెప్పడానికి ఈ గణాంకాలే రుజువు. బంతులు కొన్నిసార్లు బౌన్స్‌ అవుతూ, కొన్నిసార్లు తక్కువ ఎత్తులో వచ్చేలా అనూహ్యంగా స్పందించిన పిచ్‌పై ఇంగ్లాండ్‌ బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌ను బాగా ఇబ్బంది పెట్టారు. ఓవర్‌నైట్‌ స్కోరు 24/1తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌కు అండర్సన్‌తో పాటు స్టోక్స్‌, లీచ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కళ్లెం వేశారు. రన్‌రేట్‌ను బాగా నియంత్రించడం ద్వారా ఒత్తిడి పెంచి వికెట్లు సాధించారు. ఉదయం రోహిత్‌, పుజారా జోడీ 12 ఓవర్ల పాటు వికెట్‌ ఇవ్వలేదు. పుజారా తనదైన శైలిలో డిఫెన్స్‌ ఆడగా.. రోహిత్‌ సైతం ఆచితూచి బ్యాటింగ్‌ చేశాడు. ఈ 12 ఓవర్లలో వచ్చిన పరుగులు 16 మాత్రమే. పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిలో సాగుతున్న భారత్‌ను మరింత దెబ్బ కొడుతూ.. పుజారా (17)ను స్పిన్నర్‌ లీచ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. వెంటనే భారత్‌కు ఇంకా పెద్ద షాక్‌ తగిలింది. కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న కోహ్లి.. ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఆఫ్‌ స్టంప్‌కు కాస్త దూరంగా వెళ్తున్న స్టోక్స్‌ షార్ట్‌ పిచ్‌ బంతిని అనవసరంగా ఆడి వికెట్‌ కీపర్‌కు దొరికిపోయాడు. భారత్‌ పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డట్లు కనిపించిన ఆ స్థితిలో.. రోహిత్‌, రహానె భిన్నమైన ఆట ఆడే ప్రయత్నం చేశారు. బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఇద్దరూ చక్కటి షాట్లు ఆడటంతో స్కోరు బోర్డులో కదలిక వచ్చింది. జట్టు 41/3 నుంచి 80/3కి చేరుకుంది. అయితే క్రీజులో బాగా కుదురుకున్నట్లే కనిపించిన రహానె (27)ను అండర్సన్‌ స్లిప్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. ఈ దశలో పంత్‌తో రోహిత్‌.. 41 పరుగులు జోడించడంతో భారత్‌ 121/4తో పర్వాలేదనిపించింది. కానీ అర్ధశతకానికి ఒక్క పరుగు ముంగిట స్టోక్స్‌ బౌలింగ్‌లో రోహిత్‌ ఎల్బీగా వెనుదిరగడం.. అశ్విన్‌ (13) సైతం ఎంతోసేపు     నిలవకపోవడంతో భారత్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. అప్పటికి స్కోరు 146/6.

రెండో అర్ధం బీభత్సం
పంత్‌ క్రీజులో ఉన్నప్పటికీ.. ఇంగ్లాండ్‌ బౌలర్ల జోరు చూస్తే టెయిలెండర్లను పెట్టుకుని అతను జట్టును ఎంత వరకు తీసుకెళ్తాడో అన్న సందేహాలు కలిగాయి. రెండో సెషన్లోనే భారత్‌ కథ ముగిసేలా కనిపించింది. అయితే రోహిత్‌, అశ్విన్‌లతో కలిసి ఆడుతున్నపుడు సంయమనం ప్రదర్శించిన పంత్‌.. తక్కువ వ్యవధిలో రెండు వికెట్లు పడటంతో ఇన్నింగ్స్‌ ఎంతసేపు సాగుతుందో తెలియని స్థితిలో హిట్టింగ్‌ మొదలుపెట్టాడు. అప్పటికే షార్ట్‌ లెగ్‌లో ఒక క్లిష్టమైన క్యాచ్‌ చేజారడం, త్రుటిలో ఎల్బీ ప్రమాదాన్ని కూడా తప్పించుకోవడంతో అతడిలో తెగింపు వచ్చేసింది. ఉదయం భారత బ్యాట్స్‌మెన్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన అండర్సన్‌ సహా ఏ బౌలర్‌నూ అతను లెక్క చేయలేదు. స్పిన్నర్‌ బెస్‌నైతే అలవోకగా ఆడేశాడు. అందరి బౌలింగ్‌లోనూ భారీ షాట్లు ఆడుతూ.. వన్డే, టీ20 మ్యాచ్‌లను తలపించాడు. అర్ధశతకానికి 82 బంతులు తీసుకున్న రిషబ్‌.. ఇంకో 33 బంతుల్లోనే సెంచరీని చేరుకున్నాడంటే అతడి జోరెలా   పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. రూట్‌ బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్సర్‌తో అతను సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ సమయంలో స్టేడియం హోరెత్తిపోయింది. అయితే శతకం పూర్తి చేసిన తర్వాతి ఓవర్లోనే అండర్సన్‌ బంతికి పుల్‌ షాట్‌ ఆడబోయి అతను రూట్‌కు దొరికిపోయాడు. అప్పటిదాకా పంత్‌కు సహకరిస్తూ వచ్చిన సుందర్‌.. అక్షర్‌ అండతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కాసేపటికే అతడి అర్ధశతకం (96 బంతుల్లో) పూర్తయింది. ఇన్నింగ్స్‌ ఆసాంతం అతను సాధికారిక షాట్లతో ఆకట్టుకున్నాడు. అక్షర్‌ కూడా నిలకడగా ఆడటంతో భారత్‌ మరో వికెట్‌ కోల్పోకుండా ఆటను ముగించింది.

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 205; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: గిల్‌ ఎల్బీ (బి) అండర్సన్‌ 0; రోహిత్‌ ఎల్బీ (బి) స్టోక్స్‌ 49; పుజారా ఎల్బీ (బి) లీచ్‌ 17; కోహ్లి (సి) ఫోక్స్‌ (బి) స్టోక్స్‌ 0; రహానె (సి) స్టోక్స్‌ (బి) అండర్సన్‌ 27; పంత్‌ (సి) రూట్‌ (బి) అండర్సన్‌ 101; అశ్విన్‌ (సి) పోప్‌ (బి) లీచ్‌ 13; సుందర్‌ బ్యాటింగ్‌ 60; అక్షర్‌ పటేల్‌ బ్యాటింగ్‌ 11; ఎక్స్‌ట్రాలు 16 మొత్తం: (94 ఓవర్లలో 7 వికెట్లకు) 294; వికెట్ల పతనం: 1-0, 2-40, 3-41,  4-80, 5-121, 6-146, 7-259; బౌలింగ్‌: అండర్సన్‌ 20-11-40-3; స్టోక్స్‌ 22-6-73-2; లీచ్‌ 23-5-66-2; బెస్‌ 15-1-56-0; రూట్‌ 14-1-46-0Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన