close

ప్రధానాంశాలు

Published : 08/03/2021 00:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐపీఎల్‌ 2021 భారత్‌లో.. అంతా బయటే

ఏప్రిల్‌ 9న ఆరంభం
ఆరు తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు
హైదరాబాద్‌కు దక్కని చోటు
ఖాళీ స్టేడియాల్లోనే తొలి దశ లీగ్‌
దిల్లీ

రెండేళ్ల తర్వాత తిరిగి భారత్‌లో ఐపీఎల్‌ సందడి మొదలు కానుంది. వచ్చే నెల 9న 14వ సీజన్‌కు తెర లేవనుంది. మే 30న ఫైనల్‌ జరగనుంది. అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ, ముంబయి, కోల్‌కతాల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కుతుందనుకున్న హైదరాబాద్‌కు నిరాశే ఎదురైంది. కరోనా నేపథ్యంలో తొలి దశ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించట్లేదు. ఆరు వేదికల్లో జరిగే ఈ సీజన్‌లో ఏ జట్టుకూ సొంతగడ్డపై మ్యాచ్‌ ఆడే అవకాశం లేకపోవడం విశేషం. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య చెన్నైలో పోరుతో సీజన్‌ షురూ కానుంది.

ఐపీఎల్‌ 2021 షెడ్యూల్‌ వచ్చేసింది. ఏప్రిల్‌ 9 నుంచి మే 30 వరకూ ఆరు వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏడాది విరామం తర్వాత భారత్‌లో ఐపీఎల్‌ జరగబోతోంది. 2019 ఐపీఎల్‌ సీజన్‌ మార్చి 23 నుంచి మే 12 వరకూ స్వదేశంలో జరగ్గా.. కరోనా కారణంగా నిరుడు సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకూ యూఏఈలో లీగ్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. వైరస్‌ నేపథ్యంలో ఈసారి తొలి దశ మ్యాచ్‌లు ఖాళీ స్టేడియాల్లో నిర్వహించనున్నారు. మలి దశకు ప్రేక్షకులను అనుమతించడంపై తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఈ సీజన్‌లో ఏ జట్టూకూ సొంతగడ్డపై ఆడే అవకాశం లేదు. అన్నీ తటస్థ వేదికల్లోనే తలపడాలి. హైదరాబాద్‌, పంజాబ్‌, రాజస్థాన్‌ ఫ్రాంఛైజీల నగరాలను మ్యాచ్‌ల కోసం ఎంపిక చేయకపోవడంతో.. ఏ జట్టుకూ ఆతిథ్య సానుకూలత ఉండొద్దన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆటగాళ్లు వైరస్‌ బారిన పడకూడదన్న ఉద్దేశంతో లీగ్‌ దశలో ఒక్కో జట్టు మూడు సార్లు మాత్రమే ప్రయాణం చేసేలా షెడ్యూల్‌ రూపొందించారు.

హైదరాబాద్‌.. ప్చ్‌!

ఐపీఎల్‌ 2021 సీజన్‌ కోసం ఎంపిక చేసిన నగరాల్లో హైదరాబాద్‌కు చోటు దక్కకపోవడం ఇక్కడి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ.. పాజిటివ్‌ కేసులు, మరణాలు అధిక సంఖ్యలోనే నమోదవుతున్నప్పటికీ లీగ్‌ నిర్వహణ కోసం ముంబయిని ఎంపిక చేసిన బీసీసీఐ.. వైరస్‌ ప్రభావం చాలా తక్కువగా ఉన్న భాగ్యనగరాన్ని విస్మరించడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఎలాంటి ఫ్రాంఛైజీ లేని అహ్మదాబాద్‌కు అవకాశం కల్పించారు కానీ.. దేశంలోని అత్యుత్తమ క్రికెట్‌ స్టేడియాల్లో ఒక్కటైన ఉప్పల్‌కు మాత్రం మొండిచెయ్యే చూపారు. స్థానిక ఫ్రాంఛైజీ అయిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఈ స్టేడియంతో మంచి అనుబంధం ఉంది. ఆ జట్టు ఆడే మ్యాచ్‌ల కోసం స్టేడియానికి పోటెత్తుతారు. జట్టుకు, అభిమానులకు మధ్య మంచి అనుబంధం ఉంది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా లీగ్‌ తొలి దశ మ్యాచ్‌లకు స్టేడియాలకు ప్రేక్షకులను అనుమతించకపోయినప్పటికీ.. ఆ తర్వాత తర్వాత అభిమానులకు అవకాశం దక్కొచ్చు. ఈ నేపథ్యంలో తమ నగరంలో.. తమ జట్టు ఆటను చూడలేకపోతున్నామనే బాధ అభిమానులను వేధించడం ఖాయం. ఈ ఏడాది ఐపీఎల్‌ వేదికలు ఖరారు చేశారని, అందులో హైదరాబాద్‌ లేదనే వార్తలు వినిపించగానే.. తమ నగరంలో కూడా మ్యాచ్‌లు నిర్వహించాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌ బీసీసీఐని కోరారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చెన్నై వేదికగా వచ్చే నెల 11న సన్‌రైజర్స్‌ తన తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలపడనుంది.

అహ్మదాబాద్‌కు పెద్దపీట

ప్రపంచంలోనే పెద్ద క్రికెట్‌ స్టేడియంగా రూపాంతరం చెందిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మైదానం (మొతేరా) ఐపీఎల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. అదే కారణంతోనే అక్కడి నుంచి ఐపీఎల్‌లో పోటీపడే ఫ్రాంఛైజీ లేనప్పటికీ.. ఈ ఏడాది మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం దక్కించుకుంది. లీగ్‌ దశలో 8 మ్యాచ్‌లతో పాటు కీలకమైన ప్లేఆఫ్‌, ఫైనల్‌ పోరుకూ ఆతిథ్యమివ్వనుంది.

* 52 రోజుల పాటు సాగే లీగ్‌లో మొత్తం 60 మ్యాచ్‌లు జరగనున్నాయి. 11 రోజులు రెండు మ్యాచ్‌ల చొప్పున జరగనున్నాయి. గతంలో శని, ఆదివారాల్లోనే రెండేసి మ్యాచ్‌లు నిర్వహించేవాళ్లు. ఈ సీజన్‌లో బుధ, గురు, శుక్రవారాల్లోనూ రెండు మ్యాచ్‌ల చొప్పున నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మ్యాచ్‌ 3.30కు, సాయంత్రం మ్యాచ్‌ 7.30కు ఆరంభం కానున్నాయి.
* లీగ్‌ దశలో తొలి 36 మ్యాచ్‌లు కోల్‌కతా, బెంగళూరు మినహా మిగతా నాలుగు నగరాల్లో జరగనుండగా.. ఆ తర్వాతి 20 మ్యాచ్‌లకు ఆ రెండు నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి.
* లీగ్‌ దశలో మొత్తం 56 మ్యాచ్‌లకు గాను చెన్నై, ముంబయి, కోల్‌కతా, బెంగళూరులో 10 చొప్పున, అహ్మదాబాద్‌, దిల్లీలో 8 చొప్పున జరగనున్నాయి. ప్లేఆఫ్‌తో పాటు ఫైనల్‌కూ అహ్మదాబాద్‌ వేదిక కానుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన