అప్పగించేశారు
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 13/03/2021 04:02 IST

అప్పగించేశారు

బ్యాట్స్‌మెన్‌ ఘోర వైఫల్యం
ఆర్చర్‌, రాయ్‌ మెరుపులు
తొలి టీ20 ఇంగ్లాండ్‌దే
మొతేరా

టెస్టుల్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన వేదిక అది. ఫార్మాట్‌ మారింది. ఆటగాళ్లు మారారు. ప్రత్యర్థి బలంగా కనిపిస్తున్నప్పటికీ.. బెదురన్నదే లేకుండా ఆడే హిట్టర్లు, బంతితో బ్యాటుతో సత్తా చాటగల ఆల్‌రౌండర్లు, భయపెట్టే స్పిన్నర్లు, ప్రమాదకర పేసర్లతో కళకళలాడుతున్న టీమ్‌ఇండియా టీ20 సిరీస్‌ను కూడా ఘనంగానే మొదలుపెడుతుందని ఆశించారు అభిమానులు. కానీ ఆ అంచనాలు తల్లకిందులు కావడానికి ఎంతో సమయం పట్టలేదు. బ్యాటింగ్‌ మొదలుపెట్టి స్కోరు బోర్డు మీదికి మూడు పరుగులు చేసేసరికే రాహుల్‌, కోహ్లి ఔట్‌. ఇక్కడే తేలిపోయింది మ్యాచ్‌ ఫలితమేంటో! ఇక మ్యాచ్‌ అంతా ఎదురీతే!
టెస్టుల్లో మాదిరే టీ20ల్లోనూ ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను భారత్‌ ఓటమితో మొదలుపెట్టింది. మొతేరాలో శుక్రవారం తొలి టీ20లో భారత్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఇంగ్లాండ్‌.. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. మొదట  ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జోఫ్రా ఆర్చర్‌ (3/23)తో పాటు ఇంగ్లాండ్‌ బౌలర్లందరూ రాణించడంతో భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 124 పరుగులే చేయగలిగింది. శ్రేయస్‌ అయ్యర్‌ (67; 48 బంతుల్లో 8×4, 1×6) పుణ్యమా అని భారత్‌ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. జేసన్‌ రాయ్‌ (49; 32 బంతుల్లో 4×4, 3×6) మెరుపులు మెరిపించడంతో  ఇంగ్లాండ్‌ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. రెండో టీ20 ఆదివారం జరుగుతుంది.

కొట్టు కొట్టు కొట్టు..: లక్ష్యం చిన్నదే అయినా.. భారత జట్టులో ఒకరికి ముగ్గురు స్పిన్నర్లుండటంతో వాళ్లేమైనా అద్భుతాలు చేస్తారేమో అని ఆశ భారత అభిమానుల్లో కలిగింది. కెప్టెన్‌ కోహ్లి కూడా స్పిన్‌నే నమ్ముకుని తొలి ఓవర్‌ అక్షర్‌ పటేల్‌తో వేయించాడు. అతను మూడు పరుగులే ఇవ్వడంతో ఆశలు పెరిగాయి. కానీ తర్వాతి ఓవర్‌ నుంచి కథే మారిపోయింది. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో రాయ్‌ ఫోర్‌ కొట్టడంతో ఇంగ్లాండ్‌ జోరు మొదలైంది. చాహల్‌ వేసిన తర్వాతి ఓవర్లో అతను సిక్సర్‌, ఫోర్‌ బాదడంతో భారత్‌ వైపు నుంచి ఇక ఒత్తిడన్నదే లేకపోయింది. అక్షర్‌ వేసిన అయిదో ఓవర్లో బట్లర్‌ 4, 6 బాది జోరందుకున్నాడు. ఓపెనర్లిద్దరూ పోటీ పడి పరుగులు సాధించడంతో ఇంగ్లాండ్‌ పవర్‌ప్లే ముగిసేసరికి 50/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. 8వ ఓవర్లో బట్లర్‌ (28; 24 బంతుల్లో 2×4, 1×6)ను చాహల్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకునే సమయానికే ఇంగ్లాండ్‌ స్కోరు 72 పరుగులకు చేరుకుంది. తర్వాత మలన్‌ (24 నాటౌట్‌; 20 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి రాయ్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 12వ ఓవర్లో బంతి అందుకున్న సుందర్‌.. తొలి బంతికే రాయ్‌ను ఎల్బీగా ఔట్‌ చేసినా, దాని వల్ల భారత్‌కు ఒరిగిందేమీ లేదు. తర్వాత వచ్చిన బెయిర్‌స్టో (26 నాటౌట్‌; 17 బంతుల్లో 1×4, 2×6) మ్యాచ్‌ ముగించడానికి ఆలస్యం చేయలేదు. మలన్‌ కూడా ధాటిగా ఆడటంతో ఇంగ్లాండ్‌ 27 బంతులుండగానే లక్ష్యాన్ని చేరుకుంది.

షాక్‌లే షాక్‌లు: అంతకుముందు భారత అభిమానులు మనోళ్ల బ్యాటింగ్‌ చూద్దామని సర్దుకునేలోపే అంతా అయిపోయింది. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే రాహుల్‌ (1).. ఆర్చర్‌ బంతిని వికెట్ల మీదికి ఆడుకుని వెనుదిరిగాడు. రషీద్‌ వేసిన మూడో ఓవర్లో కోహ్లి (0).. షాట్‌ ఆడబోయి మిడాఫ్‌లో జోర్డాన్‌ చేతికి చిక్కాడు. అప్పటికి స్కోరు 2/3. కాసేపటికే ధావన్‌ (4) సైతం వెనుదిరిగాడు. ఫామ్‌లో ఉన్న పంత్‌ నాలుగో స్థానంలో దిగి కొన్ని మెరుపు షాట్లు ఆడటంతో అతను జట్టును గట్టెక్కిస్తాడని అభిమానులు ఆశించారు. కానీ జోరుమీదున్న పంత్‌ (21)కు స్టోక్స్‌ బ్రేకులేశాడు. 10 ఓవర్లకు 48/4తో భారత్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. స్కోరు వందైనా అవుతుందా అనుకున్న ఈ దశలో శ్రేయస్‌ అయ్యర్‌ ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. పాండ్య (19) సహకారంతో అతను ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టాడు. కానీ వీళ్లిద్దరూ చివరి ఓవర్లలో వెనుదిరగడంతో భారత్‌ 124 పరుగులకే పరిమితమైంది. రొటేషన్‌లో భాగంగా ఈ మ్యాచ్‌ నుంచి భారత్‌ రోహిత్‌కు విశ్రాంతినిచ్చింది.

భారత్‌ ఇన్నింగ్స్‌: ధావన్‌ (బి) వుడ్‌ 4; రాహుల్‌ (బి) ఆర్చర్‌ 1; కోహ్లి (సి) జోర్డాన్‌ (బి) రషీద్‌ 0; పంత్‌ (సి) బెయిర్‌స్టో (బి) స్టోక్స్‌ 21; అయ్యర్‌ (సి) మలన్‌ (బి) జోర్డాన్‌ 67; పాండ్య (సి) జోర్డాన్‌ (బి) ఆర్చర్‌ 19; శార్దూల్‌ (సి) మలన్‌ (బి) ఆర్చర్‌ 0; సుందర్‌ నాటౌట్‌ 3; అక్షర్‌ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 2 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 124; వికెట్ల పతనం: 1-2, 2-3, 3-20, 4-48, 5-102, 6-102, 7-117; బౌలింగ్‌: అదిల్‌ రషీద్‌ 3-0-14-1; ఆర్చర్‌ 4-1-23-3; మార్క్‌ వుడ్‌ 4-0-20-1; జోర్డాన్‌ 4-0-27-1; స్టోక్స్‌ 3-0-25-1; సామ్‌ కరన్‌ 2-0-15-0
ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ ఎల్బీ (బి) సుందర్‌ 49; బట్లర్‌ ఎల్బీ (బి) చాహల్‌ 28; మలన్‌ నాటౌట్‌ 24; బెయిర్‌స్టో నాటౌట్‌ 26; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (15.3 ఓవర్లలో 2 వికెట్లకు) 130; వికెట్ల పతనం: 1-72, 2-89; బౌలింగ్‌: అక్షర్‌ పటేల్‌ 3-0-24-0; భువనేశ్వర్‌ 2-0-15-0; చాహల్‌ 4-0-44-1; శార్దూల్‌ 2-0-16-0; పాండ్య 2-0-13-0; సుందర్‌ 2.3-0-18-1Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన