336.. సరిపోలా
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 27/03/2021 01:55 IST

336.. సరిపోలా

అలవోకగా ఛేదించేసిన ఇంగ్లాండ్‌
విరుచుకుపడ్డ స్టోక్స్‌, బెయిర్‌స్టో
తేలిపోయిన భారత బౌలర్లు
రాహుల్‌ శతకం, పంత్‌ మెరుపులు వృథా
పుణె

తొలి వన్డేలో ఇంగ్లాండ్‌ లక్ష్యం 318. ఛేదనలో 14 ఓవర్లకు స్కోరు 131/0. మ్యాచ్‌పై ఆశలు పోయినట్లే అనుకుంటున్న దశలో తొలి వికెట్‌ పడింది. ఇక అంతే.. సైకిల్‌స్టాండ్‌ను తలపించేసింది ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌! 66 పరుగుల తేడాతో భారత్‌ ఘనవిజయం.
రెండో వన్డేలో భారత్‌ స్కోరు 336. ఇంగ్లాండ్‌ ఓపెనర్లు పవర్‌ప్లేలో భారత బౌలర్లను ఉతికారేస్తున్నా.. ఏం కాదన్న ధీమా! ఒక వికెట్‌ పడితే చాలు అంతా సర్దుకుంటుందన్న ఆశ! ఈసారి 110 పరుగులకే తొలి వికెట్‌ పడింది. తొలి వన్డే రీప్లే ఆశించారు అభిమానులు. కానీ..
భారత బౌలర్లను లెక్కే చేయకుండా.. గల్లీ క్రికెట్‌ ఆడుతున్నట్లు ఇటు బెయిర్‌స్టో, అటు స్టోక్స్‌ వీర బాదుడు బాదేస్తుంటే భారత ఆటగాళ్ల ముఖాల్లో నెత్తురు చుక్కలేదు. నష్టమంతా జరిగాక మూడు వికెట్లయితే పడ్డాయి కానీ.. ఫలితం లేకపోయింది. భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించేసిన ఇంగ్లాండ్‌ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక సిరీస్‌ ఫలితం తేలేది ఆదివారం నాటి చివరి వన్డేలోనే.

తొలి వన్డే మ్యాజిక్‌ ఈసారి పని చేయలేదు. 337 పరుగుల లక్ష్యం ఇంగ్లాండ్‌ దూకుడు ముందు చిన్నదైపోయింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బెయిర్‌స్టో (124; 112 బంతుల్లో 11×4, 7×6)తో పాటు బెన్‌ స్టోక్స్‌ (99; 52 బంతుల్లో 4×4, 10×6) వీర విధ్వంసానికి దిగడంతో రెండో వన్డేలో ఇంగ్లిష్‌ జట్టు 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని ఆ జట్టు 43.3 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి అలవోకగా ఛేదించింది. జేసన్‌ రాయ్‌ (55; 52 బంతుల్లో 7×4, 1×6) ఉపయుక్తమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ (2/58) పర్వాలేదనిపించాడు. మొదట కేఎల్‌ రాహుల్‌ (108; 114 బంతుల్లో 7×4, 2×6) శతకానికి.. రిషబ్‌ పంత్‌ (77; 40 బంతుల్లో 3×4, 7×6), విరాట్‌ కోహ్లి (66; 79 బంతుల్లో 3×4, 1×6) అర్ధశతకాలు తోడవడంతో భారత్‌ 6 వికెట్లకు 336 పరుగులు చేసింది.
దిక్కు తోచలేదు..: 35 ఓవర్లకు ఇంగ్లాండ్‌ స్కోరు 285/1. పడ్డ ఒక్క వికెట్‌ (రాయ్‌) కూడా రనౌట్‌ ద్వారా సాధించింది. ఈ గణాంకాలు చూస్తే భారత బౌలర్లు ఎంతటి దయనీయ స్థితిని ఎదుర్కొన్నారో అర్థమవుతుంది. ఎవరికి బౌలింగ్‌ ఇవ్వాలో తెలియని గందరగోళంలో కెప్టెన్‌..! ఎలా బంతులేయాలో అర్థం కాని అయోమయంలో బౌలర్లు..! ఎవరు బంతి అందుకున్నా.. ఎలాంటి బంతి పడినా.. కసితీరా బాదేసిన బెయిర్‌స్టో, స్టోక్స్‌కు టీమ్‌ఇండియాకు దిక్కుతోచని పరిస్థితి కల్పించారు. ఆరంభంలో నెమ్మదిగా ఆడి.. తర్వాత రెచ్చిపోయిన బెయిర్‌స్టోను ఏ భారత బౌలరూ ఆపలేకపోయాడు. స్టోక్స్‌ సంగతి చెప్పాల్సిన పనే లేదు. చాలా కసిగా షాట్లు ఆడాడతను. స్పిన్నర్లను బెయిర్‌స్టో, స్టోక్స్‌ అసలేమాత్రం లెక్క చేయలేదు. కుల్‌దీప్‌, కృనాల్‌లను లక్ష్యంగా చేసుకుని సిక్సర్ల మోత మోగించారు. ముఖ్యంగా స్టోక్స్‌ వీరిని నిస్సహాయ స్థితిలోకి నెట్టేశాడు. కుల్‌దీప్‌ వేసిన 33 ఓవర్లో అతను వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. కృనాల్‌ వేసిన తర్వాతి ఓవర్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌ కొట్టాడు. ఈ రెండు ఓవర్లకు ముందు సమీకరణం 108 బంతుల్లో 119 పరుగులతో కొంచెం కష్టంగానే ఉంది. కానీ స్టోక్స్‌ ధాటికి పరిస్థితి మొత్తం మారిపోయింది. కాసేపటి తర్వాత స్టోక్స్‌ సెంచరీకి ఒక్క పరుగు ముంగిట భువి బౌలింగ్‌లో ఔటైనా.. వెంటనే ప్రసిద్ధ్‌ ఒకే ఓవర్లో బెయిర్‌స్టో, బట్లర్‌ (0)లను ఔట్‌ చేసినా.. ఇంగ్లాండ్‌కు పెద్దగా ఇబ్బంది లేకపోయింది. నాలుగో వికెట్‌ పడేసరికి ఇంగ్లాండ్‌ 80 బంతుల్లో 49 పరుగులే చేయాల్సి ఉండటంతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడానికి అవకాశం లేకపోయింది. అరంగేట్ర ఆటగాడు లివింగ్‌స్టోన్‌ (27 నాటౌట్‌; 21 బంతుల్లో 1×4, 2×6) భువి బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో ఆశలు పోయాయి. మలన్‌ (16 నాటౌట్‌)తో కలిసి అతను పని పూర్తి చేశాడు.
అలా మొదలై..: మొదట భారత ఇన్నింగ్స్‌ మొదలైన, ముగిసిన తీరుకు పొంతనే లేదు. తొలి 10 ఓవర్లలో 2 వికెట్లకు 41 పరుగులే చేసిన భారత్‌.. చివరి 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఏకంగా 126 పరుగులు చేయడం విశేషం. ఓపెనర్ల వైఫల్యంతో ఆరంభ ఓవర్లలో భారత్‌ ఇబ్బంది పడింది. గత మ్యాచ్‌లో పెద్ద ఇన్నింగ్స్‌ ఆడిన ధావన్‌ (4).. ఈ మ్యాచ్‌లో క్రీజులో కుదురుకోవడానికి బాగా ఇబ్బంది పడ్డాడు. వుడ్‌ స్థానంలో జట్టులోకొచ్చిన టాప్లీ అతణ్ని ఔట్‌ చేశాడు. క్రీజులో కుదురుకున్నట్లే కనిపించిన రోహిత్‌ (25)ను సామ్‌ కరన్‌ బుట్టలో వేశాడు. ఈ దశలో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను కోహ్లి, రాహుల్‌ తీసుకున్నారు. వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు 121 పరుగులు జోడించారు. కోహ్లి ఔటయ్యాక పంత్‌తో కలిసి రాహుల్‌ జట్టును తిరుగులేని స్థితికి చేర్చాడు. వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు 77 బంతుల్లోనే 113 పరుగులు జోడించడం విశేషం. శతకం తర్వాత రాహుల్‌ ఔటైనా హార్దిక్‌ పాండ్య (35; 16 బంతుల్లో 1×4, 4×6) తొలి బంతి నుంచి విధ్వంసక షాట్లు ఆడటంతో భారత్‌ అనూహ్యమైన స్కోరు సాధించింది.


భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) రషీద్‌ (బి) సామ్‌ కరన్‌ 25; ధావన్‌ (సి) స్టోక్స్‌ (బి) టాప్లీ 4; కోహ్లి (సి) బట్లర్‌ (బి) రషీద్‌ 66; రాహుల్‌ (సి) టాప్లీ (బి) టామ్‌ కరన్‌ 108; పంత్‌ (సి) రాయ్‌ (బి) టామ్‌ కరన్‌ 77; హార్దిక్‌ పాండ్య (సి) రాయ్‌ (బి) టాప్లీ 35; కృనాల్‌ పాండ్య నాటౌట్‌ 12; శార్దూల్‌ ఠాకూర్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (50 ఓవర్లలో 6 వికెట్లకు) 336
వికెట్ల పతనం: 1-9, 2-37, 3-158, 4-271, 5-308, 6-334
బౌలింగ్‌: సామ్‌ కరన్‌ 7-0-47-1; టాప్లీ 8-0-50-2; టామ్‌ కరన్‌ 10-0-83-2; స్టోక్స్‌ 5-0-42-0; మొయిన్‌ అలీ 10-0-47-0; రషీద్‌ 10-0-65-1
ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ రనౌట్‌ 55; బెయిర్‌స్టో (సి) కోహ్లి (బి) ప్రసిద్ధ్‌ 124; స్టోక్స్‌ (సి) పంత్‌ (బి) భువనేశ్వర్‌ 99; మలన్‌ నాటౌట్‌ 16; బట్లర్‌ (బి) ప్రసిద్ధ్‌ 0; లివింగ్‌స్టోన్‌ నాటౌట్‌ 27; ఎక్స్‌ట్రాలు 16 మొత్తం: (43.3 ఓవర్లలో 4 వికెట్లకు) 337
వికెట్ల పతనం: 1-110, 2-285, 3-287, 4-287
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 10-0-63-1; ప్రసిద్ధ్‌ 10-0-58-2; శార్దూల్‌ 7.3-0-54-0; కుల్‌దీప్‌ 10-0-84-0; కృనాల్‌ పాండ్య 6-0-72-0


కోహ్లి @ 10000

న్డేల్లో మూడో స్థానంలో పది వేల పరుగులు పూర్తిచేసిన రెండో క్రికెటర్‌గా టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఘనత సాధించాడు. రికీ పాంటింగ్‌ (12662) ముందున్నాడు.


రాహుల్‌ సమాధానమిది

శుక్రవారం సెంచరీ పూర్తయ్యాక కేఎల్‌ రాహుల్‌ చిత్రమైన హావభావాలు ఇచ్చాడు. డ్రెస్సింగ్‌ రూం వైపు అభివాదం అయ్యాక.. హెల్మెట్‌, బ్యాట్‌ తీసి కింద పెట్టి రెండు చేతులు తీసి చెవుల దగ్గర పెట్టుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌ అయ్యాక వ్యాఖ్యాత అడిగితే దీనికి అర్థం చెప్పాడు. బయటి నుంచి వచ్చే అనవసర శబ్దాలను పట్టించుకోకూడదనే సంకేతాల్ని తాను ఇచ్చినట్లు చెప్పాడు.  కొందరు అదే పనిగా మనల్ని కిందికి లాగాలని చూస్తారని, వాళ్లను విస్మరించాలని.. అలాంటి వారి వ్యాఖ్యలను పట్టించుకోకూడదన్న ఉద్దేశంతో అలా చేసినట్లు తెలిపాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన