మూడో ముద్దు పెట్టేనా?
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 01/04/2021 01:54 IST

మూడో ముద్దు పెట్టేనా?

ఐపీఎల్‌-14 ఇంకో 8 రోజుల్లో

ఐపీఎల్‌లో ఈ జట్టును చూస్తే.. కచ్చితంగా టైటిల్‌ గెలుస్తుందని చెప్పలేని పరిస్థితి. అలా అని పూర్తిగా తీసిపారేయడానికీ వీల్లేదు. గతంలో రెండు టైటిళ్లతో ఓ వెలుగు వెలిగిన ఆ జట్టు.. ఆ తర్వాత నిలకడ లేని ఆటతీరుతో అంచనాలను అందుకోలేకపోతుంది. హిట్టర్లు జట్టులో ఉన్నా.. ఆల్‌రౌండర్లు అండగా నిలిచినా.. అగ్రశ్రేణి ఆటగాళ్లు తోడుగా ఉన్నా.. తిరుగులేని ప్రదర్శనతో మునుపటిలా టైటిల్‌ నెగ్గలేకపోతుంది. ఆ జట్టే.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌. ఇప్పటికే రెండు పర్యాయాలు టైటిల్‌ గెలిచిన ఈ జట్టు.. ఈ సారైనా పుంజుకుని ట్రోఫీని ముద్దాడుతుందేమో చూడాలి.

ఈనాడు క్రీడావిభాగం

పీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్రయాణం ఒడుదొడుకులతో సాగుతుంది. తొలి మూడు సీజన్లలో లీగ్‌ దశలోనే ఆగిపోయిన ఆ జట్టు.. గౌతమ్‌ గంభీర్‌ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. 2012, 2014 విజేతగా నిలిచింది. ఆ తర్వాత టైటిల్‌ నెగ్గనప్పటికీ ప్లేఆఫ్‌ వరకూ వెళ్తూ వచ్చింది. కానీ గత రెండు సీజన్లుగా ప్రదర్శన మరీ పేలవం. నిరుడు దినేశ్‌ కార్తీక్‌ మధ్యలోనే సారథ్య బాధ్యతలను మోర్గాన్‌కు కట్టబెట్టాడు. అయినప్పటికీ జట్టు తలరాత మారలేదు. కేకేఆర్‌ చివరకు అయిదో స్థానంతో లీగ్‌ను ముగించింది.


బలాలు..

ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగల విండీస్‌ విధ్వంసక ఆల్‌రౌండర్‌ రసెల్‌, ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌండరీలు సాధించగల సామర్థ్యం ఉన్న కెప్టెన్‌ మోర్గాన్‌, దూకుడైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల దినేశ్‌ కార్తీక్‌.. ఈ త్రయం ఆ జట్టుకు అతిపెద్ద బలమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ను విజేతగా నిలిపిన కెప్టెన్‌ మోర్గాన్‌పై ఈసారి జట్టు భారీగానే ఆశలు పెట్టుకుంది. ఇక యువ ఆటగాళ్లు శుభ్‌మన్‌ గిల్‌, నితీశ్‌ రాణా, రాహుల్‌ త్రిపాఠి బ్యాటింగ్‌ బలాన్ని పెంచే క్రికెటర్లే. గత సీజన్‌లో ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన గిల్‌.. మరోసారి సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. వీళ్లు చాలదన్నట్లుగా ఈ ఏడాది వేలంలో ప్రపంచ అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌, బెన్‌ కటింగ్‌లను తీసుకున్న జట్టు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌నూ పటిష్ఠపరుచుకుంది. ఈ సీజన్‌లో మిగతా జట్లతో పోలిస్తే స్పిన్‌ విభాగంలో కేకేఆర్‌ మెరుగ్గా కనిపిస్తోంది. నరైన్‌, కుల్‌దీప్‌, వరుణ్‌  చక్రవర్తి, పవన్‌ నేగికి తోడు ఈ సీజన్‌లో హర్భజన్‌ సింగ్‌, షకీబ్‌ అనుభవం జతకానుంది. కమిన్స్‌, ఫెర్గూసన్‌ లాంటి విదేశీ పేసర్లతో పాటు దేశీయ ఫాస్ట్‌బౌలర్లు   ప్రసిద్ధ్‌ కృష్ణ, నాగర్‌కోటి, శివమ్‌ మావిలతో పేస్‌ విభాగం దుర్భేద్యంగా ఉంది.


బలహీనతలు

పేపర్‌ మీద బలంగా కనిపిస్తున్న ఆ జట్టుకు కూర్పు ప్రధాన సమస్యగా మారనుంది. గత సీజన్‌లో మోర్గాన్‌ లాంటి ఆటగాడు బ్యాటింగ్‌ ఆర్డర్లో అయిదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం జట్టు అవకాశాలను దెబ్బతీసింది. మరోవైపు నరైన్‌ను ఓపెనర్‌గా పంపే విషయంలోనూ సందిగ్ధత ఉంది. ఓపెనర్‌గా గిల్‌కు జతగా ఎవరిని పంపాలో కూడా తేల్చుకోలేని అయోమయంలో జట్టు ఉంది. తుదిజట్టులో నలుగురు మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఉండాల్సిన నేపథ్యంలో మోర్గాన్‌, నరైన్‌, రసెల్‌, ఫెర్గూసన్‌, కమిన్స్‌, షకీబ్‌ అల్‌ హసన్‌లలో ఎవరిని వదులుకోవాలో తెలీని పరిస్థితుల్లో జట్టు ఉంది. అన్ని విభాగాల్లోనూ ప్రత్యామ్నాయాలు కలిగి ఉన్న ఆ జట్టుకు.. పదకొండు మంది ఎంపికలో, బ్యాటింగ్‌ ఆర్డర్లో వాళ్ల స్థానంపై స్పష్టత కొరవడడం సమస్య. జట్టుకు బలంగా పరిగణిస్తున్న రసెల్‌.. బలహీనతగానూ మారుతున్నాడు.

దేశీయ ఆటగాళ్లు: దినేశ్‌ కార్తీక్‌, శుభ్‌మన్‌ గిల్‌, హర్భజన్‌ సింగ్‌, కమలేశ్‌ నాగర్‌కోటి, కుల్‌దీప్‌ యాదవ్‌, కరున్‌ నాయర్‌, నితీశ్‌ రాణా, రాహుల్‌ త్రిపాఠి, రింకూ సింగ్‌, పవన్‌ నేగి, ప్రసిద్ధ్‌ కృష్ణ, సందీప్‌ వారియర్‌, శివమ్‌ మావి, వైభవ్‌ అరోరా, వరుణ్‌ చక్రవర్తి, వెంకటేశ్‌ అయ్యర్‌, షెల్డాన్‌ జాక్సన్‌


విదేశీయులు: మోర్గాన్‌ (కెప్టెన్‌), ఫెర్గూసన్‌, కమిన్స్‌, రసెల్‌, బెన్‌ కటింగ్‌, షకీబ్‌ అల్‌ హసన్‌, నరైన్‌, టిమ్‌ సీఫర్ట్‌;

కీలక ఆటగాళ్లు: మోర్గాన్‌, దినేశ్‌ కార్తీక్‌, గిల్‌, రసెల్‌, వరుణ్‌ చక్రవర్తి


అత్యుత్తమ ప్రదర్శన 2012, 2014లో ఛాంపియన్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన