పేరు మారింది.. మరి రాత?

ప్రధానాంశాలు

Updated : 03/04/2021 12:26 IST

పేరు మారింది.. మరి రాత?

ఐపీఎల్‌-14 ఇంకో 7 రోజుల్లో

ప్రతిభావంతులకు కొదువ లేదు.. హిట్టర్లేం తక్కువ కాదు.. బౌలింగ్‌లోనూ పటిష్టమే! కానీ ఫలితాలే ప్రతికూలం.. పేపర్‌ మీద ఆ జట్టు అహో.. మైదానంలో మాత్రం తడబాటే! 2008లో మూడో స్థానం, 2014లో రన్నరప్‌గా నిలవడం తప్పించి పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు లేవ్‌..! ఈసారి ఆ జట్టు గట్టిగా వస్తోంది! కొత్త బౌలింగ్‌ అస్త్రాలను నింపుకుని.. యువ తేజాలను వెంటేసుకుని మరోసారి దండయాత్రకు సిద్ధమైంది పంజాబ్‌! గత సీజన్లో కొద్దిలో ప్లేఆఫ్‌ అవకాశాన్ని కోల్పోయిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు ఈసారి పంజాబ్‌ కింగ్స్‌గా బరిలో దిగుతోంది.

ఈనాడు క్రీడావిభాగం

ఐపీఎల్‌లో కప్‌ ఆశ నెరవేరని జట్లలో పంజాబ్‌ కింగ్స్‌ ఒకటి. మంచి వనరులు ఉన్నా చాలా సందర్భాల్లో కలిసికట్టుగా ఆడకపోవడం, అదృష్టం కలిసి రాకపోవడం ఈ జట్టుకు ప్రతికూలం. దుబాయ్‌లో జరిగిన 13వ సీజన్లో వరుసగా అయిదు మ్యాచ్‌లు ఓడినా.. గొప్పగా పుంజుకుని తర్వాత అయిదు మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్‌ రేసులో నిలిచింది. కానీ చివరి రెండు మ్యాచ్‌లను చేజార్చుకుని ఆరో స్థానంతో టోర్నీని ముగించింది. మునుపటి తప్పులు చేయకూడదని గట్టి సంకల్పంతో ఉన్న రాహుల్‌ సేన.. కుంబ్లే మార్గనిర్దేశనంలో టైటిల్‌ వేటకు సిద్ధమైంది.

బలాలు

2020 సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచిన కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (14 మ్యాచ్‌ల్లో 670 పరుగులు) పంజాబ్‌ కింగ్స్‌కు పెద్ద బలం. ఇంగ్లాండ్‌తో టీ20ల్లో విఫలమైన అతడు.. వన్డే సిరీస్‌లో ఫామ్‌ అందుకోవడం సానుకూలాంశం. గత సీజన్లో మెరిసిన మయాంక్‌ అగర్వాల్‌, విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌, మెరుపు హిట్టర్‌ పూరన్‌ పంజాబ్‌ బ్యాటింగ్‌కు ఆయువుపట్టు లాంటోళ్లు. గత సీజన్లో తక్కువ మ్యాచ్‌లే ఆడినా తనదైన ముద్ర వేసి జట్టు విజయాల్లో కీలకమయ్యాడు గేల్‌. అతనితో కాకుండా మరో విండీస్‌ వీరుడు పూరన్‌ ఫామ్‌ పంజాబ్‌కు కలిసొచ్చే అంశం. ఇక   రూ.1.5 కోట్లకే దక్కించుకున్న టీ20 నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌ ఆ జట్టు అస్త్రాల్లో ఒకడు. బౌలింగ్‌లో ఈసారి కొత్త పేసర్లతో ఆ జట్టు కళకళలాడుతోంది. ముఖ్యంగా వేలంలో కోట్లు పెట్టి దక్కించుకున్న ఆస్ట్రేలియా బౌలర్లు జే రిచర్డ్‌సన్‌ (రూ.14 కోట్లు), రేలీ మెరీడిత్‌   (రూ.8 కోట్లు) నుంచి పంజాబ్‌ మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది. గాయం నుంచి కోలుకున్న స్టార్‌ పేసర్‌ షమితో పాటు స్పిన్నర్లు రవి బిష్ణోయ్‌, మురుగన్‌ అశ్విన్‌లతో కింగ్స్‌ బౌలింగ్‌ పటిష్టంగా కనిపిస్తోంది.

బలహీనతలు

మెరుగైన ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం పంజాబ్‌ ప్రధాన బలహీనత. గత సీజన్లో చాలా మ్యాచ్‌ల్లో రాహుల్‌-మయాంక్‌ మంచి ఆరంభాలు ఇచ్చినా.. మిడిలార్డర్‌ తడబాటుతో కింగ్స్‌ ఓటములు చవిచూసింది. గేల్‌ నిలకడలేని ఆట కూడా పంజాబ్‌కు సమస్య. అతడిని ఆడించాలో లేదో తెలియని పరిస్థితి. ఇక ఆస్ట్రేలియా బౌలర్లు జే రిచర్డ్‌సన్‌, మెరిడీత్‌లకు భారత పిచ్‌లపై అనుభవం లేకపోవడం ప్రతికూలాంశం. పేసర్‌ షమి పోటీ క్రికెట్‌ ఆడి చాలా రోజులు కావడం కూడా పంజాబ్‌పై ప్రభావం చూపనుంది. స్పిన్‌ విభాగంలో బిష్ణోయ్‌ లాంటి కుర్రాళ్లు ఉన్నా.. మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తా ఉన్న స్పిన్నర్లు లేకపోవడం ఆ జట్టును ఇబ్బంది పెట్టే మరో అంశం. మిగిలిన జట్ల మాదిరి దేశవాళీ కుర్రాళ్లు బ్యాటింగ్‌లో రాణించలేకపోవడం పంజాబ్‌ను దెబ్బ తీస్తోంది. ముఖ్యంగా అవకాశాలు వస్తున్నా సర్ఫ్‌రాజ్‌ఖాన్‌, మన్‌దీప్‌, దీపక్‌ హుడా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.

దేశీయ ఆటగాళ్లు: రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, మన్‌దీప్‌ సింగ్‌, ఇషాన్‌ పొరెల్‌, సర్ఫ్‌రాజ్‌ ఖాన్‌, మురుగన్‌ అశ్విన్‌, దీపక్‌ హుడా, మహ్మద్‌ షమి, రవి బిష్ణోయ్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, దర్శన్‌,  అర్ష్‌దీప్‌ సింగ్‌, షారుక్‌ ఖాన్‌, జలజ్‌ సక్సేనా, ఉత్కర్ష్‌ సింగ్‌, సౌరభ్‌ కుమార్‌.
విదేశీయులు: క్రిస్‌ గేల్‌, జోర్డాన్‌, పూరన్‌, డేవిడ్‌ మలన్‌, జే రిచర్డ్‌సన్‌, రిలీ మెరిడీత్‌, హెన్రిక్స్‌, ఫాబియన్‌ అలెన్‌. కీలక ఆటగాళ్లు: రాహుల్‌, మయాంక్‌, షమి గేల్‌, పూరన్‌, మలన్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన