ఆ ఒక్క అడుగు పడేనా?
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 06/04/2021 02:07 IST

ఆ ఒక్క అడుగు పడేనా?

ఐపీఎల్‌-14 ఇంకో 3 రోజుల్లో
ఈనాడు క్రీడావిభాగం

ఐపీఎల్‌లో 2019 ముందు వరకూ ఆ జట్టుపై పెద్దగా అంచనాల్లేవు.. ఎందుకంటే అంతకుముందు ఆరు సీజన్లలో ఆ జట్టు ప్రదర్శన పేలవం. ఆఖరి స్థానంలో లేదా చివరి నుంచి రెండో స్థానంలో నిలుస్తూ వచ్చింది. కానీ రెండేళ్ల క్రితం కొత్త పేరుతో.. పూర్తిస్థాయిలో ఆటగాళ్లను మార్చుకుని.. కుర్రాళ్లకు ప్రాధాన్యతనిచ్చి యువ రక్తాన్ని నింపుకొని వచ్చిన ఆ జట్టు.. 2019లో అంచనాలకు మించి రాణించింది. అదే దూకుడు కొనసాగించి నిరుడు రన్నరప్‌గా నిలిచింది. ఆ జట్టే.. దిల్లీ క్యాపిటల్స్‌. లీగ్‌లో తొలి టైటిల్‌ వేట కొనసాగిస్తున్న ఆ జట్టు.. ఈ సారి ట్రోఫీ దిశగా ఆ ఒక్క అడుగు వేయాలనే లక్ష్యంతో ఉంది. మరి తొలిసారి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రిషబ్‌ పంత్‌ దూకుడు జట్టును విజేతగా నిలుపుతుందా? దిల్లీ బోణీ కొడుతుందా?

పీఎల్‌లో ప్రస్తుతం అత్యంత సమతూకంగా కనిపిస్తున్న జట్టు దిల్లీ క్యాపిటల్స్‌ అంటే ఏ మాత్రం అతిశయోక్తి కానే కాదు. సీనియర్లు, జూనియర్ల మేళవింపుతో.. అనుభవం, దూకుడు కలగలిసి.. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న ఆ జట్టు ఈ సీజన్‌లో కచ్చితంగా టైటిల్‌కు ప్రధాన పోటీదారు అనడంలో సందేహం లేదు. గత సీజన్‌లోనే గొప్ప ప్రదర్శనతో తొలి టైటిల్‌ నెగ్గేలా కనిపించిన ఆ జట్టుకు ఫైనల్లో బలమైన ముంబయి ఇండియన్స్‌ అడ్డుపడింది. ఇప్పటికే ఆటగాళ్ల విషయంలో అత్యధిక ప్రత్యామ్నాయాలున్న జట్టుగా కనిపిస్తున్న దిల్లీ.. ఈ సారి వేలంలో ప్రపంచ స్థాయి అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ (రూ.2 కోట్లు)తో పాటు పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ (రూ.కోటి), విదేశీ ఆల్‌రౌండర్లు టామ్‌ కరన్‌ (రూ.5.25 కోట్లు), సామ్‌ బిల్లింగ్స్‌ (రూ.2 కోట్లు)ను తీసుకుని తన బృందాన్ని మరింత దుర్భేద్యంగా మార్చేసింది. మరోవైపు గాయం కారణంగా శ్రేయస్‌ అయ్యర్‌ దూరం కావడంతో అతని స్థానంలో కొత్త కెప్టెన్‌గా పంత్‌ ఏ మేరకు రాణించగలడోననే ఆసక్తి రేకెత్తుతోంది.

బలాలు..

పీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తర్వాత అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా ఉన్న జట్టు దిల్లీ క్యాపిటల్స్‌. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అగ్రశ్రేణి ఆటగాళ్లతో తిరుగులేని బలాన్ని సొంతం చేసుకుంది. మంచి ఓపెనర్లు.. గొప్ప మిడిలార్డర్‌.. సూపర్‌ ఫినిషర్లు ఇలా బ్యాటింగ్‌లో ఆ జట్టుకు ప్రతి స్థానంలోనూ ఓ మ్యాచ్‌ విన్నర్‌ ఉన్నాడు. ఓపెనర్లు పృథ్వీ షా, ధావన్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. గత సీజన్‌లో అద్వితీయమైన బ్యాటింగ్‌తో చెలరేగిన ధావన్‌ మరోసారి ఐపీఎల్‌కు ముందు ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఫామ్‌ అందుకోవడం శుభసూచకం. విజయ్‌ హజారె వన్డే టోర్నీలో పరుగుల వరద పారించి రికార్డులు కొల్లగొట్టిన పృథ్వీ షా దూకుడు మీదున్నాడు. స్మిత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన క్లాస్‌కు మాస్‌ జోడించి గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడగలడు. వీళ్లకు తోడు రహానె ఉండనే ఉన్నాడు. ఇక ఈ సారి లీగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఆటగాడిగా పంత్‌పై భారీ అంచనాలున్నాయి. తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న అతను ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగలడు. ఇప్పుడు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు కాబట్టి మరింత దూకుడుతో జట్టుకు విజయాలు అందించే వీలుంది. హెట్‌మయర్‌తో పాటు విదేశీ ఆల్‌రౌండర్లు స్టాయినిస్‌, క్రిస్‌ వోక్స్‌, సామ్‌ బిల్లింగ్స్‌, టామ్‌ కరన్‌ భారీ షాట్లతో మ్యాచ్‌ను ముగించగలరు. బౌలింగ్‌లోనూ ఆ జట్టుకు ఎదురులేదు. గత సీజన్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించిన రబాడ, నార్జ్‌ ద్వయం మరోసారి సత్తాచాటేందుకు సిద్ధమైంది. వీళ్లకు తోడు భారత అగ్రశ్రేణి పేసర్లు ఇషాంత్‌, ఉమేశ్‌ కూడా ఉన్నారు. ఇక స్పిన్‌లో సీనియర్లు మిశ్రా, అశ్విన్‌ అనుభవంతో పాటు అక్షర్‌ పటేల్‌ ఫామ్‌ జట్టుకు ఉపయోగపడేదే.

బలహీనతలు..

2018 సీజన్‌ మధ్యలో పగ్గాలు చేపట్టి.. జట్టుకు దూకుడు నేర్పి.. ఆటగాళ్ల ఆలోచనా విధానంతో పాటు దృక్పథాన్ని మార్చిన శ్రేయస్‌ అయ్యర్‌ గాయం కారణంగా ఈ సీజన్‌ మొత్తానికి దూరమవడం ఆ జట్టుకు ఇబ్బంది కలిగించే అంశం. తన నాయకత్వంతో రెండేళ్ల ముందు జట్టును ప్లేఆఫ్‌ చేర్చిన అతను.. నిరుడు టైటిల్‌కు చేరువగా తీసుకెళ్లాడు. ఈ సారి ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలనే లక్ష్యంతో ఉన్న నేపథ్యంలో అతని గైర్హాజరీ జట్టుపై ప్రభావం చూపనుంది. కెప్టెన్‌గానే కాకుండా నాలుగో స్థానంలో కీలక ఆటగాడిగా అతను జట్టుకు ఎంతో అవసరం. బ్యాటింగ్‌ పరంగా ఇప్పుడు ఇబ్బందులు లేనప్పటికీ.. సారథిగా అతని స్థానంలో బాధ్యతలు తీసుకున్న 23 ఏళ్ల పంత్‌ ఆ ఒత్తిడిని ఎలా తట్టుకుంటాడో చూడాలి. అతడికి కెప్టెన్సీ భారంగా మారితే జట్టుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇక మ్యాచ్‌ల్లో ఏ నలుగురు విదేశీ ఆటగాళ్లను ఆడించాలనేది ఆ జట్టుకు తలనొప్పిగా మారనుంది. ఇప్పటికే జట్టులో ఉన్న విదేశీ ఆటగాళ్లు చాలదన్నట్లు.. వేలంలో స్మిత్‌, టామ్‌ కరన్‌, బిల్లింగ్స్‌లను తీసుకున్నారు. గత సీజన్‌కు దూరమైన వోక్స్‌ తిరిగొచ్చాడు. మామూలుగా అయితే రబాడ, నార్జ్‌ పేసర్లుగా జట్టులో కొనసాగుతారు. గత సీజన్‌లో మెరిసిన స్టాయినిస్‌ ఆల్‌రౌండర్‌గా ఉంటాడు. మిగిలిన ఒక్క స్థానంలో స్మిత్‌ను ఆడించే అవకాశాలే ఎక్కువ.

దేశీయ ఆటగాళ్లు: పంత్‌ (కెప్టెన్‌), రహానె, అశ్విన్‌, సిద్ధార్థ్‌, విష్ణు వినోద్‌, లలిత్‌ యాదవ్‌, అవేశ్‌ ఖాన్‌, అక్షర్‌, అమిత్‌ మిశ్రా, ఇషాంత్‌, రిపల్‌ పటేల్‌, ధావన్‌, ప్రవీణ్‌ దూబె, పృథ్వీ షా, ఉమేశ్‌, లక్మన్‌
విదేశీయులు: టామ్‌ కరన్‌, నార్జ్‌, హెట్‌మయర్‌, స్మిత్‌, క్రిస్‌ వోక్స్‌, బిల్లింగ్స్‌, స్టాయినిస్‌, రబాడ
కీలక ఆటగాళ్లు: ధావన్‌, పంత్‌, రబాడ, అశ్విన్‌
ఉత్తమ ప్రదర్శన: 2020లో రన్నరప్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన