
ప్రధానాంశాలు
సవాలుకు నిలుస్తారా!
ఐపీఎల్-14 రేపటి నుంచే
సచిన్, గంగూలీ, ద్రవిడ్, సెహ్వాగ్ లాంటి మహామహులు రిటైరయ్యాక భారత క్రికెట్‌ను ముందుకు నడిపించిన ఘనత మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీలదే. అంతర్జాతీయ క్రికెట్ అనే కాదు.. ఐపీఎల్‌పైనా వీరి ముద్ర ప్రత్యేకమైంది. వీళ్లకున్న ఆకర్షణ వేరు. వీరి సామర్థ్యం వేరు. తిరుగులేని అభిమాన గణంతో లీగ్‌కే ప్రత్యేక వన్నె తెచ్చే ఆటగాళ్లు వీళ్లు. అయితే ఇంకొక్క రోజులో ఆరంభం కానున్న 14వ సీజన్లో వీరికి కఠిన సవాలు ఎదురు కానుంది. గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీకి ఇదే చివరి సీజన్ కావొచ్చని భావిస్తున్న నేపథ్యంలో అతను నిరుటి పేలవ ప్రదర్శనను అధిగమించి చెన్నైకి మరో టైటిల్ అందించి ఘనంగా మైదానం వీడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికీ టైటిళ్ల బోణీ కొట్టని బెంగళూరును తొలిసారి విజేతగా నిలపాల్సిన భారం కోహ్లీదే.
ఈనాడు క్రీడావిభాగం
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తావన రాగానే టక్కున గుర్తొచ్చే పేరు ధోని. ఆ జట్టుతో అతడి బంధం అలాంటింది. 2008లో లీగ్ పురుడు పోసుకున్నపుడు.. తొలిసారి వేలంలో ధోనీని సొంతం చేసుకున్న ఆ జట్టు కెప్టెన్‌గా పగ్గాలు అందించింది. లీగ్‌లో జట్లు మారాయి.. కెప్టెన్లూ మారారు. కానీ లీగ్ ఆరంభం నుంచి ఇప్పటివరకూ సీఎస్కేకు సారథిగా ధోని మాత్రమే ఉన్నాడు. 11 సీజన్ల (2016, 2017 సీజన్లలో సీఎస్కేపై నిషేధం)లో జట్టును నడిపించిన అతను.. మూడు టైటిళ్లు (2010, 2011, 2018) అందించాడు. లీగ్‌లో ముంబయి ఇండియన్స్ (5 టైటిళ్లు) తర్వాత అత్యంత విజయవంతమైన జట్టుగా సీఎస్కేను నిలిపాడు. గత సీజన్ ముందు వరకూ ఆడిన ప్రతిసారి జట్టును ప్లేఆఫ్ చేర్చాడు. కానీ నిరుడు మాత్రం లీగ్‌లో ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా పేలవ ఆటతీరుతో సీఎస్కే తొలిసారి ప్లేఆఫ్ చేరలేక.. చివరి నుంచి రెండో స్థానంతో సీజన్‌ను ముగించింది. ధోని వ్యక్తిగత వైఫల్యం మాత్రం చర్చనీయాంశంగా మారింది. దీంతో ధోని చరిష్మా, ఆటగాళ్ల సామర్థ్యంపై ఒక్కసారిగా అనుమానాలు మొదలయ్యాయి. అయితే 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ (జులై 9) తర్వాత తిరిగి 2020 ఐపీఎల్‌లోనే అతను పోటీ క్రికెట్ ఆడాడు. దాదాపు 14 నెలలుగా మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడంతో తనదైన ముద్ర వేయలేకపోయాడు. తన ప్రదర్శన పడిపోవడంతో జట్టులోనూ ఆత్మవిశ్వాసం నింపలేకపోయాడు. ఒకప్పుడు ఐపీఎల్ అంటే.. సీఎస్కేతో ఫైనల్లో పోటీపడడం కోసం మిగతా ఏడు జట్లు తలపడతాయనే అభిప్రాయం జనాల్లో ఉండేది. జట్టును అలాంటి స్థాయికి చేర్చిన ఘనత ధోనీది. కానీ నిరుడు అతని వ్యూహాలు పని చేయలేక, అతని బ్యాట్ పరుగులు చేయలేక తడబడుతుంటే అభిమానులు తట్టుకోలేకపోయారు. ఇక గత సీజన్ చెడు జ్ఞాపకాలకు ముగింపు పలికి తిరిగి జట్టును విజేతగా నిలిపేందుకు ఇప్పుడతనికి అవకాశం వచ్చింది. నిజానికి గతేడాది ఐపీఎల్ తర్వాత ధోని మ్యాచ్లాడిందే లేదు. కానీ నాలుగు నెలల వ్యవధిలోనే మరో సీజన్ జరుగుతుండడంతో ఈ సారి లీగ్‌లో అడుగుపెడుతున్నాడు. కానీ వచ్చే ఏడాది వరకూ మళ్లీ మ్యాచ్ ప్రాక్టీస్ ఉండదు కాబట్టి అతనిక భవిష్యత్ ఐపీఎల్లో కనిపించడం అనుమానమే! గత సీజన్ వైఫల్యం నేపథ్యంలో ఈసారి టోర్నీకి ధోని బాగానే సన్నద్ధమై ఉంటాడని భావిస్తున్నారు. ఈ సీజన్లో తాను మెరవడంతో పాటు జట్టుకూ పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మహిపై ఉంది. గత సీజన్లో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా.. యువ ఆటగాళ్లకు అవకాశాలిస్తూ గెలుపు బాటలో జట్టును నడిపించాలి. మునుపటంత వేగంగా ఆడలేకపోవచ్చు.. కానీ ఇప్పటికీ ధోని బ్యాట్ నుంచి మెరుపులు ఆశించవచ్చు.
విరాట్ కోహ్లి.. దూకుడు మంత్రంగా అంతర్జాతీయ క్రికెట్లో టీమ్ఇండియాను సమర్థంగా నడిపిస్తున్న నాయకుడు. విదేశాల్లోనూ టెస్టు విజయాలు అందిస్తున్న సారథి. బ్యాట్‌తో, నాయకత్వంతో ఆకట్టుకుంటూ ప్రపంచ మేటి క్రికెటర్‌గా మన్ననలు పొందుతున్నాడు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఐపీఎల్లో ఇప్పటివరకూ కెప్టెన్‌గా ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడనే అపప్రద వెంటాడుతూనే ఉంది. 2013లో బెంగళూరు సారథిగా పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించిన అతను అప్పటినుంచి టైటిల్ వేట కొనసాగిస్తూనే ఉన్నాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి మొదట ఆటగాడిగా, ఆ తర్వాత కెప్టెన్‌గా అతను ఆర్సీబీతోనే ప్రయాణిస్తున్నాడు. ప్రతి సారి సీజన్ ఆరంభమయ్యే ముందు ఈ సారైనా జట్టుకు ట్రోఫీ అందిస్తాడేమోనని అతనిపై ఆశలు పెట్టుకోవడం.. చివరకు నిరాశపడడం అభిమానులకు అలవాటుగా మారింది. అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్‌గా రాణిస్తున్న అతను.. ఈ లీగ్‌లో మాత్రం ఎందుకు విజయవంతం కాలేకపోతున్నాడన్నదే మింగుడుపడని ప్రశ్న. అతని కెప్టెన్సీలో ఇప్పటివరకూ ఆర్సీబీ రెండు సార్లు ప్లేఆఫ్స్ (2015, 2020)కు చేరింది. మరోసారి రన్నరప్ (2016)గా నిలిచింది. కానీ టైటిళ్ల బోణీ మాత్రం కొట్టలేకపోయింది. మరోవైపు సమవుజ్జీ అయిన రోహిత్ సారథిగా ముంబయికి అయిదు టైటిళ్లు అందించాడు. కానీ కోహ్లి మాత్రం ఆ విషయంలో వెనకబడుతూనే ఉన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా అతను లీగ్‌లోనూ పరుగుల వరద పారిస్తాడు. ప్రతి సీజన్లోనూ రాణిస్తాడు. అతనికి తోడు డివిలియర్స్ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లూ ఉన్నారు. కానీ ఆ జట్టులో సమష్టితత్వం లోపించడమే ప్రధాన సమస్య. కెప్టెన్‌గా కోహ్లి.. ఆర్సీబీ కలిసికట్టుగా ఆడేలా చూడడంలో విఫలమవుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాట్స్‌మన్‌గా అతనెంత గొప్ప ప్రదర్శన చేసినా జట్టు సమష్టిగా రాణించకపోతే టైటిల్ దక్కదనడానికి 2016 సీజన్ ఓ ఉదాహరణ. ఆ ఏడాది 81.08 సగటుతో 973 పరుగులు చేసిన అతను.. ఓ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తూ ఒంటిచేత్తో జట్టును ఫైనల్ చేర్చాడు. కానీ సమష్టిగా ఆడడంలో విఫలమైన జట్టు చివరి మెట్టుపై బోల్తా పడింది. ఐపీఎల్‌లోనూ, అంతర్జాతీయ టీ20 క్రికెట్లోనూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న అతను.. జట్టుకు తొలి టైటిల్ అందించాలంటే ఆటగాళ్లందరినీ ఒక్కతాటిపై నడిపించాల్సి ఉంది. ఈసారి మ్యాక్స్‌వెల్ లాంటి విధ్వంసక ఆల్‌రౌండర్ చేరడంతో జట్టు బలం పెరిగింది. జట్టులో మరికొన్ని మంచి మార్పులు జరిగాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అతను ఐపీఎల్ టైటిల్ నిరీక్షణకు తెరదించుతాడేమో చూడలి.
మరిన్ని
సినిమా
- ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత
- ఆ పాత్రలకు.. ఎవరు సరిపోతారా..!
- WhatsApp: ఈ ‘పింక్’ లింక్ మీకూ వచ్చిందా?
- కొవిడ్.. కొత్తగా!
- Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
- social look: అషు ప్రార్థన.. అఖిల్ కొత్తగా..
- విరాళంగా వచ్చిన 15వేల చెక్కులు బౌన్స్!
- ఉదయాన్నే మజ్జిగ తాగండి..
- నీ ఆశలన్నీ.. నా శ్వాసలోనే
- చివరిసారి సంతోషంగా ఉన్నది అప్పుడే: ధోనీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
