కరోనా వేళ క్రికెట్‌ మేళా
close

ప్రధానాంశాలు

Updated : 09/04/2021 07:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా వేళ క్రికెట్‌ మేళా

నేటి నుంచే ఐపీఎల్‌-14
తొలి మ్యాచ్‌లో ముంబయి × బెంగళూరు
రాత్రి 7.30 నుంచి

చెన్నై

ఇక వినోదమే వినోదం. కరోనా పెను సవాలు విసురుతుండగా.. భయాల మధ్యే, ఖాళీ స్టేడియాల్లోనే  అభిమానులకు అలరించేందుకు, ఉత్సాహ పరిచేందుకు వచ్చేసింది ధనాధన్‌ పండగ. కళ్లు చెదిరే షాట్లతో ఉర్రూతలూగించేందుకు బ్యాట్స్‌మెన్‌.. అదిరే బౌలింగ్‌తో ఆకట్టుకునేందుకు బౌలర్లు, అబ్బురపరిచే విన్యాసాలతో ఊపేసేందుకు ఫీల్డర్లు సిద్ధం. నేటి నుంచే ఐపీఎల్‌ 2021.

అయిదు నెలల్లో ఇది రెండో ఐపీఎల్‌.  నిర్వహణ పెను సవాలే. అంతా బయో బబుల్‌లోనే. మారిన నిబంధనలతో ఏ జట్టూ సొంతగడ్డపై మ్యాచ్‌లు ఆడలేదు. టోర్నీ తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు  ఢీకొంటుంది. చూద్దాం.. ఏడు వారాల టోర్నీలో ఎవరు మెరుస్తారో, ఎన్ని రికార్డులు బద్దలవుతాయో!

దేశమంతా కొవిడ్‌-19 విజృంభిస్తున్నప్పటికీ ధనాధన్‌ టోర్నీ సిద్ధమైపోయింది. శుక్రవారం నుంచే ఐపీఎల్‌-14. రోజుకు లక్ష దాటుతున్న కరోనా కేసులను చూస్తూ కలవరపడుతున్న సగటు అభిమానికి ఆకాశాన్నంటే సిక్స్‌లు, సర్రును దూసుకుపోయే యార్కర్లు ఉపశమనాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. చెన్నైలో జరిగే మొదటి మ్యాచ్‌లో రోహిత్‌ సారథ్యంలోని డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌.. విరాట్‌ నేతృత్వంలోని బెంగళూరును ఢీకొంటుంది. రెండు జట్లలోనూ భారీ హిట్టర్లున్న నేపథ్యంలో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది.

ముంబయికి ఎదురుందా!: ఇప్పటికే రికార్డు స్థాయిలో అయిదు సార్లు టైటిల్‌ గెలిచిన ముంబయి.. టోర్నీలో మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈసారి గెలిస్తే హ్యాట్రిక్‌ అవుతుంది. అత్యంత బలమైన జట్టు రోహిత్‌ చేతిలో ఉంది. రోహిత్‌, డికాక్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌, కృనాల్‌, పొలార్డ్‌.. ఇలా ఒకరి తర్వాత మరొకరు ప్రత్యర్థి బౌలర్లను పరీక్షించేందుకు సిద్ధంగా ఉంటారు. బుమ్రా, బౌల్ట్‌లతో అత్యంత బలమైన బౌలింగ్‌ దళం ముంబయి సొంతం.

వాళ్లు మెరుస్తారా!: తొలి టైటిల్‌ కోసం ఆశపడుతున్న బెంగళూరు.. విజయంతో బోణీ కొట్టాలనుకుంటోంది. బెంగళూరు ఈసారి వేలంలో భారీ మొత్తాలకు కొన్న గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, కైల్‌ జేమీసన్‌ ఏ మేరకు రాణిస్తారన్నది ఆసక్తికరం. సూపర్‌ ఫామ్‌లో ఉన్న పడిక్కల్‌తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నాడు. డివిలియర్స్‌పై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ముస్తాక్‌ అలీ ట్రోఫీలో చెలరేగిన కొత్త వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం.

కరోనా సవాల్‌

ఈ సీజన్‌ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినప్పటికీ.. కరోనా రక్కసి భయం మాత్రం లీగ్‌ను వెంటాడుతూనే ఉంది. ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే గత ఏడాది సెప్టెంబర్‌కు ముందు రోజువారీ కేసుల సంఖ్య తక్కువగా ఉంది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా లీగ్‌ను యూఏఈకి తరలించారు. ఆ తర్వాత వైరస్‌ ఉద్ధృతి తగ్గడంతో భారత్‌లోనే ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహించాలని నిర్ణయించారు. కానీ సీజన్‌ దగ్గరపడుతున్నప్పటి నుంచి కరోనా ఉద్ధృతి పెరిగింది. ఐపీఎల్‌లో భాగమైన వారు కొవిడ్‌ బారిన పడుతున్నారు. కరోనా వెంటాడుతున్నప్పటికీ.. యూఏఈలో లాగే విజయవంతంగా టోర్నీ నిర్వహించగలమన్న ఆశాభావంతో బీసీసీఐ ఉంది. ఈ ఏడాదే భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ లీగ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది.

అరగంట ముందే

గత సీజన్‌లో మాదిరిగానే ఈసారి మధ్యాహ్నం మ్యాచ్‌ 3.30 గంటలకు, రాత్రి మ్యాచ్‌ 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి.

నాలుగింట్లోనే ఆట

గతంలో ఐపీఎల్‌ జట్లు సొంతగడ్డలో ఏడు, బయట ఏడు మ్యాచ్‌లు ఆడేవి. కరోనా నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫార్మాట్‌ కొంచెం మారింది. ఈసారి ఆరు వేదికల్లో ఐపీఎల్‌ జరగనుండగా.. ఏ జట్టు సొంతగడ్డపై ఆడదు. లీగ్‌ దశలో ఏ జట్టయినా నాలుగు వేదికల్లోనే మ్యాచ్‌లు ఆడనుంది. క్వాలిఫయర్స్‌, ఎలిమినేటర్‌, ఫైనల్‌కు అహ్మదాబాద్‌ వేదిక.

తొలి అడుగు వేసేందుకు..

ఐపీఎల్‌ సీజన్‌ వస్తుందంటే లీగ్‌లో అరంగేట్రం చేసే ఆటగాళ్లపై అంచనాలు మొదలవుతాయి. ఈ సారి కూడా కొంతమంది ఆటగాళ్లు తొలి అడుగులోనే బలమైన ముద్ర వేయాలనే పట్టుదలతో ఉన్నారు. వాళ్లలో సచిన్‌ తనయుడు అర్జున్‌ తెందుల్కర్‌ (ముంబయి) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. షారుక్‌ ఖాన్‌ (పంజాబ్‌ కింగ్స్‌), మహమ్మద్‌ అజహరుద్దీన్‌ (రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు) కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నారు. మరోవైపు జెమీసన్‌, ఫిన్‌ అలెన్‌ (ఆర్సీబీ), రిచర్డ్‌సన్‌, మెరెడిత్‌, డేవిడ్‌ మలన్‌ (పంజాబ్‌ కింగ్స్‌), మార్కో జాన్సెన్‌ (ముంబయి ఇండియన్స్‌) లాంటి విదేశీ ఆటగాళ్లూ సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు.

 

ధరకు న్యాయం చేస్తారా?

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్‌ మినీ వేలంలో భారీ ధర చెల్లించి కొనుక్కున్న ఆటగాళ్లపై జట్లు ఆశలు పెట్టుకున్నాయి. దక్షిణాఫ్రికా సీనియర్‌ పేస్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ కోసం రాజస్థాన్‌  ఏకంగా రూ.16.25 కోట్లు ఖర్చుపెట్టింది. మరోవైపు తొలి టైటిల్‌ వేట కొనసాగిస్తున్న ఆర్సీబీ.. న్యూజిలాండ్‌ యువ పేస్‌ ఆల్‌రౌండర్‌ జెమీసన్‌ (రూ.15 కోట్లు), ఆసీస్‌ విధ్వంసక ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌ (రూ.14.25 కోట్లు)కు పెద్ద మొత్తంలో చెల్లించింది. వీళ్ల రాకతోనైనా తమ అదృష్టం మారుతుందనే ఆశతో జట్టు ఉంది. రిచర్డ్‌సన్‌ (రూ.14 కోట్లు), మెరెడిత్‌ (రూ.8 కోట్లు) కోసం పంజాబ్‌ కింగ్స్‌, స్పిన్నర్లు కృష్ణప్ప గౌతమ్‌ (రూ.9.25 కోట్లు), మొయిన్‌ అలీ (రూ.7 కోట్లు) కోసం సీఎస్కే భారీగా ఖర్చు పెట్టాయి.

* ఈ ఐపీఎల్‌ మరో ప్రత్యేక ఆకర్షణ కూడా ఉంది. ఇద్దరు యువ ఆటగాళ్లు తొలిసారి టోర్నీలో నాయకత్వం వహించబోతున్నారు. దిల్లీకి పంత్‌, రాజస్థాన్‌ జట్టుకు శాంసన్‌ కెప్టెన్లు. ఈసారి ఐపీఎల్‌ జట్లకు సారథ్యం వహిస్తున్న ఎనిమిది మందిలో నలుగురు వికెట్‌కీపర్లు కావడం విశేషం.

ఏ జట్టుకూ సొంతగడ్డపై ఆడే  అవకాశం లేదు ఇలాంటప్పుడు అన్ని జట్ల బలాలు సమానమే. తటస్థ వేదికల్లో ఆడడం వల్ల పోటీ పెరుగుతుంది. గత ఐపీఎల్‌లో ఇదే చూశాం. చివరి వరకు ప్లేఆఫ్‌ బెర్తు కోసం పోటీ సాగింది.

- కోహ్లి

3 ఈ సారి లీగ్‌లో పోటీపడుతున్న జట్లలో ఇప్పటివరకూ టైటిళ్లు గెలవని జట్లు. ఆర్సీబీ, దిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయాయి.

204 అత్యధిక మ్యాచ్‌లాడిన (204) ఆటగాడిగా సీఎస్కే కెప్టెన్‌ ధోని కొనసాగుతున్నాడు.

8 బెంగళూరుతో గత పది మ్యాచ్‌ల్లో ముంబయి విజయాలు. మొత్తం 27 మ్యాచ్‌ల్లో ముంబయి 17 నెగ్గింది.

5 ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకూ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచిన ముంబయి ఇండియన్స్‌ అయిదు టైటిళ్లు గెలిచింది.

5878 ఐపీఎల్‌లో కోహ్లి చేసిన పరుగులు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో అతనే అగ్రస్థానంలో ఉన్నాడు. సురేశ్‌ రైనా (5368) రెండో స్థానంలో ఉన్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన