IPL: బుడగలోకి Corona ఎలా వచ్చిందో
close

ప్రధానాంశాలు

Updated : 07/05/2021 06:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL: బుడగలోకి Corona ఎలా వచ్చిందో

దిల్లీ

ఐపీఎల్‌లో బయో బబుల్‌లోకి కరోనా మహమ్మారి ఎలా ప్రవేశించిందో చెప్పడం కష్టమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్నాడు. ఫిబ్రవరిలో కరోనా ఊసే లేకపోవడంతో భారత్‌లోనే ఐపీఎల్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపాడు. ఐపీఎల్‌ వాయిదా, తదితర విషయాలపై గంగూలీ ఏమన్నాడంటే..
యూఏఈ ప్రతిపాదన వచ్చింది కానీ..: ఐపీఎల్‌లో నిరుటి మాదిరే యూఏఈలో నిర్వహించాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ భారత్‌లో కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా (ఫిబ్రవరిలో) ఉండటంతో ఇక్కడే లీగ్‌ నిర్వహించాలని నిర్ణయించాం. ఇంగ్లాండ్‌ పర్యటనను విజయవంతంగా నిర్వహించాం కూడా. లీగ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించాం.
ఇప్పుడే ఏం చెప్పలేం..: ఊహించని విధంగా గత మూడు వారాల్లో కరోనా కేసుల సంఖ్య ఆకాశాన్ని తాకింది. దీంతో ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేయక తప్పలేదు. ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఐపీఎల్‌లో మిగతా మ్యాచ్‌ల నిర్వహణపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుంది. క్రికెట్‌ బోర్డులతో చర్చించి టీ20 ప్రపంచకప్‌ ముందు లీగ్‌ను పూర్తి చేసే అవకాశం ఉందేమో పరిశీలిస్తాం. లీగ్‌ ఆగిపోతే దాదాపుగా రూ. 2500 కోట్లు నష్టపోవాల్సి వస్తుంది.
నిబంధనలను ఉల్లంఘించలేదు: బయో బుడగలోకి కరోనా ఎలా ప్రవేశించిందో చెప్పడం కష్టం. బుడగ నిబంధనల్ని ఎవరూ ఉల్లంఘించలేదు. విమాన ప్రయాణం కారణం కావొచ్చు. గత ఏడాది యూఏఈలో మూడు వేదికల్లోనే లీగ్‌ జరిగింది. వాటి మధ్య దూరం కూడా పెద్దగా లేదు. విమాన ప్రయాణాల అవసరం లేకుండా పోయింది. బీసీసీఐ ఆధ్వర్యంలో నిపుణుల బృందం బుడగ భద్రతను పర్యవేక్షించింది. అయినా కరోనాను అడ్డుకోలేకపోయాం. విదేశీ ఆటగాళ్లను ఇళ్లకు చేర్చే వరకు మాదే బాధ్యత. అందరూ సురక్షితంగా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఆస్ట్రేలియన్లు మాల్దీవులకు వెళ్లారు. అక్కడ క్వారంటైన్‌ కాలం పూర్తి చేసుకుని ఆస్ట్రేలియాకు వెళ్తారు. ఆటగాళ్ల తిరుగు ప్రయాణంలో ఎలాంటి సమస్యలు లేవు.
పరిహారం చెల్లిస్తాం: ఇంగ్లాండ్‌ పర్యటనకు ముందు టీమ్‌ఇండియా ఆటగాళ్లకు చాలా సమయం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో టీకాల కార్యక్రమం కొనసాగుతుంది. వారి స్వస్థలాలకు వెళ్లిన తర్వాత టీకాలు వేసుకోవచ్చు. ఐపీఎల్‌లో ఆడిన దేశవాళీ క్రికెటర్లకు పరిహారం చెల్లిస్తాం.
షెడ్యూల్‌ ప్రకారమే ఆ ఫైనల్‌: జూన్‌ 18 నుంచి 22 వరకు సౌథాంప్టన్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ షెడ్యూలు ప్రకారం జరుగుతుంది. ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టగానే టీమ్‌ఇండియా 10 రోజులు క్వారంటైన్‌లో ఉంటుంది. క్రమం తప్పకుండా ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా మహమ్మారిపై పోరాటానికి నిరుడు రూ.51 కోట్లు విరాళంగా అందజేశాం. ఈసారి కూడా ఆర్థిక సహాయం ప్రకటిస్తాం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన