Olympics: సైనా, శ్రీకాంత్‌ ఆశలు ఆవిరి
close

ప్రధానాంశాలు

Updated : 13/05/2021 06:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Olympics: సైనా, శ్రీకాంత్‌ ఆశలు ఆవిరి

ఒలింపిక్‌ అర్హత అవకాశాలకు తెర
సింగపూర్‌ ఓపెన్‌ రద్దు
దిల్లీ

భారత అగ్రశ్రేణి క్రీడాకారులు సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌ల ఒలింపిక్‌ ఆశలు ఆవిరయ్యాయి. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించి పతకం సాధించాలన్న కలలు కల్లలయ్యాయి. ఒలింపిక్స్‌కు ముందు చివరి అర్హత టోర్నీ సింగపూర్‌ ఓపెన్‌ రద్దవడంతో సైనా, శ్రీకాంత్‌ల అవకాశాలకు తెరపడింది. జూన్‌ 1 నుంచి 6 వరకు జరగాల్సిన సింగపూర్‌ ఓపెన్‌ను కరోనా మహమ్మారి, ప్రయాణ సంబంధిత ఆంక్షల కారణంగా రద్దు చేస్తున్నట్లు బీడబ్ల్యూఎఫ్‌ బుధవారం ప్రకటించింది. ‘‘క్రీడాకారులు, అధికారులు, స్థానిక ప్రజల ఆరోగ్యం.. భద్రత దృష్ట్యా సింగపూర్‌ ఓపెన్‌ను రద్దు చేస్తున్నాం. ఈ టోర్నీ కోసం కొత్త తేదీల్ని ప్రకటించం. టోర్నీలో పాల్గొనే క్రీడాకారులకు సురక్షిత వాతావరణం అందించడం కోసం నిర్వాహకులు, బీడబ్ల్యూఎఫ్‌ అన్ని ప్రయత్నాలు చేశాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు ప్రయాణాల నిర్వహణను సంక్లిష్టమైన సవాళ్లుగా మార్చాయి’’ అని బీడబ్ల్యూఎఫ్‌ పేర్కొంది. టోక్యో ఒలింపిక్స్‌ అర్హతకు సంబంధిన ప్రకటనను మరోరోజు విడుదల చేస్తామని వెల్లడించింది.
నిజానికి భారత్‌లో జరగాల్సిన ఇండియా ఓపెన్‌ రద్దయినప్పుడే సైనా, శ్రీకాంత్‌, సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్పల ఒలింపిక్స్‌ అర్హత అవకాశాలు సన్నగిల్లాయి. అయితే మలేసియా ఓపెన్‌ (మే 25- 30), సింగపూర్‌ ఓపెన్‌లలో సత్తాచాటి ఒలింపిక్స్‌కు అర్హత సాధించొచ్చని భారత క్రీడాకారులు ఆశించారు. కరోనా తీవ్రతతో మలేసియా ఓపెన్‌ వాయిదా పడటం సైనా, శ్రీకాంత్‌, సిక్కి జోడీల అవకాశాల్ని మరింత దెబ్బతీసింది. తాజాగా సింగపూర్‌ ఓపెన్‌ రద్దు నిర్ణయం ఒలింపిక్స్‌ ద్వారాల్ని దాదాపుగా మూసేసింది. మెగా క్రీడల అర్హతపై బీడబ్ల్యూఎఫ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో గాని ప్రస్తుతానికి మాత్రం సైనా, శ్రీకాంత్‌, సిక్కిరెడ్డి- అశ్వినిల ఒలింపిక్‌ అవకాశాలకు గండి పడినట్లే. ఇప్పటి వరకు భారత్‌ నుంచి పి.వి.సింధు, సాయిప్రణీత్‌, సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌ శెట్టిలు ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.
ఇక 31 ఏళ్ల సైనాకు టోక్యోనే చివరి ఒలింపిక్స్‌ అవుతుందన్నది అత్యధికుల అభిప్రాయం. 2020లోనే ఒలింపిక్స్‌ జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడ్డాయి. 2021లో కూడా జరిగేది అనుమానమే. ఈసారి కూడా సాధ్యంకాకపోతే టోక్యో ఒలింపిక్స్‌ రద్దవడం ఖాయం! ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రీడాకారులంతా 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ వరకు ఆగాల్సిందే. అయితే కెరీర్‌ చరమాంకంలో ఉన్న సైనా అప్పటి వరకు ఆట కొనసాగిస్తుందా? అన్నది అనుమానమే! అప్పటికి ఆమెకు 34 ఏళ్లు వస్తాయి. 2019లో ఇండోనేసియా మాస్టర్స్‌లో విజేతగా నిలిచిన సైనా ఆ తర్వాత ఒక్క అంతర్జాతీయ టైటిల్‌ సాధించలేదు.  ఏదేమైనా వరుసగా మలేసియా, సింగపూర్‌ ఓపెన్‌లు రద్దవడం.. ఒలింపిక్స్‌పై అనిశ్చితి నెలకొనడం సైనా కెరీర్‌పై ప్రభావం చూపేవే! పోరాటస్ఫూర్తి కలిగిన సైనా రానున్న ఏడాది, రెండేళ్లలో అద్భుతాలేమైనా చేస్తుందేమో చూడాలి!



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన