వికెట్లను తన్ని.. నేలకేసి కొట్టి..!
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 12/06/2021 02:23 IST

వికెట్లను తన్ని.. నేలకేసి కొట్టి..!

హద్దులు దాటిన షకిబ్‌ ఆగ్రహం
దేశవాళీ మ్యాచ్‌లో అంపైర్లతో తీవ్ర వాగ్వాదం

ఢాకా: 57 టెస్టులు.. 212 వన్డేలు.. 76 టీ20లు.. 600లకు పైగా దేశవాళీ మ్యాచ్‌లు ఆడిన అనుభవం! అంతర్జాతీయ స్థాయిలో సుమారు 12000 పరుగులు.. 571 వికెట్లు తీసిన రికార్డు. ఐపీఎల్‌, బిగ్‌బాష్‌, బీపీఎల్‌, పీఎస్‌ఎల్‌, పీఎస్‌ఎల్‌ సహా ప్రపంచంలోని అన్ని టీ20 లీగ్‌ల్లో బరిలో దిగిన నిఖార్సయిన ఆల్‌రౌండర్‌. బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆటగాడిగా.. దిగ్గజ క్రికెటర్‌గా మంచి పేరు సంపాదించుకున్న షకిబల్‌ హసన్‌ నేపథ్యమిది! ఇలాంటి క్రికెటర్‌ తన ప్రవర్తనతో క్రికెట్‌ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఢాకా ప్రిమియర్‌ లీగ్‌లో శుక్రవారం మహ్మదాన్‌ స్పోర్టింగ్‌, అబహని లిమిటెడ్‌ జట్ల మధ్య టీ20 మ్యాచ్‌ జరిగింది. మహ్మదాన్‌ కెప్టెన్‌ షకిబ్‌ ఇన్నింగ్స్‌ అయిదో ఓవర్లో ఆఖరి బంతికి ముష్ఫికర్‌ ఎల్బీ కోసం గట్టిగా అప్పీల్‌ చేశాడు. ఆ అప్పీల్‌ను అంపైర్‌ తిరస్కరించడంతో షకిబ్‌ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. షకిబ్‌ వికెట్లను కాలితో తన్నడంతో బెయిల్స్‌ ఎగిరి పడ్డాయి. అది ఔటేనంటూ అంపైర్‌తో అతను తీవ్ర వాగ్వాదానికి దిగాడు. తర్వాతి ఓవర్‌ ఆరో బంతికి వర్షం కారణంగా అంపైర్‌ ఆటను నిలిపి వేస్తుండగా మరోసారి దూసుకొచ్చిన షకిబ్‌ మూడు వికెట్లను ఊడబీకి నేలకేసి కొట్టాడు. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో ఫలితం తేల్చాలంటే.. కనీసం ఆరు ఓవర్లు పూర్తయి ఉండాలి. అయితే ఆరో ఓవర్లో ఇంకో బంతి ఉండగా ఆటను ఎలా ఆపేస్తారంటూ షకిబ్‌ ఆగ్రహంతో ఊగిపోయాడు. అంపైర్‌తో మరోసారి వాదనకు దిగాడు. కానీ వర్షం పెద్దదవడంతో అంపైర్లు, ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. అయితే తన దురుసు ప్రవర్తనపై దుమారం రేగడంతో తర్వాత షకిబ్‌ క్షమాపణలు చెప్పాడు. ఐపీఎల్‌తో పాటు బంగ్లాదేశ్‌, జింబాబ్వే, శ్రీలంక ముక్కోణపు సిరీస్‌లో బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని దాచిపెట్టినందుకు ఐసీసీ షకిబ్‌పై ఏడాది నిషేధం ఎదుర్కొని గత ఏడాది అక్టోబరులోనే పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. తాజా ప్రవర్తన నేపథ్యంలో అతడిపై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన