మెస్సి.. ఓ ముద్దు
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 12/07/2021 01:16 IST

మెస్సి.. ఓ ముద్దు

కోపా అమెరికా ఫైనల్లో రిఫరీ ఆఖరి ఈల వేయగానే.. మైదానంలో ఉన్నచోటే మెస్సి మోకాళ్లపై కూలబడి చేతులతో ముఖాన్ని దాచుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు.సహచర ఆటగాళ్లందరూ వేగంగా దూసుకొచ్చి అతనిపై పడిపోయారు.. అందరూ కలిసి అతణ్ని గాల్లోకి ఎగరేశారు. స్టేడియంలో మెస్సి.. మెస్సి అని అరుస్తున్న అభిమానులతో కలిసి అతనూ కేరింతలు కొట్టాడు. ట్రోఫీ అందుకునేటప్పుడూ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ భావోద్వేగం వెనక ఎన్నో ఏళ్ల కష్టం ఉంది.. ఆ ఆనంద భాష్పాల వెనక సుదీర్ఘ నిరీక్షణ దాగి ఉంది. ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగిన  ఈ 34 ఏళ్ల ఫుట్‌బాల్‌ స్టార్‌కు అర్జెంటీనా జట్టుతో ఇదే తొలి ప్రధాన టైటిల్‌.

బార్సిలోనా క్లబ్బు తరపున లీగ్‌ల్లో లెక్కకు మిక్కిలి టైటిళ్లు గెలిచినా.. గోల్స్‌ మోత మోగించినా.. మెస్సీపై ఎన్నో విమర్శలు. జాతీయ జట్టు తరపున ఒక్క ప్రధాన టైటిల్‌ కూడా గెలవకపోవడమే అందుకు కారణం. తాను ఆరేళ్ల వయసున్నపుడు చివరగా అర్జెంటీనా 1993లో కోపా అమెరికా టైటిల్‌ నెగ్గింది. ఆ తర్వాత ఇన్నేళ్లలో మరో ప్రధాన టోర్నీలో విజేతగా నిలవలేకపోయింది. జట్టు రాతను మారుస్తాడని ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటగాడిగా ఎదిగిన మెస్సీపై ఆ దేశ ప్రజలు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ 2007, 2015, 2016 కోపా అమెరికా టోర్నీల్లో జట్టును ఫైనల్‌ చేర్చిన అతను.. విజేతగా మాత్రం నిలపలేకపోయాడు. 2014 ప్రపంచకప్‌ ఫైనల్లోనూ నిరాశ తప్పలేదు. 2016 కోపా అమెరికా టోర్నీ ఫైనల్లో ఓటమి అనంతరం జాతీయ జట్టుకు రిటైర్మెంట్‌ ప్రకటించిన అతను.. ఆ తర్వాత నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు తొలి ప్రధాన  ట్రోఫీని ముద్దాడి మురిశాడు. ఎన్నో సార్లు ప్రతిష్ఠాత్మక టోర్నీ ఫైనల్లో, ఆరంభ దశలో జట్టు నిష్క్రమణతో ఏడ్చిన మెస్సి.. ఇప్పుడు ఆనందంతో కన్నీళ్లు రాల్చాడు. తొలి ప్రధాన టైటిల్‌ గెలిచే దిశగా ఈ టోర్నీలో మెస్సి గొప్ప ఆటతీరు ప్రదర్శించాడు. నాలుగు గోల్స్‌ చేయడంతో పాటు మరో అయిదు గోల్స్‌లో సహాయ పాత్ర పోషించాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన