రఫా, రోజర్‌.. ఇదిగో20
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 12/07/2021 02:27 IST

రఫా, రోజర్‌.. ఇదిగో20

జకోవిచ్‌ ఖాతాలో రికార్డు గ్రాండ్‌స్లామ్‌

వింబుల్డన్‌లో హ్యాట్రిక్‌

లండన్‌

సమకాలీన టెన్నిస్‌లో ఎవరు గొప్ప! ఫెదరరా.. నాదలా? వాళ్లలాగే ఎన్నో గొప్ప విజయాలు సాధించినా జకోవిచ్‌ పేరు ఇన్నాళ్లు ఆ స్థాయిలో చర్చకు రాలేదు. కానీ ఇకపై ఎవరు మేటి అంటే..అతణ్ని విస్మరించడం కష్టం. కాదు కాదు అసాధ్యం. 20వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో పురుషుల సింగిల్స్‌లో అత్యధిక మేజర్‌ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా ఆ దిగ్గజాల సరసన నిలవడమే కాదు.. వారినే మించిపోయే స్థితిలో నిలిచాడు జకో. సూపర్‌ ఫామ్‌తో ‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌’గా నిలిచే దిశగా దూసుకెళ్తున్నాడు. స్ఫూర్తిదాయక ఆట తీరును ప్రదర్శించిన అతడు.. ఫైనల్లో బెరెటినిని ఓడిస్తూ ఆరో వింబుల్డన్‌ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు.

ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) అదరగొట్టాడు. ఆరంభంలో వెనకబడ్డా బలంగా పుంజుకున్న అతడు.. వింబుల్డన్‌లో హ్యాట్రిక్‌ కొట్టాడు. ఆదివారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో జకోవిచ్‌ 6-7 (4-7), 6-4,  6-4, 6-3తో ఏడో సీడ్‌ బెరెటిని (ఇటలీ)పై విజయం సాధించాడు. 34 ఏళ్ల జకోవిచ్‌కు ఈ ఏడాది ఇది మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌.

తొలి సెట్‌ పోయినా..: ఆరంభంలో తడబడ్డ  బెరెటిని అనూహ్యంగా పుంజుకోవడంతో తొలి సెట్‌ అత్యంత రసవత్తరంగా సాగింది. ధాటిగా ఆటను ఆరంభించిన జకోవిచ్‌ చక్కని షాట్లతో ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. నాలుగో గేమ్‌లోనే బ్రేక్‌ సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. జకోవిచ్‌ తేలిగ్గానే సర్వీసు నిలబెట్టుకోగా... మంచి సర్వర్‌ అయినప్పటికీ బెరెటిని సర్వీసు కాపాడుకోవడానికి ఇబ్బందిపడ్డాడు. కచ్చితత్వంలేని డ్రాప్‌ షాట్లతో కూడా దెబ్బతిన్నాడు. కానీ 9వ గేమ్‌తో ఆట గమనం అనూహ్యంగా మారిపోయింది. సెట్‌ కోసం సర్వ్‌ చేస్తూ జకోవిచ్‌ తడబడ్డాడు. క్రాస్‌  కోర్ట్‌ ఫోర్‌ హ్యాండ్‌ షాట్‌తో తొలి పాయింటు సాధించిన బెరెటిని..పైచేయిని కొనసాగిస్తూ చివరికి ఓ ఫోర్‌ హ్యాండ్‌ షాట్‌తో బ్రేక్‌ సాధించాడు. ఆ తర్వాత ఆట టైబ్రేక్‌కు వెళ్లగా.. బెరెటిని ఆధిపత్యాన్ని  ప్రదర్శించి సెట్‌ను గెలిచాడు. కానీ తొలి సెట్‌ భంగపాటుతో జకోవిచ్‌ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. రెండో సెట్‌ బలంగా ఆరంభించాడు. మరింత కసిగా ఆడిన అతడు తొలి, మూడో గేముల్లో బ్రేక్‌లతో 4-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. జకోవిచ్‌ సర్వీసుల్లోనూ కచ్చితత్వం పెరిగింది. అదే సమయంలో బెరెటిని సర్వీసులో లయ తప్పాడు. కానీ అతడు అంత తేలిగ్గా వదల్లేదు. 5-2 ఆధిక్యంతో జకోవిచ్‌ సర్వ్‌కు దిగగా.. బ్రేక్‌ సాధించిన బెరెటిని ఆటను ఆసక్తికరంగా మార్చాడు. కానీ జకో మరో తప్పు చేయలేదు. పదో గేమ్‌లో సర్వీసు నిలబెట్టుకుని రెండో సెట్‌ను చేజిక్కించుకున్నాడు. అదే జోరుతో మూడో సెట్‌ మూడో గేమ్‌లోనే బ్రేక్‌ సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. చివరి వరకూ సర్వీసు నిలబెట్టుకున్న జకోవిచ్‌ మూడో సెట్‌ను చేజిక్కించుకున్నాడు. బెరెటిని పుంజుకోవడంతో నాలుగో సెట్‌ ఆసక్తికరంగా సాగింది. కానీ జకోవిచ్‌ క్రమంగా పుంజుకుని చెలిరేగి ఆడాడు. బలమైన ఫోర్‌ హ్యాండ్‌, బ్యాక్‌ హ్యాండ్‌ షాట్లతో ఏడో గేమ్‌లో బ్రేక్‌ సాధించి   ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. 30-40 వద్ద డబుల్‌ ఫాల్ట్‌ చేసి బెరెటిని దెబ్బతిన్నాడు. ఎనిమిదో గేమ్‌లో సర్వీసు నిలబెట్టుకున్న జకోవిచ్‌.. వెంటనే మరో బ్రేక్‌ సాధించి సెట్‌ను, ఛాంపియన్‌షిప్‌ షిప్‌ను చేజిక్కించుకున్నాడు.

3

జకోవిచ్‌కు ఇది వరుసగా మూడో వింబుల్డన్‌ టైటిల్‌. మొత్తం మీద కెరీర్‌లో అతడికిది ఆరో వింబుల్డన్‌.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన