కష్టాల కడలిని దాటి.. గెలిచాను
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 25/07/2021 04:44 IST

కష్టాల కడలిని దాటి.. గెలిచాను

మీరాబాయి చాను.. డీఎన్‌ఎఫ్‌!!

2016 రియో ఒలింపిక్స్‌. మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 49 కేజీల విభాగంలో పోటీ ముగిసింది. క్రీడాకారుల ప్రదర్శన వివరాలు బోర్డుపై ప్రత్యక్షమయ్యాయి. అందులో ఎవరెవరు ఎంత బరువు మోశారు.. ఏయే స్థానాల్లో ఉన్నారో కనిపిస్తోంది. మీరాబాయి చాను అనే పేరు ముందు మాత్రం బరువుల వివరాల్లేవు. పైన పేర్కొన్నట్లుగా ‘డీఎన్‌ఎఫ్‌’ అని మాత్రమే ఉంది. దీనికి అర్థం ‘డిడ్‌ నాట్‌ ఫినిష్‌’ అని. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో మూడు ప్రయత్నాల్లో ఒక్కసారి కూడా తాను నిర్దేశించుకున్న బరువును మోయలేకపోయింది చాను. ఏళ్లకు ఏళ్లు కష్టపడి, పతకం గెలుస్తుందన్న అంచనాలతో రియోలో అడుగు పెట్టి.. కనీసం పోటీలోనే లేకుండా పోవడమంటే అంతకంటే చేదు అనుభవం ఇంకేముంటుంది?

నాడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె అక్కడి నుంచి నిష్క్రమిస్తుంటే.. ఆ పోటీ చూస్తున్న కోట్లాదిమంది నుంచి నిట్టూర్పులు, తిట్లు!
అయిదేళ్ల తర్వాత ఇప్పుడు అదే ఒలింపిక్‌ వేదిక మీద ఆమె ముఖంలో నవ్వులు విరబూస్తుంటే.. కోట్లమంది నుంచి కేరింతలు, ప్రశంసలు!
‘‘ఓటమి విజయానికి సోపానం’’.. ఈ నానుడికి అసలైన అర్థం చెబుతూ.. రియో పరాభవం నుంచి టోక్యో పతకం వరకు సాగిన మీరా ప్రయాణం గొప్ప స్ఫూర్తి గాథ!

ఈనాడు క్రీడావిభాగం

ఫీనిక్స్‌ పక్షి శిథిలాల నుంచి లేచి పునరుజ్జీవం పొందుతుందట! లిఫ్టర్‌గా 2016 ఒలింపిక్స్‌లో శిథిల స్థితినే ఎదుర్కొన్న మీరా.. అక్కడి నుంచి పుంజుకున్న తీరు అసాధారణం. చక్కటి ఫామ్‌తో రియోలో అడుగు పెట్టిన ఆమె.. ఒలింపిక్స్‌ ఒత్తిడికి చిత్తయిపోయింది. దీంతో స్టేడియంలో మొదలైన ఆమె కన్నీళ్లు తన గదికి చేరుకున్నాక కూడా ఆగలేదు. అయితే ఆ బాధలో ఆమె కుంగిపోలేదు. తన వైఫల్యాలు గుర్తించి వాటిని దిద్దుకోవడంపై శ్రద్ధ పెట్టింది. శారీరకంగా కష్టపడితే సరిపోదని, మానసికంగా కూడా దృఢంగా మారాలని అర్థం చేసుకుంది. మొబైల్‌తో సహా తన ఏకాగ్రతకు భంగం కలిగించే అన్నింటినీ పక్కన పెట్టేసింది. కసరత్తులు పెంచింది. బలమైన పౌష్ఠికాహారంతో దృఢంగా తయారైంది. ఆటలోనూ టెక్నిక్స్‌ మెరుగుపరుచుకుంది. పెద్ద ఈవెంట్లలో ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు తగ్గ మానసిక శిక్షణ పొందింది. ఏడాది తిరిగేసరికి తన విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌ కావడమే కాదు.. రియోలో ఏ క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో అయితే ఒక్కసారి కూడా బరువు మోయలేకపోయిందో, అదే విభాగంలో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి  సంచలనం సృష్టించింది మీరా.


40 లక్షలు.. 50 రోజులు

మీరాబాయి టోక్యోకు బయల్దేరింది భారత్‌ నుంచి కాదు. గత రెండు నెలలుగా ఆమె అసలు మన దేశంలోనే లేదు. 50 రోజుల పాటు అమెరికాలో గడిపింది చాను. ఆమె పతకం గెలవడంలో ఈ పర్యటన ఓ ముఖ్య కారణం. ‘టాప్‌’లో భాగమైన మీరాకు ప్రభుత్వం ఒలింపిక్స్‌ ముంగిట అమెరికాలో శిక్షణ పొందేందుకు రూ.40 లక్షల నిధులు విడుదల చేసింది. సరైన సమయంలో అందిన ఆర్థిక సాయంతో తన కోచ్‌, సహాయ బృందాన్ని తీసుకుని అమెరికాకు వెళ్లింది మీరా. స్త్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌గా మారిన అమెరికా మాజీ లిఫ్టర్‌ ఆరోన్‌ హార్షింగ్‌ దగ్గర శిక్షణ పొందింది. గత ఏడాది మీరా గాయం నుంచి కోలుకోవడంలో, ప్రదర్శన మెరుగుపరుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన హార్షింగ్‌.. ఒలింపిక్స్‌ ముంగిట ఆమెను బాగా సన్నద్ధం చేశాడు. భుజం ఇబ్బందిని తప్పించుకోవడంతో పాటు తనకు పట్టు లేని స్నాచ్‌లో కొత్త టెక్నిక్‌లు నేర్చుకుని వాటిని టోక్యోలో అమల్లో పెట్టి రజతం పట్టేసింది మీరా.


కట్టెల మోతతో మొదలై..

లింపిక్స్‌ లాంటి అత్యున్నత వేదిక మీద విజయం అంత ఆషామాషీ కాదు. డబ్బు, సౌకర్యాలు, పలుకుబడి, ప్రోత్సాహం.. అన్నీ ఉన్నా కూడా అక్కడ పతకం సాధించడం తేలిక కాదు. అయితే మీరా ఇవేవీ లేకుండానే ఇక్కడిదాకా వచ్చింది. తన పేరు, రూపం చూస్తేనే.. దేశంలో బాగా వెనుకబడ్డ ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చిన అమ్మాయనే విషయం అర్థమైపోతుంది. మణిపుర్‌లోని ఓ పల్లెటూరిలో ఓ పేద కుటుంబంలో పుట్టింది మీరా. వెయిట్‌లిఫ్టింగ్‌లోకి ఆమె ప్రయాణం కట్టెలు మోయడంతో మొదలుకావడం విశేషం. వంట చెరుకు కోసం రోజూ ఆమె తల్లితో కలిసి అడవికి వెళ్లేది. రోజూ కట్టెలు మోయడం ద్వారా చిన్నతనంలోనే తనకు ‘మోత’ అలవాటైపోయింది. అయితే ఆమెకు ఈ క్రీడపై ఆసక్తి కలిగేలా చేసింది మాత్రం కుంజురాణి దేవినే. తన రాష్ట్రానికే చెందిన ఈ లిఫ్టర్‌ జాతీయ రికార్డు నెలకొల్పడమే కాక.. ఏథెన్స్‌   ఒలింపిక్స్‌లో పోటీ పడటం చూసి పదేళ్ల వయసులో ఈ ఆటపై మక్కువ పెంచుకుంది మీరా. అయితే ఎక్కడ శిక్షణ తీసుకోవాలి, ఎవరు మెలకువలు నేర్పిస్తారో తెలియదు. తన గ్రామానికి 60 కిలోమీటర్ల దూరంలో కోచ్‌ అనితా చాను లిఫ్టింగ్‌లో శిక్షణ ఇస్తోందని తెలుసుకుని ఆమెను కలిసింది. రోజూ అంత దూరం వెళ్లి తన దగ్గర శిక్షణ పొందేది. సరైన వెయిట్‌లిఫ్టింగ్‌ పరికరాలు కూడా లేని స్థితిలో వెదురు బొంగులకు ఇటు, అటు బరువులు కట్టి వాటితోనే సాధన చేయించేది అనిత. తక్కువ సమయంలో ప్రతిభ చాటుకుని, స్పాన్సర్ల దృష్టిని ఆకర్షించిన మీరా.. వారి ప్రోత్సాహంతో ఆధునిక  శిక్షణకు తోడు మంచి పౌష్ఠికాహారం కూడా అందుకుంది. ఆపై అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ లిఫ్టర్‌ అయింది. తాను వెయిట్‌లిఫ్టింగ్‌లోకి రావడానికి స్ఫూర్తినిచ్చిన కుంజురాణి పేరిట ఉన్న జాతీయ రికార్డును తనే 2016లో బద్దలు కొట్టడం విశేషం. తర్వాతి ఏడాదే ఆమె ప్రపంచ రికార్డునూ నెలకొల్పి సంచలనం సృష్టించింది.


కలిసొచ్చిన కరోనా

రోనాను అందరూ తిట్టుకునేవాళ్లే కానీ.. మీరాకు మాత్రం మహమ్మారి కలిసొచ్చింది. గత ఏడాది ఒలింపిక్స్‌ షెడ్యూల్‌ ప్రకారం జరిగి ఉంటే ఆమె పతకం గెలిచేది కాదేమో! అప్పటికి ఆమె ఫిట్‌నెస్‌ అత్యుత్తమ స్థాయిలో లేదు. 2019 ఆమె వెన్ను, భుజం గాయాలతో ఇబ్బంది పడింది. ఆ ప్రభావం తర్వాతి ఏడాదీ కొనసాగింది. కొన్ని నెలల పాటు బరువులెత్తలేదు. కరోనా కారణంగా ఒలింపిక్స్‌తో పాటు పోటీలన్నీ రద్దవడంతో నెమ్మదిగా గాయాల నుంచి కోలుకుంది. కరోనా వల్ల మీరాకు జరిగిన మరో మేలు.. ఉత్తర కొరియా ఒలింపిక్స్‌ నుంచి తప్పుకోవడం. గట్టి పోటీదారైన ఆ దేశ లిఫ్టర్‌ దూరం కావడంతో చానుకు పతక రేసులో ఓ అడ్డంకి తొలగిపోయింది.


అమ్మ ఇచ్చిన కమ్మలతో

వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం అందుకున్న మీరాబాయిని చూసి దేశం సంతోషంలో మునిగిపోయింది. కానీ అదే సమయంలో ఆమె ధరించిన చెవి కమ్మలు చూసి మీరా తల్లి లీమా కళ్లలో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. అయిదేళ్ల క్రితం తన దగ్గరున్న బంగారంతో పాటు దాచుకున్న డబ్బును ఖర్చుచేసి ఒలింపిక్స్‌ రింగులను పోలినట్లుగా మీరా కోసం ఆ కమ్మలు చేయించి ఇచ్చింది. అవి ఆమెకు అదృష్టాన్ని తెస్తాయని లీమా నమ్మకం. కానీ 2016 రియో ఒలింపిక్స్‌లో విఫలమైన మీరా.. ఈ సారి అదే కమ్మలతో బరిలో దిగి రజతాన్ని సొంతం చేసుకుంది. దీంతో లీమా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ‘‘మీరా ధరించిన చెవి దుద్దులు టీవీలో చూశా. 2016లో రియో ఒలింపిక్స్‌కు ముందు మీరాకు వాటిని ఇచ్చా. నా దగ్గరున్న బంగారు ముక్కలు, నేను దాచుకున్న డబ్బుతో వాటిని చేయించా. అవి మీరాకు అదృష్టాన్ని, విజయాన్ని అందిస్తాయని నమ్మా. ఇప్పుడు వాటిని చూడగానే కన్నీళ్లు ఆగలేదు. మీరా పతకం గెలవగానే నాతో పాటు ఆమె నాన్న ఆనంద భాష్పాల్లో మునిగిపోయాం. ఈ క్రీడల్లో స్వర్ణం లేదా ఏదో పతకం గెలుస్తానని తను మాకు ముందే చెప్పింది. అని నిజం కావాలని ఎదురుచూశాం. మాకు దగ్గర్లో ఉండే చుట్టాలు రాత్రే మా ఇంటికి వచ్చారు. ఉదయం చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. దీంతో టీవీని ఇంటి బయట వరండాలో పెట్టి మీరా ప్రదర్శన చూశాం. పతకం గెలవగానే అందరూ సంబరాల్లో మునిగిపోయారు’’ అని లీమా తెలిపింది. పోటీలకు ముందు టోక్యోలోని వెయిట్‌లిఫ్టింగ్‌ వేదిక నుంచి వీడియో కాల్‌ చేసిన మీరా.. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంది.


* 2021 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 119 కేజీలు మోసి, ఈ విభాగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. స్నాచ్‌లో 86 కేజీలతో కలిపి మొత్తంగా 205 కేజీల మోతతో తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది.

మీరా రజత ప్రదర్శన..
స్నాచ్‌లో 87 కిలోలు+
క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 115 కిలోలు


మీరా గురించి..

పూర్తి పేరు: సైఖోమ్‌ మీరాబాయి చాను
జననం: 1994 ఆగస్టు 8
స్వస్థలం: మణిపుర్‌లోని నాంగ్‌పోక్‌ కచింగ్‌ గ్రామం
క్రీడ: వెయిట్‌లిఫ్టింగ్‌
ప్రస్తుత విభాగం: 49 కేజీలు
ఘనతలు: 2014 కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం (48 కేజీలు), 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం (48 కేజీలు), 2018 కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం (48 కేజీలు), 2020 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం (49 కేజీలు)


వెయిట్‌లిఫ్టింగ్‌ 49 కేజీల విభాగంలో రజతం గెలిచి టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు అమోఘమైన ఆరంభాన్నిచ్చిన మీరాబాయికి హృదయపూర్వక అభినందనలు. ఆమె సాధించిన దాని పట్ల దేశం గర్వపడుతోంది. ఆమె భవిష్యత్‌ మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నా.

- ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు


తకాంశాల తొలి రోజే భారత్‌ మొదటి పతకం సాధించింది. మహిళల 49 కేజీల విభాగంలో   మీరాబాయి వెండి పతకం నెగ్గింది. మీరా..    నిన్ను చూసి దేశం గర్విస్తోంది.

- కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌


మీరాబాయి చాను.. వెయిట్‌లిఫ్టింగ్‌లో సత్తాచాటింది. గాయం నుంచి కోలుకుని నిన్ను నువ్వు మార్చుకున్న తీరుతో పాటు భారత్‌కు చారిత్రక రజతం గెలవడం కచ్చితంగా అద్భుతమే.

- సచిన్‌ తెందుల్కర్‌


ప్రియమైన మీరాకు..

‘‘ప్రియమైన మీరాబాయి.. భారత్‌కు ఒలింపిక్స్‌ రజతాన్ని అందించినందుకు అభినందనలు. టోక్యోలో నీ విజయం.. ఒలింపిక్స్‌ల్లో భారత అథ్లెట్లు చేసిన అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచిపోతుంది. భవిష్యత్‌ తరాలకూ స్ఫూర్తి కలిగిస్తుంది. వందేళ్లకు ముందు నుంచే ఒలింపిక్స్‌లో భారత్‌ పోటీపడుతుంటే కొద్ది మంది అథ్లెట్లే పోడియంపై నిలబడే ప్రత్యేక అనుభూతి పొందారు. ఏళ్ల కష్టం, ఏకాగత్ర చెదరని అంకితభావంతోనే ఇది సాధ్యం. ఈ కరోనా కఠిన సమయంలో ఆశ, పట్టుదలను తిరిగి పొందవచ్చనే ఆనందాన్ని నీ విజయం గుర్తుచేసింది’’

- ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన లేఖలో అభినవ్‌ బింద్రా



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన