స్వర్ణం @ 13..కాంస్యం @ 58
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 27/07/2021 04:03 IST

స్వర్ణం @ 13..కాంస్యం @ 58

ఆటకు ప్రతిభే ప్రధానం.. వయసు కాదు! ఇదే ఒలింపిక్స్‌ స్ఫూర్తి మంత్రం! విశ్వ క్రీడల్లో పాల్గొనడానికి వయసు అడ్డంకే కాదు.  పదేళ్లయినా.. డెబ్బై ఏళ్లొచ్చినా ఒలింపిక్స్‌ వేదికపై పోటీ పడే సత్తా ఉంటే చాలు. అర్హత ప్రమాణాలను అందుకుంటే ఏ వయసు వాళ్లకైనా విశ్వక్రీడలు స్వాగతం పలుకుతాయి. అలా అవకాశం దక్కించుకున్న 13 ఏళ్ల అమ్మాయిలిద్దరు సోమవారం టోక్యోలో స్వర్ణం, రజతం సాధించి ఔరా అనిపించారు. ఇదే రోజు 58 ఏళ్ల ఓ క్రీడాకారుడు కాంస్యం అందుకుని ఒలింపిక్స్‌ వైవిధ్యాన్ని చాటిచెప్పాడు.

* 13 ఏళ్ల వయసులో ఏ పిల్లలైనా ఏం చేస్తుంటారు. పుస్తకాలతో కుస్తీ పడుతూ సరదాకి ఆటలాడుతుంటారు. కానీ ఆ వయసులో ఇద్దరమ్మాయిలు ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచి ఔరా అనిపించారు. ఆ ఇద్దరి పేర్లు..  మొమిజి నిషియా, రేసా లీల్‌. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న జపాన్‌కు చెందిన నిషియా మహిళల స్కేట్‌బోర్డింగ్‌ ఈవెంట్లో స్వర్ణం గెలవగా, బ్రెజిల్‌ అమ్మాయి రేసా రజతం సాధించింది. జపాన్‌కే చెందిన ఫ్యూనా నకయమా ఈ పోటీలో కాంస్యం సాధించింది. ఆమె వయసు కూడా ఎక్కువేమీ కాదు.. 16 ఏళ్లే. స్కేట్‌ బోర్డుతో అద్భుత విన్యాసాలు చేస్తూ.. మొత్తంగా మూడు పతకాలనూ ఈ చిన్నమ్మాయిలే గెలిచేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పోడియం మీద అంత చిన్న అమ్మాయిలు ఒలింపిక్‌ పతకాలు మెడలో  వేసుకుని నవ్వులు చిందిస్తుంటే ఆ దృశ్యం చూడముచ్చటగా అనిపించింది.


* 58 ఏళ్లు.. అంటే ఏ ఉద్యోగం చేస్తున్నా రిటైరయ్యే వయసు! ఆటల్లో అయితే అంతకు 20 ఏళ్ల ముందే టాటా చెప్పేస్తుంటారు. అలాంటిది 58 ఏళ్ల వయసులో ఓ ఆటలో కొనసాగడమే ఆశ్చర్యమంటే.. ఒలింపిక్స్‌ లాంటి అత్యున్నత క్రీడా వేదికలో పోటీ పడి పతకం గెలవడమంటే చిన్న విషయం కాదు. కువైట్‌ షూటర్‌ అబ్దుల్లా అల్‌ రషీది అదే చేశాడు. రికార్డు స్థాయిలో ఏడోసారి ఒలింపిక్స్‌లో పోటీ పడ్డ అబ్దుల్లా.. సోమవారం పురుషుల స్కీట్‌ విభాగంలో కాంస్యం గెలిచి ఔరా అనిపించాడు. రియోలో జరిగిన గత ఒలింపిక్స్‌లోనూ రషీది కాంస్యం గెలిచాడు. అయితే అతను ఇంతటితో తన ఒలింపిక్‌ ప్రయాణాన్నే ఆపేయబోడట. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ పోటీ పడి స్వర్ణం గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ‘‘నా వయసు 58 ఏళ్లు. అతి పెద్ద వయసులో ఒలింపిక్స్‌ కాంస్యం గెలిచిన షూటర్‌ను నేను. నాకిది స్వర్ణం కంటే ఎక్కువు. అయితే 61 ఏళ్లలో వచ్చే ఒలింపిక్స్‌లో పోటీ పడి నిజంగానే స్వర్ణం గెలవాలనుకుంటున్నా’’ అని రషీది అన్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన