బైల్స్‌కు ఏమైంది?
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 28/07/2021 06:11 IST

బైల్స్‌కు ఏమైంది?

అనారోగ్య సమస్యతో పోటీల మధ్యలోనే నిష్క్రమణ

టీమ్‌ విభాగంలో అమెరికాకు షాకిచ్చిన ఆర్‌వోసీ

ఈ ఒలింపిక్స్‌లో ఆరు స్వర్ణాలు గెలిచి చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో టోక్యోలో అడుగుపెట్టింది జిమ్నాస్టిక్స్‌ తార సిమోన్‌ బైల్స్‌. ఆమె అద్భుత విన్యాసాలను చూసేందుకు అభిమానులు సిద్ధమైపోయారు. కానీ టీమ్‌ ఈవెంట్లో అమెరికాను పసిడి ఊరిస్తున్న సమయంలో మానసిక అనారోగ్యం కారణంగా చెప్పి బైల్స్‌ అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడం సంచలనం రేపింది. దీంతో అమెరికాకు షాకిచ్చి రష్యా ఒలింపిక్‌ కమిటీ స్వర్ణాన్ని ఎగరేసుకుపోగా.. వ్యక్తిగత ఈవెంట్లలో బైల్స్‌ పాల్గొనడంపైనా సందిగ్ధత నెలకొనడం చర్చనీయాంశమైంది.

టోక్యో

ఈసారి ఒలింపిక్స్‌కే ఆకర్షణగా మారిన   అథ్లెట్లలో అమెరికా జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ ఒకరు. టీమ్‌ ఈవెంట్‌తో కలిపి ఆరు స్వర్ణాలపై ఆమె కన్నేసింది. ముందుగా టీమ్‌ ఈవెంట్లో ఆమె సత్తా చాటడం, అమెరికా జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధించడంతో ఆ పోటీపై అందరి దృష్టీ పడింది. ఇలాంటి సమయంలో మానసిక అనారోగ్యం కారణంగా బైల్స్‌ అనూహ్యంగా ఫైనల్‌ నుంచి తప్పుకుంది. తన వల్ల జట్టు దెబ్బ తినకూడదన్న ఉద్దేశంతోనే ఫైనల్స్‌కు దూరంగా ఉన్నట్లు బైల్స్‌ చెప్పింది కానీ.. ఆమె లేకపోవడమే ఆ జట్టును దెబ్బ కొట్టింది. అమెరికాను ఓడించి టీమ్‌ స్వర్ణాన్ని రష్యా ఒలింపిక్‌ కమిటీ (ఆర్‌ఓసీ) సొంతం చేసుకుంది. మంగళవారం ఫైనల్లో మొత్తం 169.528 స్కోరుతో ఆర్‌ఓసీ అగ్రస్థానంలో నిలిచింది. 166.096 స్కోరు సాధించిన అమెరికా రజతంతో సంతృప్తి చెందింది. వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ ఈ విభాగంలో ఛాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని ఆ దేశం కోల్పోయింది.2010 తర్వాత జిమ్నాస్టిక్స్‌లో ప్రపంచ లేదా ఒలింపిక్‌ టీమ్‌ టైటిల్‌ను అమెరికా దక్కించుకోకపోవడం ఇదే తొలిసారి. ఇబ్బంది పడుతూనే వాల్ట్‌ పోటీల్లో పాల్గొన్న బైల్స్‌ పూర్తిస్థాయి ప్రదర్శన చేయలేదు. రెండున్నర ట్విస్టులు చేయాల్సిన ఆమె ఒకటిన్నరకే పరిమితమై 13.733 స్కోరే నమోదు చేసింది.

మరి వ్యక్తిగత విభాగాల్లో..?: 24 ఏళ్ల బైల్స్‌ అయిదేళ్ల కిందటి రియో ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు ఖాతాలో వేసుకుంది. ఈసారి ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పుడు మానసిక సమస్యలతో అనూహ్యంగా టీమ్‌ విభాగం నుంచి అర్ధంతరంగా తప్పుకున్న ఆమె.. వ్యక్తిగత ఈవెంట్లలో పోటీ పడటంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే దీనిపై బైల్స్‌ను అడిగితే.. తాను బరిలోకి దిగనని చెప్పలేదు. అలాగని అన్ని ఈవెంట్లలో పోటీ పడటంపై ధీమాగానూ మాట్లాడలేదు. ‘‘వ్యక్తిగత ఈవెంట్లలో పోటీ పడతా. కానీ ఏ రోజుకు ఆ రోజు చూసుకుని బరిలోకి దిగుతా’’ అని బైల్స్‌ అంది. తనకు గాయం కాలేదని, మానసిక సమస్యతోనే టీమ్‌ ఈవెంట్‌ నుంచి తప్పుకున్నానని ఆమె స్పష్టం చేసింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన