బైల్స్‌ మళ్లీ..
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 29/07/2021 03:02 IST

బైల్స్‌ మళ్లీ..

 వ్యక్తిగత ఆల్‌రౌండ్‌ ఈవెంట్‌కూ దూరం

మిగతా ఈవెంట్లలో పోటీ అనుమానమే

ఉసేన్‌ బోల్ట్‌, మైకేల్‌ ఫెల్ప్స్‌ లాంటి సూపర్‌ స్టార్లు దూరమయ్యాక ఈ ఒలింపిక్స్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన అథ్లెట్‌ సిమోన్‌ బైల్స్‌. ఆమె ఆట కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆసక్తిగా ఎదురు చూశారు. క్వాలిఫయింగ్‌ రౌండ్లలో ప్రదర్శనకే ఔరా అనుకున్నారు. ఇక తుది పోరాటాల్లో బైల్స్‌ ఇంకెంత గొప్పగా విన్యాసాలు చేస్తుందో అని ఉత్కంఠకు గురవుతుంటే.. ఆమె ఒక్కో పోటీ నుంచి తప్పుకుంటూ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. ఇప్పటికే టీమ్‌ ఈవెంట్‌ మధ్యలో తప్పుకున్న ఈ అమెరికన్‌.. తాజాగా వ్యక్తిగత ఆల్‌రౌండ్‌ పోటీకి దూరమైంది.

టోక్యో

ఒలింపిక్స్‌లో సిమోన్‌ బైల్స్‌ జిమ్నాస్టిక్స్‌ విన్యాసాలను ఇక చూడలేమేమో! మానసిక అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆమె.. వరుసగా ఒక్కో ఈవెంట్‌ నుంచి తప్పుకుంటోంది. టీమ్‌ ఈవెంట్‌తో కలిపి ఆరు ఈవెంట్లలో ఫైనల్స్‌కు అర్హత సాధించి.. ఆరు స్వర్ణాలపై గురిపెట్టిన ఆమెకు మానసిక సమస్యలు అడ్డుకట్ట వేస్తున్నాయి. మంగళవారం టీమ్‌ఈవెంట్‌ క్వాలిఫయింగ్‌ రౌండ్లో పోటీ పడి అనుకున్నంత మేర రాణించలేకపోయిన బైల్స్‌.. ఫైనల్స్‌ నుంచి తప్పుకోవడం తెలిసిందే. వ్యక్తిగత ఈవెంట్ల సంగతేంటి అని అడిగితే.. ఏ రోజుకారోజు పరిస్థితిని బట్టి బరిలోకి దిగుతానంది. గురువారం ఆమె ఆల్‌రౌండ్‌ ఈవెంట్లో పోటీ పడాల్సి ఉంది. గత ఒలింపిక్స్‌లో ఆమె స్వర్ణం గెలిచిన విభాగమిది. ఈసారి క్వాలిఫయింగ్‌ రౌండ్లో ఆమె అగ్రస్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే తుది పోరు కంటే ఒక రోజు ముందే తాను పోటీ పడబోనని బైల్స్‌ తేల్చేసింది. ఆమె స్థానంలో ఈ పోటీలో జేడ్‌ కేరీని అమెరికా బరిలోకి దించనుంది. బైల్స్‌ పోటీ పడాల్సిన మిగతా నాలుగు వ్యక్తిగత ఈవెంట్లు వచ్చే వారంలో జరగనున్నాయి. అప్పటి వరకు బైల్స్‌ పరిస్థితిని జాగ్రత్తగా సమీక్షిస్తామని యుఎస్‌ జిమ్నాస్టిక్స్‌ సంఘం  తెలిపింది.


ఏమిటీ ట్విస్టీస్‌?

ఒలింపిక్స్‌ కోసమని ఏళ్లకు ఏళ్లు ఎంతో కష్టపడి.. ఎన్నో త్యాగాలు చేసి.. తాను పోటీ పడే ఈవెంట్లలో ఫేవరెట్‌గా మారిన ఓ అథ్లెట్‌..   చివరికి అసలు పోటీలకు వచ్చేసరికి అనారోగ్య సమస్యతో వైదొలగాల్సి రావడం కంటే బాధ  ఇంకేముంటుంది? ఇప్పుడు బైల్స్‌ పరిస్థితి ఇదే. తనకేమీ గాయం కాలేదు. మానసిక అనారోగ్యంతోనే తప్పుకుందట. జిమ్మాస్ట్‌లకు  ఉండే ఈ మానసిక సమస్యనే ‘ట్విస్టీస్‌’గా పేర్కొంటున్నారు. మరి ఏమిటీ ట్విస్టీస్‌?

జిమ్నాస్ట్‌లు తాము పోటీ పడే రింగ్‌ల్లో, వాల్ట్‌ మీద గాల్లోకి ఎగిరి ఎలాంటి విన్యాసాలు చేస్తారో తెలిసిందే. మెరుపు ఒంటిని విల్లులా తిప్పుతూ.. రింగులు తిరుగుతూ.. పల్టీలు కొడుతూ.. అంతా అయ్యాక నిటారుగా నిలబడి బ్యాలెన్స్‌ చేసుకునే వైనం కళ్లు చెదిరేలా చేస్తాయి. అయితే గాల్లో అలా విన్యాసాలు చేస్తున్నపుడు ఉన్నట్లుండి క్షణ కాలం అంతా శూన్యంగా అనిపిస్తే.. మెదడుకు, శరీరానికి సంబంధం తెగిపోతే.. ఏం చేయాలో తెలియని స్థితిని ఎదుర్కొంటే.. దీన్నే ‘ట్విస్టీస్‌’ అంటారు. జిమ్నాస్ట్‌లు విన్యాసాలు చేస్తున్నపుడు ఏమాత్రం అదుపు తప్పినా.. పోటీలో గెలవడం సంగతలా ఉంచితే, ప్రమాదకర గాయాలవుతాయి. ఒలింపిక్స్‌ లాంటి పెద్ద ఈవెంట్లలో ఇలా అదుపు తప్పి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు. శరీరం, మెదడుపై పూర్తి నియంత్రణ లేకుంటే ఏమైనా జరగొచ్చు. అందుకే ఇప్పుడు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న బైల్స్‌.. పోటీకి విముఖత చూపింది. టీమ్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్లో రెండున్నర ట్విస్టులు చేయాల్సిన బైల్స్‌.. ఒకటిన్నరకే పరిమితమైంది. బైల్స్‌ మానసిక స్థితి సరిగా లేకపోవడమే అందుక్కారణమని, అందుకే ఆమె ఫైనల్స్‌ నుంచి తప్పుకుందని అంటున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన