ప్రిక్వార్టర్స్‌లో సింధు
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 29/07/2021 03:02 IST

ప్రిక్వార్టర్స్‌లో సింధు

చూంగ్‌పై సునాయాస విజయం

సాయి ప్రణీత్‌ నిష్క్రమణ

రెండో గేమ్‌లో లయ దొరకబుచ్చుకుని మ్యాచ్‌ను ముగించా. గేమ్‌ వేగంగా సాగడంతో కొన్ని అనవసర తప్పిదాలు చేశా. వెంటనే వ్యూహం మార్చి పరిస్థితుల్ని నియంత్రణలోకి తెచ్చుకున్నా. పెద్ద మ్యాచ్‌కు ముందు ఇలాంటి పరీక్ష మంచిదే. ప్రిక్వార్టర్స్‌ పోరులో గట్టి పోటీ ఖాయం. ప్రతి పాయింటు కీలకం. బ్లిక్‌ఫెల్ట్‌తో గతంలో తలపడ్డా. ఆమె దూకుడు క్రీడాకారిణి. నేనూ దూకుడుగానే ఆడాలి.

- సింధు


నాకౌట్‌ పోరు నేడే

సింధు × బ్లిక్‌ఫెల్ట్‌

ఉదయం 6.15 నుంచి

టోక్యో

ఒలింపిక్స్‌ స్వర్ణ పతకంపై గురిపెట్టిన భారత స్టార్‌ షట్లర్‌, ప్రపంచ ఛాంపియన్‌ పి.వి.సింధు లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. ఊహించినట్లే మహిళల సింగిల్స్‌ గ్రూప్‌-జెలో ఆమెకు ఎదురులేకుండా పోయింది. వరుసగా రెండు విజయాలతో గ్రూప్‌లో అగ్రస్థానం సాధించిన ఆమె ప్రిక్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం   జరిగిన రెండో గ్రూప్‌ మ్యాచ్‌లో ఆరో సీడ్‌ సింధు 21-9 21-16తో ప్రపంచ 34వ ర్యాంకర్‌ నాన్‌ చూంగ్‌ (హాంకాంగ్‌)ను చిత్తుచేసింది. తన కెరీర్‌లో చూంగ్‌పై ఆరోసారి పైచేయి సాధించింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో 12వ ర్యాంకర్‌ మియా బ్లిక్‌ఫెల్ట్‌ (డెన్మార్క్‌)తో సింధు తలపడనుంది. ఇప్పటి వరకు వీరిద్దరు అయిదు సార్లు పోటీపడగా.. నాల్గింట్లో సింధు నెగ్గగా, ఒక మ్యాచ్‌లో బ్లిక్‌ఫెల్ట్‌ గెలిచింది. ఈ ఏడాది ఆరంభంలో థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో సింధుపై బ్లిక్‌ఫెల్ట్‌ పైచేయి సాధించింది. 35 నిమిషాల్లో ముగిసిన పోరులో సింధు తన అస్త్రాలన్నీ బయటకు తీసింది. చురుకైన వేగం.. పదునైన స్ట్రోక్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ర్యాలీ గేమ్‌తో ఆట మొదలుపెట్టి బాడీ స్మాష్‌తో మ్యాచ్‌ను ముగించింది. మధ్యలో స్మాష్‌లు, క్రాస్‌ కోర్ట్‌ షాట్‌లతో అదరగొట్టింది. తొలి గేమ్‌లో సింధుకు పోటీనే ఎదురవలేదు. 11-5తో ఆధిక్యం సంపాదించిన సింధు చూస్తుండగానే 20-9తో మరింత ముందంజ వేసింది. సింధు సర్వ్‌ను చూంగ్‌ నెట్‌కు ఆడటంతో 21-9తో తొలి గేమ్‌ భారత స్టార్‌ సొంతమైంది. రెండో గేమ్‌లో షటిల్‌పై నియంత్రణ కోల్పోయిన సింధు అనవసర తప్పిదాలు చేయడం ప్రత్యర్థికి లాభించింది. ర్యాలీ గేమ్‌తో సింధుకు చూంగ్‌ పోటీనిచ్చింది. దీంతో 6-6, 8-8తో పాయింట్లు సమమయ్యాయి. ఒకదశలో చూంగ్‌కు ఒక పాయింటు ఆధిక్యం కూడా లభించింది. అయితే వెంటనే తేరుకున్న సింధు స్మాష్‌లు, స్ట్రోక్‌లతో ప్రత్యర్థి జోరుకు అడ్డుకట్ట వేసింది. 19-14తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన సింధు రెండు అనవసర తప్పిదాలతో విజయాన్ని ఆలస్యం చేసుకుంది. ఆ వెంటనే జోరందుకున్న ఆమె ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్‌ పోరాటం ముగిసింది. గ్రూప్‌ దశలో వరుసగా రెండు ఓటములతో సాయి ప్రణీత్‌ ఒలింపిక్స్‌ నుంచి నిష్క్రమించాడు. బుధవారం గ్రూప్‌-డి పోరులో సాయి ప్రణీత్‌ 14-21, 14-21తో మార్క్‌ కాల్జౌ (నెదర్లాండ్స్‌) చేతిలో పరాజయం చవిచూశాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన