అయ్యో మేరీ
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 30/07/2021 05:47 IST

అయ్యో మేరీ

ప్రిక్వార్టర్స్‌లో రాణించినా తప్పని ఓటమి
టోక్యో

దురదృష్టం అంటే మేరీకోమ్‌దే.. ప్రత్యర్థిపై మంచి రికార్డు ఉండి.. ప్రిక్వార్టర్స్‌లో మూడు రౌండ్ల బౌట్లో రెండింట్లో  గెలిచి.. సర్వశక్తులూ ఒడ్డినా ఆమెకు చివరికి దక్కింది ఓటమే! ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌, లండన్‌ ఒలింపిక్‌ కాంస్య పతక విజేత మేరీ అనూహ్య రీతిలో టోక్యో ఒలింపిక్స్‌ నుంచి నిష్క్రమించింది. కెరీర్‌లో చివరి ఒలింపిక్స్‌ ఆడుతున్న 38 ఏళ్ల మేరీ హోరాహోరీగా సాగిన 51 కిలోల ప్రిక్వార్టర్స్‌లో 2-3తో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత ఇంగ్రిట్‌  వాలెన్సియా (కొలంబియా) చేతిలో ఓడింది. బౌట్‌ ఆసాంతం చురుగ్గా కదులుతూ ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించినా చివరికి ఆమెకు పరాజయమే మిగిలింది.

మూడింట్లో రెండు గెలిచినా..: ఈ బౌట్‌ అయ్యాక నవ్వుతూ హుషారుగా కనిపించిన మేరీని చూస్తే ఆమె గెలిచిందనే అనుకున్నారంతా. తనూ అదే అనుకుంది. కానీ జడ్జిల నిర్ణయం మాత్రం ప్రతికూలంగా వచ్చింది. పోరులో మూడు రౌండ్లలో రెండింట్లో గెలిచినా కూడా మేరీకి ఓటమి తప్పలేదు. తొలి రౌండ్‌ను ఆమె 1-4తో కోల్పోయింది. నలుగురు నిర్ణేతలు వాలెన్సియాకు అనుకూలంగా పాయింట్లు ఇవ్వగా.. ఒక్కరు మేరీ తరఫున నిలిచారు. కానీ మేరీ పట్టువదల్లేదు. రెండో రౌండ్లో తన కుడి చేతి పంచ్‌లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. ఈ రౌండ్‌ను ఆమె 3-2తో గెలుచుకుంది. నిర్ణయాత్మక మూడో రౌండ్లో పైచేయి సాధించాలంటే మేరీ 4-1తో గెలవాల్సి ఉండగా.. మేరీ  3-2తో బౌట్‌ ముగించింది. దీంతో ఓవరాల్‌గా ఎక్కువ స్కోరు సాధించిన వాలెన్సియా విజయాన్ని అందుకుంది. మేరీని పరాజితురాలిగా ప్రకటించడాన్ని ఆమె శిక్షకుడు చోటేలాల్‌ తప్పుబట్టాడు. ‘‘తొలి రౌండ్లో ఇద్దరూ సమానంగా ఆడారు. అలాంటప్పుడు మేరీ  1-4తో ఎలా ఓడుతుంది’’ అని ప్రశ్నించాడు. ‘‘ఈ బౌట్లో  మేరీకోమ్‌ స్పష్టమైన విజేత.. కానీ న్యాయ నిర్ణేతల లెక్కలు వేరేగా ఉన్నాయి’’ అని కేంద్ర మంత్రి రిజిజు అన్నారు.

స్కోరింగ్‌ ఇలా..

బాక్సింగ్‌లో అయిదుగురు న్యాయనిర్ణేతలు బౌట్‌ను పర్యవేక్షిస్తారు. నిర్దేశిత ప్రదేశాల్లో ఎవరు ఎక్కువ పాయింట్లు సాధించారు.. ఆధిపత్యం ఎలా ఉంది.. సాంకేతికంగా ఎలా ఆడారు లాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని బాక్సర్లకు పాయింట్లు కేటాయిస్తారు. ప్రతి రౌండ్‌ చివర ఆ రౌండ్లో ఎవరు గెలిచారో మార్కుల ద్వారా నిర్ణయిస్తారు. గెలిచిన వారికి 10 పాయింట్లు ఇస్తారు. ఓడిన వారికి 7 నుంచి 9 పాయింట్ల మధ్య ఇస్తారు. బౌట్‌ పూర్తయ్యాక అందరు న్యాయ నిర్ణేతలు తమ స్కోర్లను కలిపి విజేతను ప్రకటిస్తారు. అయిదుగురు జడ్జిలు ఏకగ్రీవంగా ఒప్పుకుంటే నిర్ణయం ఏకపక్షంగా ఉంటుంది. ఒకవేళ వారిలో భిన్న అభిప్రాయాలు ఉంటే ఎక్కువమంది ఎటు మొగ్గుతున్నారో దాన్ని బట్టి స్ల్పిట్‌ డిసిషన్‌ ప్రకటిస్తారు.


పతకానికి చేరువలో సతీష్‌

రో బాక్సర్‌ సతీష్‌కుమార్‌ పతకానికి చేరువయ్యాడు. సూపర్‌ హెవీవెయిట్‌ (91 కిలోల పైన) ప్రిక్వార్టర్స్‌లో 4-1తో రికార్డో బ్రౌన్‌ (జమైనా)ను ఓడించిన సతీష్‌ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. సెమీస్‌లో స్థానం కోసం బక్‌హోదీర్‌ (ఉజ్బెకిస్థాన్‌)తో సతీష్‌ తలపడనున్నాడు. ఈ పోరులో గెలిస్తే అతడు పతకం ఖాయం చేసుకుంటాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన