సింధు గర్జన
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 31/07/2021 05:00 IST

సింధు గర్జన

సెమీస్‌లో భారత ఆశాకిరణం

క్వార్టర్స్‌లో యమగూచిపై విజయం

తై జుపై గెలిస్తే ఫైనల్‌కు
బ్యాడ్మింటన్‌: మహిళల సింగిల్స్‌ సెమీస్‌ (సింధు × తై జు) మధ్యాహ్నం 3.20 నుంచి

టోక్యో

ఒలింపిక్స్‌లో తెలుగు తేజం, ప్రపంచ ఛాంపియన్‌ పి.వి.సింధు అంచనాలకు తగ్గట్లుగా సత్తాచాటుతోంది. హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఆరో సీడ్‌ సింధు 21-13, 22-20తో స్థానిక క్రీడాకారిణి, ఫేవరెట్లలో ఒకరు అకానె యమగూచిపై విజయభేరి మోగించింది. 56 నిమిషాల పాటు నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ పోరులో ప్రత్యర్థి ఆటకట్టించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో రెండుసార్లు సెమీస్‌ చేరుకున్న తొలి భారత క్రీడాకారిణిగా సరికొత్త రికార్డు సృష్టించింది. శనివారం జరిగే సెమీస్‌లో రెండో సీడ్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో సింధు తలపడనుంది. మరో సెమీస్‌లో చైనీస్‌ క్రీడాకారిణులు చెన్‌ యుఫెయ్‌, హి బింగ్జియావో పోటీపడనున్నారు. సింధు సెమీస్‌ అడ్డంకిని అధిగమిస్తే బంగారు పతకం ఖాయమేనన్నది విశ్లేషకుల అంచనా.
యమగూచిపై 13-7తో మెరుగైన గెలుపోటముల రికార్డున్న సింధుకు క్వార్టర్స్‌లో గట్టి పోటీ తప్పకపోవచ్చని అందరూ అనుకున్నారు. అయితే ప్రిక్వార్టర్స్‌లో అద్వితీయమైన ఆటతీరుతో ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపిన సింధు.. శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ ఏమాత్రం తగ్గలేదు. ప్రిక్వార్టర్స్‌లో ప్రదర్శించిన ఆటకు మించిన నైపుణ్యం, ఫిట్‌నెస్‌తో యమగూచికి అందనంత ఎత్తులో కనిపించింది. కోర్టులో ఏ మూలలోకి షటిల్‌ వచ్చినా సింధు అలవోకగా అందుకుంది. అదే సమయంలో ప్రత్యర్థికి అందనంత దూరంలో క్రాస్‌కోర్ట్‌ స్ట్రోక్‌లతో అదరగొట్టింది. స్టేడియంలో గాలివాటాన్ని పూర్తిగా చదివేసిన భారత అమ్మాయి షటిల్‌పై నియంత్రణతో ఆడింది. స్ట్రోక్‌లలో కచ్చితత్వంతో యమగూచిని చిత్తుచేసింది. జపాన్‌ క్రీడాకారిణి షటిల్‌ను పదేపదే బయటకు కొడుతూ పాయింట్లను కోల్పోయింది. అనవసర తప్పిదాలను బాగా తగ్గించుకున్న సింధు ప్రత్యర్థికి సమర్థంగా కళ్లెం వేసింది.
తొలి గేమ్‌లో సింధు అటాకింగ్‌కు యమగూచి దూకుడుతో కౌంటర్‌ ఇచ్చింది. 4-2తో ఆధిక్యం సంపాదించింది. ఒక్కసారిగా దూకుడు పెంచిన సింధు 6-6తో పాయింట్లను సమం చేసింది. యమగూచి అనవసర తప్పిదాలు కూడా కలిసిరావడంతో 11-7తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కోర్టులో చిరుతలా కదులుతూ.. నెట్‌ దగ్గర షటిల్‌ను లాఘవంగా అవతలికి పంపుతూ.. ప్రత్యర్థిని పరుగులు పెట్టించిన సింధు వేరే స్థాయిలో ఆడింది. క్రాస్‌కోర్ట్‌ షాట్‌లతో యమగూచిని కట్టిడి చేసింది. 18-11తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు.. కొద్దిసేపటికే 21-13తో తొలి గేమ్‌ను గెలుచుకుంది. రెండో గేమ్‌ మొదట్లో యమగూచి నుంచి ప్రతిఘటన ఎదురైంది. అయితే ఫిట్‌నెస్‌ పరంగా అత్యుత్తమ స్థితిలో ఉన్న సింధు ముందు ఆమె వ్యూహాలు పనిచేయలేదు. 11-6తో ఆధిక్యం సంపాదించిన సింధు 14-8తో మరింత ముందంజ వేసింది. అయితే యమగూచి స్మాష్‌లు, పదునైన స్ట్రోక్‌లు సంధిస్తూ 13-15తో సింధును సమీపించింది. ఆ వెంటనే 54 షాట్‌ల పాటు సుదీర్ఘంగా ర్యాలీ సాగింది. యమగూచి స్మాష్‌తో ర్యాలీని ముగించినా ఇరువురు క్రీడాకారిణులు దాదాపుగా కోర్టులో కూలబడ్డారు. సింధు కాస్త అలసిపోయినట్లుగా కనిపించడంతో యమగూచి మరింత జోరు పెంచి 18-16తో ఆధిక్యంలో వెళ్లింది. అయితే సింధు వరుసగా 2 పాయింట్లు నెగ్గి 18-18తో స్కోరును సమం చేసింది. యమగూచి సైతం 2 పాయింట్లు గెలిచి 20-18తో రెండో గేమ్‌కు చేరువైంది. సింధు మళ్లీ పుంజుకుని 20-20తో పాయింట్లను సమం చేసింది. మరో స్మాష్‌తో మ్యాచ్‌కు దగ్గరైంది. యమగూచి షటిల్‌ను నెట్‌కు ఆడటంతో మ్యాచ్‌ సింధు సొంతమైంది.

‘‘తొలి గేమ్‌ పూర్తిగా నా నియంత్రణలోనే ఉన్నా ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోలేదు. గతంలో చాలాసార్లు యమగూచి పుంజుకుంది. చివరి వరకు ఆధిపత్యం కనబరిచి తొలి గేమ్‌ను ముగించా. రెండో గేమ్‌ చివర్లో ఒత్తిడికి లోనవలేదు. ‘ఏమీ కాదు. ఏకాగ్రతతో ఆడు. లక్ష్యాన్ని చేరుకుంటావు’ అని కోచ్‌ పార్క్‌ చెప్తూ ఉన్నాడు. ఒలింపిక్స్‌ కోసం నేనెంతో కష్టపడ్డా. ఇక్కడితో    ముగియలేదు. కావాల్సినంత విశ్రాంతి తీసుకుని తర్వాతి మ్యాచ్‌కు సిద్ధమవ్వాలి’’ 

- సింధుAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన