కమాల్‌ప్రీత్‌
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 01/08/2021 04:19 IST

కమాల్‌ప్రీత్‌

డిస్కస్‌త్రో ఫైనల్లో కౌర్‌
టోక్యో

ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ మొదలు కాగానే భారత అభిమానుల చూపు జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాపై ఉంటే తానూ ఉన్నానంటూ వచ్చింది కమల్‌ప్రీత్‌ కౌర్‌! డిస్కస్‌త్రోలో అద్భుత ప్రదర్శనతో ఫైనల్లో ప్రవేశించి అబ్బురపరిచింది. క్వాలిఫికేషన్‌లో డిస్క్‌ను ఆమె 64 మీటర్ల దూరం విసిరి నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆమె కాకుండా అల్‌మన్‌ (అమెరికా, 66.42 మీ) మాత్రమే  64 మీ. దూరాన్ని అందుకోవడం గమనార్హం. తొలి ప్రయత్నంలో 60.29 మీటర్ల దూరం వేసిన కమల్‌ప్రీత్‌ రెండో ప్రయత్నంలో ఇంకా మెరుగ్గా 63.97 మీటర్లు విసిరింది. ఇక మూడో ప్రయత్నంలో 64 మీటర్ల దూరం త్రో చేసి రెండో స్థానాన్ని దక్కించుకుంది. రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం   గెలిచిన సాండ్రా పెర్కోవిచ్‌ (క్రొయేషియా, 63.75 మీ), ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌ యమ్‌ పెరిజ్‌ (క్యూబా,   63.18 మీ) కంటే మెరుగ్గా కమల్‌ప్రీత్‌ డిస్క్‌ను విసరడం విశేషం. ఒలింపిక్స్‌ డిస్కస్‌ త్రోలో ఫైనల్‌ చేరిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా ఆమె ఘనత సాధించింది. ఈ మార్చిలో ఫెడరేషన్‌ కప్‌లో 65.06 మీటర్ల దూరం విసిరి జాతీయ రికార్డు సృష్టించిన కమల్‌ప్రీత్‌.. ఈ ప్రదర్శనను ఫైనల్లో ప్రదర్శిస్తే పోడియంపై నిలబడే అవకాశాలున్నాయి. ఈ సీజన్లో డిస్క్‌ను 70.01 మీటర్ల దూరం విసిరిన క్లిన్‌కెన్‌ (నెదర్లాండ్స్‌) దారుణంగా విఫలమై ఫైనల్‌కు అర్హత సాధించలేకపోవడం కూడా కమల్‌ప్రీత్‌కు కలిసొచ్చే అంశం. వెటరన్‌ క్రీడాకారిణి సీమా పునియా క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగింది. ఆమె డిస్క్‌ను 60.57 మీటర్ల దూరం విసిరి ఆరో స్థానంలో నిలిచింది. లాంగ్‌జంప్‌లో శ్రీశంకర్‌ విఫలమయ్యాడు. అర్హత రౌండ్లో 7.69 మీటర్లు దూకిన అతడు 13వ స్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో 7.69 మీటర్లు దూకిన అతడు.. ఆ తర్వాత 7.51 మీ, 7.43 మీ మాత్రమే దూకగలిగాడు. గత మార్చిలో 8.26 మీటర్ల దూరం దూకి సత్తా చాటిన శ్రీశంకర్‌ ఆ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయాడు.

క్వార్టర్స్‌లో భారత అమ్మాయిలు: హాకీలో భారత మహిళల జట్టు తొలిసారి క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. వందన కటారియా హ్యాట్రిక్‌ చేయడంతో చివరి లీగ్‌ మ్యాచ్‌లో రాణీ రాంపాల్‌ బృందం 4-3 గోల్స్‌తో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ పోరులో నాలుగో నిమిషంలో వందన గోల్‌ కొట్టి జట్టును ఆధిక్యంలో నిలపగా.. గ్లాస్‌బీ (15వ ని) చేసిన గోల్‌తో దక్షిణాఫ్రికా స్కోరు సమం చేసింది. 30వ నిమిషం ముగిసే సమయానికి రెండు జట్లు ఇంకో రెండు గోల్స్‌ కొట్టాయి. భారత్‌ నుంచి వందన (17వ ని), సఫారీ జట్టు తరఫున ఇరిన్‌ (30వ నిమిషం) ఈ గోల్స్‌ చేశారు. నేహా (32వ ని) చేసిన గోల్‌తో భారత్‌ మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లగా.. దక్షిణాఫ్రికా అమ్మాయి మారిస్‌ (39వ ని) బంతిని లక్ష్యానికి చేర్చి స్కోరు సమం చేసింది. ఈ స్థితిలో వందన (49వ నిమిషం) హ్యాటిక్‌ గోల్‌ చేసి జట్టును 4-3తో నిలిపింది. ఆఖరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్‌ విజయాన్ని అందుకుంది. ఒలింపిక్స్‌ హాకీలో హ్యాట్రిక్‌ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా వందన ఘనత సాధించింది.

ఆర్చరీలో సున్నా: ఒలింపిక్స్‌ ఆర్చరీలో మరోసారి భారత్‌కు రిక్తహస్తమే మిగిలింది. అతానుదాస్‌ కూడా ఓడిపోవడంతో ఈ విభాగంలో మన కథ ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో అతాను 4-6తో జపాన్‌ ఫేవరెట్‌ తకహరు చేతిలో పోరాడి ఓడాడు. ఈ పోరులో తొలి నాలుగు సెట్లలో రెండు సెట్లు టై కాగా.. అతాను, తకహరు చెరో సెట్‌ గెలిచారు. నిర్ణయాత్మక అయిదో సెట్‌ను అతాను 26-27తో చేజార్చుకుని పోటీ నుంచి నిష్క్రమించాడు.

షూటింగ్‌లో అదే వైఫల్యం: షూటింగ్‌లో వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. మహిళల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో అంజుమ్‌ మౌద్గిల్‌, తేజస్విని సావంత్‌ విఫలయ్యారు. అంజుమ్‌ (1167 పాయింట్లు) 15వ స్థానంలో, తేజస్విని (1154) 33వ స్థానంలో నిలిచి ఫైనల్‌ చేరలేకపోయారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో సంజీవ్‌ రాజ్‌పుత్‌, ఐశ్వర్య ప్రతాప్‌ తలపడాల్సి ఉంది. సెయిలింగ్‌లో గణపతి-వరుణ్‌ థక్కర్‌ వెనకబడే ఉన్నారు.

 


క్రికెట్‌ టోర్నీలు ఆడాలనుకుంటున్నా

దిల్లీ: టోక్యో క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో మహిళల డిస్కస్‌ త్రో ఫైనల్‌ చేరిన భారత అథ్లెట్‌ కమల్‌ప్రీత్‌ కౌర్‌.. తనకు క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టమంటోంది. ఏదో ఒక రోజు క్రికెట్‌ టోర్నీల్లో ఆడాలనే కోరికతో ఉన్నట్లు తెలిపింది. ‘‘డిస్కస్‌ త్రోను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. దీనికే నా తొలి ప్రాధాన్యత. సోమవారం పతకం గెలిచి భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య, సాయ్‌ రుణం తీర్చుకోవాలి. ఒలింపిక్స్‌ తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ (2022)లో పతకం గెలవాలి. ఆసియా క్రీడల్లో పసిడి నెగ్గాలి. కానీ ఏదో ఒక  సమయంలో మాత్రం కొన్ని క్రికెట్‌ టోర్నీల్లో ఆడాలనుకుంటున్నా. అది నాకిష్టమైన రెండో ఆట. అథ్లెటిక్స్‌లో కొనసాగుతూనే క్రికెట్‌ ఆడతా. మా గ్రామంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంతకుముందు ఆడా. సెహ్వాగ్‌ లేదా ధోనీలా బ్యాటింగ్‌ చేయడాన్ని ఇష్టపడతా. క్రికెట్‌ దేవుడు సచిన్‌, వన్డేల్లో అత్యధిక ద్విశతకాల రికార్డున్న రోహిత్‌ ఆటన్నా ఇష్టమే’’ అని కమల్‌ప్రీత్‌ తెలిపింది. వ్యక్తిగత కోచ్‌ లేకుండానే తొలి ఒలింపిక్స్‌ బరిలో దిగిన 25 ఏళ్ల కమల్‌ప్రీత్‌.. కొంత కాలం నుంచి తన భుజం, మోకాలిలో కాస్త నొప్పిగా ఉన్నప్పటికీ పతకం సాధించేందుకే ప్రయత్నిస్తానని పేర్కొంది. మరోవైపు కమల్‌ప్రీత్‌ పతకం దిశగా పూర్తిస్థాయి ప్రదర్శన చేస్తానని చెప్పిందని ఆమె తండ్రి కుల్‌దీప్‌ సింగ్‌ వెల్లడించాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన