అనుకోకుండా.. ఓ కొత్త చిరుత
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 02/08/2021 06:22 IST

అనుకోకుండా.. ఓ కొత్త చిరుత

పురుషుల 100మీ. పరుగు పసిడి నెగ్గిన జాకబ్స్‌

ఒలింపిక్స్‌ పురుషుల 100మీ. పరుగులో 13 ఏళ్లుగా ఆధిపత్యం చలాయించిన బోల్ట్‌ వారసుడెవరు? టోక్యో ట్రాక్‌పై పసిడి గెలిచే చిరుత ఎవరు? ప్రపంచంలోనే వేగవంతమైన మనిషి ఎవరు? ఇలా ఎన్నో ప్రశ్నలు. బ్రోమెల్‌, డిగ్రాస్‌, బ్లేక్‌, సింబైన్‌.. ఇలా అంచనాలను అందుకుని ఛాంపియన్లుగా నిలుస్తారని ఆశలు రేపిన అథ్లెట్లు ఎందరో! జమైకా లేదంటే అమెరికాకు చెందిన అథ్లెటే స్వర్ణం సాధిస్తాడనే ఎన్నో ఊహాగానాలు! కానీ చివరకు లక్ష్యాన్ని ముద్దాడింది.. స్వర్ణాన్ని మెడలో వేసుకుంది.. ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.. మార్సెల్‌ జాకబ్స్‌. అనూహ్యంగా ఈ కొత్త చిరుతకే అందలం దక్కింది.

టోక్యో: ఒలింపిక్స్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పురుషుల 100మీ. పరుగులో జాకబ్స్‌ కొత్త ఛాంపియన్‌గా అవతరించాడు. గత మూడు ఒలింపిక్స్‌ల్లోనూ స్ప్రింట్‌ దిగ్గజం బోల్ట్‌కు దాసోహమన్న ఆ పసిడి.. ఇప్పుడు ఈ 26 ఏళ్ల ఇటలీ రన్నర్‌ మెడలో వాలింది. అనామకుడిగా రేసులో అడుగుపెట్టి అగ్రస్థానంలో నిలిచిన అతని ప్రదర్శన చూశాక అందరిలో ఆశ్చర్యమే. ఆదివారం ఫైనల్లో ప్రత్యర్థులను వెనక్కినెట్టిన అతను.. 9.80 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని సంతోషంలో మునిగిపోయాడు. అమెరికా అథ్లెట్‌ కెర్లీ ఫ్రెడ్‌ (9.84సె) రజతం సొంతం చేసుకున్నాడు. గత రియో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన కెనడా అథ్లెట్‌ డిగ్రాస్‌ (9.89సె) మరోసారి మూడో స్థానానికే పరిమితమయ్యాడు. ఈ రేసులో ఫేవరేట్‌గా పరిగణించిన బ్రోమెల్‌ అసలు ఫైనల్‌కే చేరలేదు. ఈ అమెరికా వీరుడు ఈ సారి 100మీ. పరుగులో ఛాంపియన్‌గా నిలుస్తాడని బోల్ట్‌ అంచనా వేయడం గమనార్హం. రెండో సెమీస్‌ రేసులో అతను మూడో స్థానం (10సె) లో నిలిచాడు. జమైకా వెటరన్‌ బ్లేక్‌ కూడా పతక రేసుకు అర్హత సాధించలేకపోయాడు. తొలి సెమీస్‌లో అతను 10.14 సెకన్ల టైమింగ్‌తో ఆరో స్థానంలో నిలిచాడు. ఒక్కో సెమీస్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రేసర్లు.. మొత్తంగా ఆరుగురు (మూడు సెమీస్‌ల నుంచి), వీళ్ల తర్వాత అత్యంత వేగంగా రేసు పూర్తి చేసిన మరో ఇద్దరు అథ్లెట్లు కలిపి మొత్తం 8 మంది ఫైనల్స్‌లో పోటీపడతారు. ఈ పతక రేసులో జర్నెల్‌ (బ్రిటన్‌) అనర్హతకు గురి కాగా.. ఎనాక్‌ (నైజీరియా) గాయపడి రేసు మధ్యలో తప్పుకున్నాడు. 25 ఏళ్ల తర్వాత 100మీ. పరుగు ఫైనల్‌ చేరిన తొలి నైజీరియా అథ్లెట్‌గా నిలిచిన అతణ్ని దురదృష్టం వెంటాడింది.


ఎవరీ జాకబ్స్‌..

ఆదివారం సాయంత్రం 6.20.. 100మీ. ఫైనల్‌ రేసు కోసం అందరూ చూస్తున్నారు. పోటీపడే ఆఖరి ఎనిమిది మందిలో చూస్తే ఫేవరేట్లు ఎవరూ కనిపించడం లేదు. దీంతో కొత్త ఛాంపియన్‌గా ఎవరు నిలుస్తారనే ఆసక్తి పెరిగింది. రేసు మొదలైంది.. వేగం అందుకున్న రన్నర్లు గమ్యం వైపు దూసుకెళ్లారు. రేసు ముగిసింది.. విజేత ఎవరా?అని చూస్తే.. అనూహ్యంగా జాకబ్స్‌ పేరు కనిపించింది. అసలింతకీ జాకబ్స్‌ ఎవరు? అనే ప్రశ్న అందరిలో మొదలైంది. అమెరికాలో పుట్టిన అతను ఆ తర్వాత తన తల్లి దేశమైన ఇటలీకి వచ్చాడు. అక్కడే పెరిగిన అతను.. అన్ని క్రీడలనూ ఆడి చూసి చివరకు అథ్లెటిక్స్‌లో కెరీర్‌ ఎంచుకున్నాడు. మొదట లాంగ్‌జంప్‌లోనే అతను పోటీపడేవాడు. ఆ క్రీడలోనే జాతీయ ఛాంపియన్‌గానూ నిలిచాడు. కానీ 2018లో అతని మనసు ట్రాక్‌పైకి మళ్లింది. పరుగుపై ధ్యాస పెట్టిన అతను తక్కువ కాలంలోనే స్ప్రింట్‌లో జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. కరోనా లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన అతను.. తన పరిసరాల్లో ఉన్న మినీ ట్రాక్‌పై సాధన చేశాడు. అప్పుడే పరుగుపై పూర్తిగా పట్టు సాధించాడు. ఈ ఏడాది ఆరంభంలోనూ అతని పేరు పెద్దగా ఎవరికీ తెలీదు. కానీ మార్చిలో యూరోపియన్‌ ఇండోర్‌ ఛాంపియన్‌షిప్స్‌ 60మీ. పరుగులో పసిడితో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అవుట్‌డోర్‌లో తొలి 100మీ. పరుగును 9.95 సెకన్లలో పూర్తి చేసి కొత్త జాతీయ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్‌ పసిడితో సంచలనం సృష్టించాడు. అతని శరీరంపై వివిధ సూక్తులు, తన భార్యాపిల్లల పేర్లు, పులి పచ్చబొట్లు ఉండడం విశేషం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన