అనితర సాధ్యురాలు
Array ( [0] => stdClass Object ( [video_type] => 1 [video_short_link] => UvrHUAximog ) ) 1

ప్రధానాంశాలు

Updated : 02/08/2021 07:37 IST

అనితర సాధ్యురాలు

ఈనాడు క్రీడావిభాగం

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో ప్రకాశ్‌ పదుకొనే ఓ కాంస్యం గెలిస్తే దాని గురించి ఎన్నేళ్లు చెప్పుకున్నామో! 28 ఏళ్ల పాటు దేశంలో మరే షట్లర్‌ కూడా ఆ ఘనతకు చేరువగా రాలేదు. అలాంటి అత్యున్నత టోర్నీలో మళ్లీ ఓ పతకం గెలిచిన ఘనత పి.వి.సింధుదే. ఆమె దేశవాళీ క్రీడాకారిణిగా ఉన్న సమయానికి అంతర్జాతీయ స్థాయిలో సైనా నెహ్వాల్‌ గొప్ప క్రీడాకారిణిగా ఎదిగింది. సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు గెలిచింది. ఒలింపిక్‌ పతకమూ సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దిశగా దూసుకెళ్తోంది. అలాంటి క్రీడాకారిణికి కూడా ప్రపంచ బ్యాడ్మింటన్‌లో పతకం కలే! అలాంటిది సింధు 2013లో ఈ మెగా టోర్నీలో కాంస్యం గెలిచి ఔరా అనిపించింది. ఇది గాలి వాటం విజయం అన్న వాళ్లకు.. తర్వాతి ఏడాదే మరో కాంస్యంతో సమాధానం చెప్పింది. ఆపై ఇలాంటి సంచలన విజయాలు ఎన్నో, ఎన్నెన్నో!

సంతృప్తి లేదు.. విశ్రమించదు: ఎంతో కష్టపడి ఓ పెద్ద విజయం సాధించగానే కొందరు సంతృప్తి పడిపోతారు. కొందరికి ఆ విజయం తలకెక్కేస్తుంది. నిర్లక్ష్యం ఆవహిస్తుంది. సింధు వీటన్నింటికీ మినహాయింపు. గొప్ప విజయాలు సాధించాక ఎప్పుడూ ఆమె ఆ మత్తులో ఉండిపోలేదు. విశ్రమించలేదు. ఇంకా పెద్ద లక్ష్యం పెట్టుకుని ఆ దిశగా కష్టపడింది. రియోలో రజతం సాధించాక సింధుకు ఎంతటి అపూర్వ ఆదరణ దక్కిందో తెలిసిందే. క్రికెటర్లకు కాకుండా మరో ప్లేయర్‌కు అలాంటి ఆదరణ కలలోనైనా ఊహించలేనిది. అది చూసి సింధు సంబరపడిపోయి అక్కడే ఆగిపోయి ఉంటే.. గత అయిదేళ్లలో సాధించిన అద్భుత విజయాలేవీ ఉండేవి కావు. ఒలింపిక్స్‌ పతకంతో సంతృప్తి చెందకుండా ప్రపంచ ఛాంపియన్‌ కావాలన్న లక్ష్యం పెట్టుకుంది. ఆ దిశగా అసామాన్య రీతిలో కష్టపడింది. శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారైంది. ఆటను మరింతగా మెరుగు పరుచుకుంది. వరుసగా రెండేళ్లు టైటిల్‌కు చేరువగా వచ్చి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చినా నిరాశ పడలేదు. మొక్కవోని పట్టుదలతో మళ్లీ పోరాడింది. చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంటూ 2019లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఆరేళ్ల ముందు వరకు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యానికే అబ్బురపడుతున్న వాళ్లకు పసిడి రుచి చూపి ఔరా అనిపించింది. గత ఏడాదిన్నరలో కరోనా కారణంగా టోర్నీలు లేకున్నా, ప్రాక్టీస్‌ కష్టమైనా.. దాన్ని సాకుగా చూపించకుండా తన శక్తిమేర శ్రమించింది. టోక్యోలో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన ఆమె.. ఆ  అవకాశం చేజారినా కుంగిపోకుండా కాంస్యం సాధించింది. ఒలింపిక్స్‌ చరిత్రలోనే రెండు పతకాలు గెలిచిన షట్లర్లు ఇద్దరు మాత్రమే. వారి సరసన సింధు చేరింది. అంతేనా.. విశ్వ క్రీడల్లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత మహిళ కూడా సింధునే. వీటికి తోడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సహా అయిదు పతకాలు ఆమె సొంతం. ఇంకా ఆసియా, కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాలు.. సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు.. ఇలా సింధు ఘనతల ఖాతా పెద్దదే. కెరీర్‌ ఆరంభంలో దిగ్గజాల ముందు ఒక మామూలు క్రీడాకారిణిగా కనిపించిన సింధు.. ఇప్పుడు ఆ దిగ్గజాలకే దిగ్గజంగా మారడం.. బ్యాడ్మింటన్‌ అనే కాక భారత క్రీడా చరిత్రలోనే అత్యుత్తమ అథ్లెట్లలో ఒకరిగా నిలిచే స్థాయిని అందుకోవడం అసామాన్య విషయం. అందుకే క్రీడాకారులనే కాదు.. అన్ని రంగాల వారికీ సింధు  ఓ స్ఫూర్తి ప్రదాత. రియో తర్వాత సింధు శ్రమించిన తీరు, ఆటలో ఎదిగిన వైనం చూస్తే.. ఆమె ఇంతటితో ఆగిపోతుందని అనుకోలేం! ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఫిట్‌నెస్‌ కాపాడకుంటే, ఆటను మరింత మెరుగుపరుచుకుంటే.. మూడేళ్ల తర్వాత పారిస్‌లో ‘స్వర్ణ సింధు’ను చూస్తామేమో!
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన