అనగనగా ఓ అద్భుతం
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 03/08/2021 22:05 IST

అనగనగా ఓ అద్భుతం

 తొలిసారి మహిళల హాకీ సెమీస్‌లో భారత్‌

క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాకు షాక్‌

టోక్యో

టోక్యో.. ఒలింపిక్‌ హాకీ స్టేడియం. అది క్వార్టర్‌ఫైనల్‌ సమరం. ఉత్కంఠకు తెరదించుతూ ఫైనల్‌ విజిల్‌ మోగింది. అంతే.. భారత అమ్మాయిల సంబరాలకు ఆకాశమే హద్దయింది. భావోద్వేగం కట్టలు తెంచుకుంది. ఒకరినొకరు గట్టిగా హత్తుకున్నారు.. కేకలు పెడుతూ గంతులేశారు. కన్నీళ్లూ వాళ్లతో కలిశాయి!

ఎందుకంత ఉద్వేగం, ఎందుకంత ఆనందం! ఎందుకంటే..

మహిళల జట్టు తొలిసారి ఒలింపిక్‌ సెమీఫైనల్‌ చేరిన క్షణమది. మేటి ఆస్ట్రేలియాను మట్టికరిపించి చరిత్ర సృష్టించిన సందర్భమది. తీవ్రమైన ఒత్తిడిని తట్టుకుంటూ, బలాలన్నింటినీ కూడదీసుకుంటూ దుర్బేధ్యమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థి అలుపెరగని దాడులను అద్భుతంగా అడ్డుకున్నందుకు దక్కిన మధుర విజయమది. అన్నింటికన్నా ముఖ్యంగా.. దేశాన్ని హాకీ పతకం ముందు నిలిపిన ఫలితమది! ఒక్క జట్టుకేనా..! రసవత్తర పోరులో 1-0 ఆధిక్యంతో విజయం ఊరిస్తుండగా.. ముగింపు సమీపిస్తున్నకొద్దీ ఉత్కంఠ తీవ్రమైన మ్యాచ్‌ను ఊపిరి బిగబట్టి వీక్షించిన కోట్లాది అభిమానులకూ అది అపురూప క్షణమే. అందరిదీ అదే పరిస్థితి. కాకపోతే, ఆడుతూ అమ్మాయిలు మైదానంలో... టీవీలకు కళ్లప్పగించి వీళ్లు ఇంట్లో. అంతే తేడా!

భారతావని మళ్లీ మురిసింది. ఒలింపిక్స్‌ హాకీలో సెమీస్‌ చేరిన మన అమ్మాయిల ప్రదర్శన చూసి గర్వంతో తలెత్తింది. ఓటమి పాలవుతారేమోననే సందేహాల మధ్యలో మైదానంలో అడుగుపెట్టిన మహిళల జట్టు క్వార్టర్స్‌లో గర్జించింది. ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న భారత్‌.. 1-0 తేడాతో రెండో ర్యాంకర్‌ ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. ఎప్పటికీ గుర్తుండిపోయే.. గుర్జీత్‌ కౌర్‌ గెలుపు గోల్‌.. గోల్‌కీపర్‌ సవిత పోరాటం.. డిఫెండర్ల అసామాన్య ప్రదర్శన కలగలిసి భారత్‌కు చిరస్మరణీయ విజయం దక్కింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొమ్మిది పెనాల్టీ అవకాశాలను మనవాళ్లు అడ్డుకున్నారంటే సవిత, డిఫెన్స్‌ సామర్థ్యం ఏమిటో అర్థమవుతుంది. ప్రత్యర్థి గతంలో మూడు సార్లు ఒలింపిక్‌ స్వర్ణాలు గెలిచి ఉండొచ్చు.. తమకంటే అన్ని విభాగాల్లోనూ ఎంతో మెరుగ్గా ఉండొచ్చు.. కానీ పోరాటాన్నే నమ్ముకుని.. బరిలో దిగిన భారత్‌ మొదటి నుంచే దూకుడు ప్రదర్శించింది. ఆస్ట్రేలియాకు గోల్స్‌కు మధ్య సవిత అడ్డుగోడలా నిలబడి.. ఆరంభంలోనే ప్రత్యర్థి గోల్‌ చేసే అవకాశాన్ని సమర్థంగా అడ్డుకోవడంతో.. ఆత్మవిశ్వాసం పెంచుకున్న భారత్‌ ఎదురుదాడికి దిగింది. ప్రత్యర్థి డిఫెన్స్‌ వ్యూహాన్ని ఛేదిస్తూ గోల్‌పోస్టు వైపు మన అమ్మాయిలు దూసుకెళ్లారు. తొమ్మిదో నిమిషంలోనే భారత్‌కు తొలి గోల్‌ దక్కేదే! వందన నుంచి బంతి అందుకున్న కెప్టెన్‌ రాణి.. దాన్ని గోల్‌పోస్టులోకి పంపే ప్రయత్నం చేసింది. కానీ అది గోల్‌బార్‌కు తగిలి పక్కకు వెళ్లిపోయింది. ఆ కొద్దిసేపటికే షర్మిలా దేవి గోల్‌ ప్రయత్నాన్ని ప్రత్యర్థి గోల్‌కీపర్‌ అడ్డుకుంది. అక్కడి నుంచి భారత్‌ మరింత జోరు పెంచింది.

ఒకవైపు సవిత.. మరోవైపు గుర్జీత్‌: రెండో క్వార్టర్స్‌లో ఆట మొత్తం భారత్‌దే. ఆస్ట్రేలియాకు లభించిన పెనాల్టీ కార్నర్లను సవిత గొప్పగా అడ్డుకుంది. ఆమెకు డిఫెండర్లు అండగా నిలవడంతో కంగారూ జట్టును సమర్థంగా నిలువరించింది. ఇక అప్పుడే చరిత్రలో నిలిచిపోయే అవకాశం గుర్జీత్‌కు వచ్చింది. 22వ నిమిషంలో దొరికిన పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసిన ఆమె దేశానికి గోల్‌ అందించింది. డ్రాగ్‌ఫ్లిక్‌తో ప్రత్యర్థి క్రీడాకారిణుల కాళ్ల కింద నుంచి.. గోల్‌కీపర్‌కు అందని విధంగా బంతిని లోపలికి పంపించి భారత్‌ను ఆధిక్యంలో నిలిపింది. తర్వాతి క్వార్టర్లో ఆసీస్‌ను మన వాళ్లు బాగానే నిలువరించారు. అయితే చివరి 15 నిమిషాల్లో ఆస్ట్రేలియాకు వరుసగా పెనాల్టీ అవకాశాలు వచ్చాయి.ఈ పరిస్థితుల్లో గోల్‌పోస్టుకు ముందు సవాలుకు సిద్ధంగా నిలబడ్డ సవిత, డిఫెండర్లు గొప్పగా బంతిని ఆపారు. మ్యాచ్‌ సమయం ముగియగానే మన అమ్మాయిలు ఒక్క చోట చేరి గంతులు వేశారు. ఆస్ట్రేలియా మహిళలు ఉన్నచోట కూలబడి కన్నీళ్లు పెట్టుకున్నారు.


‘‘విజయం తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. భావోద్వేగాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఆస్ట్రేలియాపై గెలుపు అంత సులువు కాదు కాబట్టి నెగ్గినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. నా జట్టు పట్ల ఎంతో గర్వంగా ఉన్నా. సెమీస్‌ చేరి చరిత్ర సృష్టించాం. ఇక్కడితోనే ఆగిపోవాలనుకోవట్లేదు. పతకం గెలిచేందుకు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి’’

- భారత మహిళల హాకీ కెప్టెన్‌ రాణి రాంపాల్‌


సినిమా స్ఫూర్తితో..

టోక్యోలో గ్రూప్‌ దశలో వరుసగా మూడు ఓటములతో ఢీలా పడ్డ అమ్మాయిల హాకీ జట్టులో ఓ సినిమా స్ఫూర్తి నింపిందని కోచ్‌ మారిజ్నె వెల్లడించాడు. హ్యాట్రిక్‌ పరాజయాల తర్వాత తిరిగి పుంజుకున్న భారత్‌.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి క్వార్టర్స్‌ చేరుకుంది. తమ మీద తమకు నమ్మకం కలిగించేలా ఉన్న ఆ చిత్రం చూసిన తర్వాత అమ్మాయిలకు ఆత్మవిశ్వాసం పెరిగిందని, మానసికంగా బలంగా మారారని కెప్టెన్‌ రాణి కూడా పేర్కొంది. అయితే ఆ సినిమా పేరును మాత్రం బయటపెట్టలేదు.

 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన