సరిదిద్దుకోకుంటే  ఎలా?
Array ( [0] => stdClass Object ( [video_type] => 1 [video_short_link] => FjzhkVAo7bU ) ) 1

ప్రధానాంశాలు

Updated : 29/08/2021 07:19 IST

సరిదిద్దుకోకుంటే  ఎలా?

ఈనాడు క్రీడావిభాగం

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. జట్టులో దాదాపుగా అందరిదీ అదే పరిస్థితి! అయితే వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ లేదంటే.. స్లిప్స్‌లో దొరికిపోవడం! ఔటవడం ఇంత తేలికా అన్నట్టుగా బంతిని అలా తాకించి వికెట్ల వెనక అడ్డంగా దొరికిపోతున్నారు..! టీమ్‌ఇండియాను ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న ఈ సమస్యే మూడో టెస్టులో ఓటమికి ప్రధాన కారణం.

ఆఫ్‌స్టంప్‌ ఆవల దూసుకొచ్చే బంతులను ఎదుర్కోలేక వికెట్లు సమర్పించుకోవడం జట్టులో దాదాపుగా అందరికీ అలవాటే. ఈ బలహీనతను ఆయుధంగా మార్చుకున్న ఇంగ్లాండ్‌ బౌలర్లు ఆఫ్‌ స్టంప్‌ బయట బంతులేస్తూ భారత్‌ను చుట్టేస్తున్నారు. ఇప్పుడు మూడో టెస్టులోనూ ఇంగ్లిష్‌ బౌలర్లు ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. ప్రణాళిక ప్రకారం ఆఫ్‌ స్టంప్‌కు ఆవల బంతులేసి వికెట్లు సాధించారు. గతంలోనూ మన బ్యాట్స్‌మెన్‌ ఇంగ్లాండ్‌ గడ్డపై ఇలాగే ఔటయ్యారు. అంతెందుకు మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ ఇలాగే బంతులను వేటాడి పెవిలియన్‌ చేరారు. అయినా ఆ వైఫల్యాల నుంచి పాఠాలు మాత్రం నేర్చుకోలేకపోతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్‌ పేలవ షాట్‌ సెలక్షన్‌తో 78 పరుగులకే జట్టు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లోనైనా వాళ్ల ఆట మారుతుందేమోనని అంతా భావించారు. అందుకు తగినట్లుగానే రోహిత్‌, పుజారా, కోహ్లి మూడో రోజు నిలబడ్డారు. కానీ నాలుగో రోజు వచ్చేసరికి మళ్లీ పాత కథే పునరావృతమైంది. ఫాస్ట్‌ పిచ్‌లపై బాగా ఆడగలడని పేరున్న సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రహానె కూడా ఈ బలహీనతను అధిగమించలేకపోతున్నాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌నే తీసుకోండి. ఔట్‌ స్వింగర్‌ను ఆఫ్‌స్టంప్‌ ఆవల అనవసరంగా గెలికి తొలి స్లిప్‌లో రూట్‌కు చిక్కి వెనుదిరిగాడు. రహానె తడబాటుకు ఇదొక ఉదాహరణ మాత్రమే. ఆఫ్‌స్టంప్‌ లోగిలిలో పుజారాదీ ఇదే ఊగిసలాట. అతడు స్లిప్‌లో ఔట్‌ కావడం తక్కువ. కానీ ఈ సిరీస్‌లో ఎందుకో ఆఫ్‌స్టంప్‌ లైన్‌లో ఆడడంలో ఇబ్బందిపడుతున్నాడు. సిరీస్‌లో నాలుగుసార్లు స్లిప్‌ లేదా వికెట్‌కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

కోహ్లి మళ్లీ..: టీమ్‌ఇండియా కెప్టెన్‌ కోహ్లీకి 2014 ఇంగ్లాండ్‌ పర్యటన ఎంతటి పీడకలను మిగిల్చిందో తెలిసిందే. అయితే ఆ తర్వాత సచిన్‌ సలహాలతో పాటు తన బలహీనతను అధిగమించడంపై పూర్తి దృష్టి సారించి ఆ దిశగా తీవ్రంగా శ్రమించి ఉత్తమ ఫామ్‌ అందుకున్నాడు. కానీ గత రెండేళ్లుగా మళ్లీ అతను తన మునుపటి బలహీనతను ప్రదర్శిస్తున్నాడు. ఇప్పుడు ఇంగ్లాండ్‌లో ఆఫ్‌స్టంప్‌ లోగిలిలో బంతులను ఎదుర్కోవడంలో ఎక్కువ అవస్థపడుతున్న బ్యాట్స్‌మన్‌ కోహ్లీనే. తొలి మూడు టెస్టుల్లో అయిదు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆఫ్‌ స్టంప్‌కు అవతల పడ్డ బంతిని ఆడి అతడు ఔటయ్యాడంటే సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వైఫల్యం నుంచి కోహ్లి బయటపడాలంటే వెంటనే సచిన్‌తో మాట్లాడలని సునీల్‌ గావస్కర్‌ సూచించాడు. 2004 సిడ్నీ టెస్టులో సచిన్‌ చూపించిన పట్టుదలను కోహ్లి అందుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు.

సచిన్‌ ఏం చేశాడంటే..: 2003-04 ఆస్ట్రేలియా పర్యటనలో తన తొలి అయిదు ఇన్నింగ్స్‌ల్లో సచిన్‌ వరుసగా 0, 1, 37, 0, 44 పరుగులు మాత్రమే చేశాడు. ఆఫ్‌ స్టంప్‌ ఆవల పడ్డ బంతులను ఆడడంలో బలహీనతతో విఫలమయ్యాడు. ఆ సమస్యను అధిగమించే దిశగా సిరీస్‌లో చివరిదైన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 613 నిమిషాల పాటు క్రీజులో నిలిచి 436 బంతులు ఎదుర్కొని అజేయంగా 241 పరుగులు చేసిన అతను.. ఆఫ్‌సైడ్‌ ఒక్క డ్రైవ్‌ కూడా ఆడకపోవడం విశేషం. దృఢ సంకల్పంతో ఆఫ్‌ స్టంప్‌కు దూరంగా వచ్చిన బంతులన్నింటినీ వదిలేశాడు.ఇప్పుడు జట్టులోని ప్రధాన బ్యాట్స్‌మెన్‌ సచిన్‌ ఫార్ములాను అనుసరించడం అవసరం. పరాజయం పాలైన ప్రతిసారి.. ‘విమర్శలు పట్టించుకోం.. ఎవరేమన్నా మా ఆట మాదే’ అన్నట్లు జట్టు వైఖరి ఉంటుంది. తమ తప్పులను ఎత్తిచూపే విమర్శలను ఆటగాళ్లు స్వీకరించాలి..  ఉత్తమ ప్రదర్శన చేసే దిశగా సాగాలి. సిరీస్‌ చేజారొద్దంటే ఆఫ్‌స్టంప్‌ సమస్యను పరిష్కరించుకోవడం అత్యవసరం.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన