పతకాభిషేకం
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 04/09/2021 04:39 IST

పతకాభిషేకం

హైజంప్‌లో ప్రవీణ్‌కు రజతం

మరో పతకం నెగ్గిన షూటర్‌ అవని

ఆర్చరీలో హర్విందర్‌కు కాంస్యం

టోక్యో

పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు మళ్లీ పతకాల బాట పట్టారు. మధ్యలో రెండు రోజులు విరామం ఇచ్చిన మన అథ్లెట్లు శుక్రవారం ముచ్చటగా మూడు పతకాలను పట్టేశారు. అథ్లెటిక్స్‌లో జోరును కొనసాగిస్తూ.. షూటింగ్‌లో దూకుడును ప్రదర్శిస్తూ.. ఆర్చరీలో పైచేయి సాధించారు. హైజంప్‌లో ప్రవీణ్‌.. వెండి కాంతులు పంచాడు. ఇక ఇప్పటికే ఓ పసిడి తెచ్చిపెట్టిన షూటర్‌ అవని గురి.. ఈ సారి కాంస్యాన్ని ముద్దాడింది. మరోవైపు హర్విందర్‌ సింగ్‌ ఆర్చరీలో కంచు మోగించాడు.

పారాలింపిక్స్‌ పురుషుల హైజంప్‌లో దేశానికి నాలుగో పతకం దక్కింది. ఇప్పటికే నిషాద్‌, మరియప్పన్‌ చెరో రజతం, శరద్‌ కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. తాజాగా టీ64 విభాగంలో ప్రవీణ్‌ కుమార్‌ వెండి పతకం సొంతం చేసుకున్నాడు. తొలిసారి పారాలింపిక్స్‌ బరిలో నిలిచిన ఈ 18 ఏళ్ల కుర్రాడు.. 2.07 మీటర్ల ఎత్తు దూకి సరికొత్త ఆసియా రికార్డును సృష్టిస్తూ పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. 2.07 మీటర్ల ఎత్తును రెండో ప్రయత్నంలో పూర్తి చేసిన అతను.. 2.10 మీటర్ల ప్రదర్శన అందుకోవడంలో విఫలమయ్యాడు. బ్రిటన్‌ అథ్లెట్‌ జొనాథన్‌ (2.10మీ) స్వర్ణం గెలుచుకోగా.. పోలెండ్‌కు చెందిన లెపియాటో (2.04మీ) కాంస్యం నెగ్గాడు.

అవని చరిత్ర: టోక్యోలో పారా షూటర్‌ అవని లెఖరా సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికే 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌1 విభాగంలో స్వర్ణం గెలిచి.. పారాలింపిక్స్‌లో పసిడి నెగ్గిన భారత తొలి మహిళగా నిలిచిన ఆమె తాజాగా మరో రికార్డునూ ఖాతాలో వేసుకుంది. 50మీ. రైఫిల్‌ 3 పొజిషన్స్‌ ఎస్‌హెచ్‌1 విభాగంలో కాంస్యం నెగ్గిన ఆమె.. పారాలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన భారత తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. అర్హత రౌండ్లో 1176 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌ చేరిన 19 ఏళ్ల అవని.. పతక పోరులో 445.9 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. జాంగ్‌ (చైనా- 457.9), హిల్‌ట్రాప్‌ (జపాన్‌- 457.1) వరుసగా స్వర్ణం, రజతం గెలిచారు.

బాణం తెచ్చిన కాంస్యం: పారాలింపిక్స్‌ ఆర్చరీలో దేశానికి తొలి పతకం అందించిన అథ్లెట్‌గా హర్విందర్‌ సింగ్‌ చరిత్ర లిఖించాడు. పురుషుల వ్యక్తిగత రికర్వ్‌ ఓపెన్‌ ఎస్టీ విభాగంలో అతని బాణం కాంస్యాన్ని ముద్దాడింది. హోరాహోరీగా సాగిన కంచు పతక పోరులో అతను 6-5 తేడాతో కిమ్‌ మిన్‌ (కొరియా)పై విజయం సాధించాడు. అయిదు సెట్ల పోరు ముగిసేసరికి ఇద్దరు ఆర్చర్లు 5-5 స్కోరుతో సమానంగా ఉండడంతో విజేతను తేల్చడానికి షూటాఫ్‌ నిర్వహించారు. ప్రత్యర్థి బాణం 8 పాయింట్ల దగ్గరే ఆగిపోగా.. 10 పాయింట్ల ఖాతాలో వేసుకున్న హర్విందర్‌ పతకం దక్కించుకున్నాడు. అంతకుముందు సెమీస్‌లో ఈ ప్రపంచ 23వ ర్యాంకర్‌ ఆర్చర్‌ 4-6తో కెవిన్‌ (యుఎస్‌) చేతిలో ఓడాడు.  

షట్లర్ల జోరు: పారా బ్యాడ్మింటన్‌లో భారత క్రీడాకారులు పతకాలకు చేరువయ్యారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ప్రమోద్‌- పలక్‌ జోడీ, పురుషుల సింగిల్స్‌లో సుహాస్‌, తరుణ్‌, మనోజ్‌, కృష్ణ సెమీస్‌లో అడుగుపెట్టారు. గ్రూప్‌- బి మ్యాచ్‌లో ప్రమోద్‌- పలక్‌ జంట 21-15, 21-19తో సిరిపాంగ్‌- నిపాడ (థాయ్‌లాండ్‌) జోడీపై గెలిచింది. పురుషుల ఎస్‌ఎల్‌4 సింగిల్స్‌ గ్రూప్‌- ఎ మ్యాచ్‌లో సుహాస్‌ 21-6, 21-12తో సుసాంటో (ఇండోనేషియా)పై గెలిచాడు. రెండో సీడ్‌ తరుణ్‌ గ్రూప్‌- బి మ్యాచ్‌లో 21-18, 15-21, 21-17తో షిన్‌ (కొరియా)పై నెగ్గాడు. పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌57 ఫైనల్లో సోమన్‌ రానా (13.81మీ) నాలుగో స్థానంలో నిలిచాడు. మహిళల క్లబ్‌ త్రో ఎఫ్‌51లో కాశిష్‌ లక్రా, భ్యాన్‌ ఎక్తా వరుసగా ఆరు, ఎనిమిది స్థానాలతో సరిపెట్టుకున్నారు.


13

పారాలింపిక్స్‌లో ప్రస్తుతం భారత్‌ ఖాతాలో ఉన్న పతకాల సంఖ్య. ఈ క్రీడలకు ముందు అన్ని పారాలింపిక్స్‌ల్లో కలిపి భారత్‌ 12 పతకాలు నెగ్గగా.. ఇప్పుడు ఈ ఒక్క పారాలింపిక్స్‌లో అంతకంటే ఎక్కువ పతకాలు గెలవడం విశేషం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన