ఇటా.. అటా!
Array ( [0] => stdClass Object ( [video_type] => 1 [video_short_link] => WFbnOKOW__s ) ) 1

ప్రధానాంశాలు

Updated : 06/09/2021 06:55 IST

ఇటా.. అటా!

ఆసక్తికరంగా నాలుగో టెస్టు

ఇంగ్లాండ్‌ లక్ష్యం 368; ప్రస్తుతం 77/0

రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ స్కోరు 466

మెరిసిన శార్దూల్‌, పంత్‌

ఆసక్తికరంగా ఓవల్‌లో పోరు. బ్యాటుతో బలంగా పుంజుకున్న టీమ్‌ఇండియా బలమైన స్థితిలో నిలిచింది. శార్దూల్‌, పంత్‌ జోడీ ఆశలు రేకెత్తించింది. అయినా సమతూకంగానే ఆట అయిదో రోజుకు చేరుకుంది. బ్యాటింగ్‌ మరింత తేలికైన నిర్జీవమైన పిచ్‌పై నాలుగో టెస్టు ఎలా ముగుస్తుందన్నది ఇంకా అంచనా వేయలేని పరిస్థితి. ఇంగ్లాండ్‌ కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. 368 పరుగుల లక్ష్యంలో ఆ జట్టు అప్పుడే 77 పరుగులు సాధించింది. చివరి రోజు నెగ్గాలంటే.. భారత్‌ 10 వికెట్లు తీయాలి! చేతిలో 10 వికెట్లున్న ఇంగ్లాండ్‌ 291 పరుగులు చేయాలి. మ్యాచ్‌ ఎటు తిరుగుతుందో మరి!

లండన్‌

టెస్టు మ్యాచ్‌లో మూడొందలపై లక్ష్యాన్ని ఛేదించడం చాలా కష్టమని రికార్డులు చెబుతున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితులేమో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టు ఆసక్తికర ముగింపు దిశగా సాగుతోంది. అద్భుత పోరాటంతో మ్యాచ్‌లో కోహ్లీసేన పటిష్ట స్థితిలో నిలిచినా.. ఆతిథ్య జట్టు అవకాశాలనూ కొట్టిపారేసే పరిస్థితి లేదు. 368 పరుగుల భారీ విజయ లక్ష్యంతో నాలుగో రోజు, ఆదివారం బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌.. ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. ఓపెనర్లు హమీద్‌ (43 బ్యాటింగ్‌), బర్న్స్‌ (31 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 270/3తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌.. 466 పరుగులకు ఆలౌటైంది. 367 పరుగుల ఆధిక్యం సంపాదించింది. శార్దూల్‌ (60; 72 బంతుల్లో 7×4, 1×6), పంత్‌ (50; 106 బంతుల్లో 4×4)ల పోరాటం భారత్‌ను మెరుగైన స్థితిలో నిలిపింది.

ఉదయం టపా టపా: రోజు ముగిసేసరికి టీమ్‌ ఇండియా పటిష్టమైన స్థితిలో నిలిచి ఉండొచ్చు. కానీ ఉదయం సెషన్లో పరిస్థితి భిన్నం. చకచకా వికెట్లు తీసిన ఇంగ్లాండ్‌.. బలంగా పోటీలోకి వచ్చినట్లనిపించింది. మూడో రోజు ఆట చివరికి భారత్‌ ఆధిక్యం 171. ముప్పు పొంచే ఉంది. అయితే చేతిలో ఏడు వికెట్లు ఉండడంతో మంచి స్కోరు సాధించేందుకు చక్కని అవకాశం ఉంది. కానీ తడబాటుతో ఆ అవకాశాన్ని టీమ్‌ ఇండియా చేజార్చుకున్నట్లే కనిపించింది. ఎందుకంటే ఓవర్‌నైట్‌ స్కోరు 270/3తో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆ జట్టు.. లంచ్‌ వేళకు 329/6తో నిలిచింది. కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. జడేజా (ఓవర్‌నైట్‌ 9)తో కలిసి ఇన్నింగ్స్‌ కొనసాగించిన కోహ్లి (ఓవర్‌నైట్‌ 22) చాలా సౌకర్యంగా బ్యాటింగ్‌ చేశాడు. అండర్సన్‌ బౌలింగ్‌లో చక్కని కవర్‌డ్రైవ్‌ ఆడాడు. కోహ్లి (44) నియంత్రణలో ఉన్నట్లు కనిపించాడు. జడేజా (17) మాత్రం అలా కనపడలేదు. ఎక్కువగా బంతులు వదిలేయడానికి ప్రాధాన్యమిచ్చి.. పరుగులు రాబట్టే పనిని కోహ్లీకి వదిలేశాడు. చివరికి వోక్స్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇక పేలవ ఫామ్‌లో ఉన్న రహానె ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఎనిమిది బంతులే ఆడిన అతడు.. ఆ కొద్దిసేపూ ఇబ్బంది పడ్డాడు. ఓసారి సమీక్షలో బతికిపోయిన అతడు.. ఖాతా అయినా తెరవకుండానే వోక్స్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. సమీక్ష కోరవచ్చా అని కోహ్లీని అడిగితే అతడు వద్దన్నాడు. ఇక ఈ వైఫల్యం తర్వాత రహానె తుది జట్టులో స్థానం నిలుపుకోవడం దాదాపుగా అసాధ్యమే. 5, 1, 61, 18, 10, 14, 0.. ఇవి సిరీస్‌లో అతడి స్కోర్లు. కాసేపటి తర్వాత కోహ్లి కూడా వెనుదిరిగాడు. మొయిన్‌ అలీ తన తొలి ఓవర్లోనే భారత్‌ను దెబ్బతీశాడు. ఆఫ్‌స్టంప్‌ లైన్‌లో బంతిని ఆడిన కోహ్లి.. ఎడ్జ్‌తో స్లిప్‌లో ఒవర్టన్‌ చేతికి చిక్కాడు. మిడిల్‌ ఆర్డర్‌ మరోసారి తడబడిన వేళ, ఓ దశలో 296/3తో ఉన్న భారత్‌.. 10 ఓవర్ల వ్యవధిలో 312/6కు చేరుకుంది.

నిలిచిన ఆ ఇద్దరు: కెప్టెన్‌ కోహ్లి వికెట్‌ సహా మూడు వికెట్లను త్వరగా చేజిక్కించుకున్న ఇంగ్లాండ్‌.. ఇక భారత్‌ను చుట్టేయొచ్చని భావించే ఉంటుంది. 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కష్టమేమీ కాదని కొందరు వ్యాఖ్యాతలు అంటున్న నేపథ్యంలో ఆతిథ్య జట్టు మంచి స్థితిలో నిలిచినట్లనిపించింది. అయితే ఆ దశలో పంత్‌, శార్దూల్‌ ఠాకూర్‌  విలువైన భాగస్వామ్యం (100)తో జట్టును బలమైన స్థితిలో నిలిపారు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో వీరోచిత ఆటతో జట్టును ఆదుకున్న శార్దూల్‌ మరోసారి అదరగొట్టాడు. దూకుడుగా, అలవోకగా బ్యాటింగ్‌ చేశాడు. స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌లా చక్కని క్రికెటింగ్‌ షాట్లలో అలరించాడు. అతడి స్ట్రెయిట్‌ డ్రైవ్‌లను చూసి తీరాల్సిందే. రోహిత్‌ శర్మ అంత చక్కగా ఆడాడు అతడా షాట్లను. బంతి ఏమాత్రం గతి తప్పినా శిక్షించాడు. రాబిన్సన్‌ స్లో బంతిని లాంగాన్‌లో సిక్స్‌గా మలిచి 49కి చేరుకున్న శార్దూల్‌.. ఓ సింగిల్‌తో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు పంత్‌ మాత్రం స్వభావానికి విరుద్ధంగా శాంతంగా బ్యాటింగ్‌ చేశాడు.  బంతిని బట్టి షాట్లు ఆడాడు. క్రమంగా అతడు కూడా కొన్ని బౌండరీలు రాబట్టాడు. ఓ దశలో భారత్‌ 412/7తో నిలిచింది. అయితే రెండు పరుగుల తేడాతో నిలదొక్కుకున్న బ్యాట్స్‌మెన్‌ ఇద్దరూ ఔటయ్యారు. రూట్‌ బౌలింగ్‌లో శార్దూల్‌ ఔట్‌ కాగా, గేర్‌ మార్చి ధాటిగా ఆడబోయిన పంత్‌,.. అలీకి రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. అయితే ఇంగ్లాండ్‌ బౌలర్ల బాధలు అక్కడితో ఆగిపోలేదు. ఉమేశ్‌ యాదవ్‌ (25), బుమ్రా (24) కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో భారత్‌ మరో 52 పరుగులు జోడించగలిగింది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 191
ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 290

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) వోక్స్‌ (బి) రాబిన్సన్‌ 127; రాహుల్‌ (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్‌ 46; పుజారా (సి) అలీ (బి) రాబిన్సన్‌ 61; కోహ్లి (సి) ఒవర్టన్‌ (బి) అలీ 44; జడేజా ఎల్బీ (బి) వోక్స్‌ 17; రహానె ఎల్బీ (బి) వోక్స్‌ 0; పంత్‌ (సి) అండ్‌ (బి) అలీ 50; శార్దూల్‌ (సి) ఒవర్టన్‌ (బి) రూట్‌ 60; ఉమేశ్‌ యాదవ్‌ (సి) అలీ (బి) ఒవర్టన్‌ 25; బుమ్రా (సి) అలీ (బి) వోక్స్‌ 24; సిరాజ్‌ నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (148.2 ఓవర్లలో ఆలౌట్‌) 466

వికెట్ల పతనం: 1-83, 2-236, 3-237, 4-296, 5-296, 6-312, 7-412, 8-414, 9-450

బౌలింగ్‌: అండర్సన్‌ 33-10-79-1; రాబిన్సన్‌ 32-7-105-2; వోక్స్‌ 32-8-83-3; ఒవర్టన్‌ 18.2-3-58-1; మొయిన్‌ అలీ 26-0-118-2; రూట్‌ 7-1-16-1

ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: బర్న్స్‌ బ్యాటింగ్‌ 31; హమీద్‌ బ్యాటింగ్‌ 43; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (32 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 77

బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 6-2-13-0; బుమ్రా 7-3-11-0; జడేజా 13-4-28-0; సిరాజ్‌ 6-0-24-0
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన