మెరుపులు మళ్లీ మొదలు
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 19/09/2021 10:28 IST

మెరుపులు మళ్లీ మొదలు

ఐపీఎల్‌-14 రెండో అంచె నేటి నుంచే

తొలి పోరులో ముంబయితో చెన్నై ఢీ

దుబాయ్‌

ధనాధన్‌ బ్యాటింగ్‌.. పదునైన బౌలింగ్‌.. అద్భుతమైన ఫీల్డింగ్‌ విన్యాసాలు.. కళ్లు చెదిరే క్యాచ్‌లు.. అలవోకగా స్టాండ్స్‌లో పడే బంతులు.. ఇలా మళ్లీ బౌండరీల జోరును.. వికెట్ల వేటను ఆస్వాదిస్తూ సంబరాల్లో మునిగిపోయేందుకు సిద్ధమైపోండి. ఎందుకంటే.. ఎన్నో సందేహాలను, అడ్డంకులను దాటుకుని ఐపీఎల్‌ 14వ సీజన్‌ మళ్లీ అభిమానులను అలరించేందుకు వచ్చేసింది. కరోనా కారణంగా మేలో భారత్‌లో అర్ధంతరంగా ఆగిపోయిన సీజన్‌.. ఇప్పుడు యూఈఏలో సరికొత్తగా కొనసాగేందుకు సమయం ఆసన్నమైంది. ఆదివారం ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌తో రెండో అంచె పోటీలకు తెరలేవనుంది. రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోరు ఆసక్తి రేపుతోంది. హోరాహోరీగా సాగే ఈ మ్యాచ్‌తో రెండో  దశ  సీజన్‌కు గొప్ప ఆరంభం ఖాయం!

పీఎల్‌ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లయిన.. ముంబయి  ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌తో 14వ సీజన్‌ రెండో దశ  ఆరంభమవుతుంది. ఇప్పటికే అయిదు సార్లు టైటిల్‌ గెలుచుకున్న ముంబయి ఓ వైపు.. మూడు సార్లు విజేతగా  నిలిచిన చెన్నై మరో వైపు. అన్ని  విభాగాల్లోనూ సమతూకంగా కనిపిస్తున్న ఈ జట్లలో విజయం ఎవరిదో అన్న ఆసక్తి నెలకొంది. సీజన్‌ తొలి దశలో ఏడు మ్యాచ్‌ల్లో అయిదు విజయాలతో 10 పాయింట్లు సాధించిన చెన్నై పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి 8 పాయింట్లతో ముంబయి నాలుగో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ నాలుగు వికెట్ల తేడాతో చెన్నైపై గెలిచింది. ఆ మ్యాచ్‌లో పొలార్డ్‌    (34 బంతుల్లో 87) సృష్టించిన విధ్వంసం ఎప్పటికీ గుర్తుండిపోయేదే!  


జోరు కొనసాగేనా..

భారత్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన సీఎస్కే.. ఫ్లేఆఫ్‌కు చేరువలో ఉంది. యూఏఈ పిచ్‌లకు ఆ జట్టు ఆటగాళ్లు త్వరగా అలవాటు పడటం కీలకం. గతేడాది ఇక్కడే జరిగిన టోర్నీలో ఆ జట్టు పేలవ ప్రదర్శనతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈసారి ధోని బ్యాటుతో రాణించడం కీలకం. ఆ జట్టులో మొయిన్‌ అలీ, రైనా, జడేజా, దీపక్‌ చాహర్‌లపై మంచి అంచనాలున్నాయి.


కలిసొచ్చిన చోట..

14వ సీజన్‌ తొలి దశలో ముంబయి ఇండియన్స్‌ ప్రయాణం ఒడుదొడుకులతో సాగింది. ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, మూడు ఓటములతో ఉన్న ఆ జట్టు.. తమకు కలిసొచ్చిన యూఏఈలో పుంజుకోవాలని ఆశిస్తోంది. అయిదు సార్లు టైటిల్‌ అందించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సారథ్యంలో స్టార్‌ ఆటగాళ్లతో ఆ జట్టు కళకళలాడుతోంది.రోహిత్‌కు తోడు సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషాన్‌, పొలార్డ్‌, పాండ్య సోదరులు,  బుమ్రా, బౌల్ట్‌.. ఇలా నాణ్యమైన ఆటగాళ్లు ఆ జట్టు  సొంతం. తుది జట్టులో ముంబయి ఎవరెవరిని  ఆడిస్తుందన్నది ఆసక్తికరం.


పిచ్‌ ఎలా ఉంది?

దుబాయ్‌లో అధిక ఉష్ణోగ్రత ఆటగాళ్లకు సవాలు విసరనుంది. మొదట్లో పేసర్లకు అనుకూలించే పిచ్‌.. ఆ తర్వాత స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉంది. టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపే ఆస్కారముంది.


జట్లు (అంచనా)

చెన్నై: రుతురాజ్‌, మొయిన్‌ అలీ, రైనా, రాయుడు, జడేజా, బ్రావో, ధోని, శార్దూల్‌, దీపక్‌ చాహర్‌, తాహిర్‌, ఎంగిడి/హేజిల్‌వుడ్‌
ముంబయి: రోహిత్‌, డికాక్‌, సూర్యకుమార్‌, ఇషాన్‌, పొలార్డ్‌, హార్దిక్‌, కృనాల్‌, మిల్నె/కౌల్టర్‌నైల్‌, జయంత్‌/రాహుల్‌, బౌల్ట్‌, బుమ్రా


3

టీ20 క్రికెట్లో 400 సిక్సర్లు కొట్టిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచేందుకు రోహిత్‌ శర్మకు అవసరమైన సిక్సర్లు. ప్రస్తుతం అతని ఖాతాలో 397 సిక్సర్లున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన