సురేఖ.. రజత ధమాకా
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 26/09/2021 02:31 IST

సురేఖ.. రజత ధమాకా

మూడు పతకాలతో సంచలనం
ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌
చరిత్ర సృష్టించిన తెలుగు ఆర్చర్‌

తెలుగమ్మాయి జ్యోతి సురేఖ బాణానికి తిరుగులేదు. ఒకే ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు పతకాలు సురేఖ ఖాతాలో చేరాయి. పసిడి అందకపోయినా..  ఆమె విల్లు.. వెండి వెలుగులు పంచింది. దేశంలో ఇప్పటివరకూ  మరే ఆర్చర్‌కు సాధ్యం కాని దాన్ని ఆమె అందుకుంది. ఒకే ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మూడు రజతాలతో చరిత్ర సృష్టించింది. ఆ ఘనత సాధించిన తొలి భారత ఆర్చర్‌గా రికార్డు నమోదు చేసింది. కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంతో పాటు మహిళల జట్టు, మిక్స్‌డ్‌ టీమ్‌లోనూ ఆమె రజతాలు సొంతం చేసుకుంది.

యాంక్టాన్‌

ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో సురేఖ  పతకాల పంట పండించింది. పోటీపడిన మూడు విభాగాల్లోనూ సత్తాచాటింది. కాంపౌండ్‌ మహిళల వ్యక్తిగత విభాగంతో పాటు మహిళల జట్టు, మిక్స్‌డ్‌ టీమ్‌లోనూ రజతాలు సొంతం చేసుకుంది. ఈ మూడు విభాగాల్లోనూ భారత ఆర్చర్లు కొలంబియా చేతిలోనే ఓడిపోయారు. శనివారం వ్యక్తిగత విభాగం ఫైనల్లో సురేఖ 144-146 తేడాతో సారా లోపెజ్‌ చేతిలో పరాజయం పాలైంది. టాప్‌ సీడ్‌ ప్రత్యర్థితో పోరులో ఆరో సీడ్‌ సురేఖ గట్టి పోటీనే ఇచ్చినప్పటికీ ఆధిక్యం మాత్రం సాధించలేకపోయింది. తొలి సెట్‌లో 29-28తో ఒక పాయింట్‌ వెనకబడ్డ సురేఖ.. రెండో సెట్లో 29-29తో సమం చేసి పుంజుకున్నట్లు కనిపించింది. కానీ ఆ తర్వాత మూడు సెట్లలోనూ ప్రత్యర్థిని అందుకోలేకపోయింది. కాంపౌండ్‌ మహిళల జట్టు పసిడి పోరులో ఏడో సీడ్‌ భారత్‌ 224-229 తేడాతో టాప్‌ సీడ్‌ కొలంబియా చేతిలో ఓడింది. సురేఖ, ముస్కాన్‌, ప్రియలతో కూడిన భారత్‌.. తొలి సెట్‌ను 58-58తో సమం చేసి ప్రత్యర్థికి దీటుగా నిలిచింది. కానీ రెండో సెట్‌ నుంచి పైచేయి సాధించలేకపోయింది. చివరి రెండు సెట్లలో కొలంబియా ఆర్చర్లు 12 బాణాలకు గాను ఎనిమిది సార్లు పది పాయింట్లు సాధించగా.. భారత్‌ ఆరు సార్లే ఆ లక్ష్యాన్ని చేరుకుంది. ఇక మిక్స్‌డ్‌ టీమ్‌లో అయిదో సీడ్‌ అభిషేక్‌ వర్మ- సురేఖ జోడీ 150-154తో మునోజ్‌- లోపెజ్‌ చేతిలో ఓడింది. తొలి సెట్లో    39-38తో మంచి ఆరంభాన్ని దక్కించుకున్న భారత ద్వయం.. ఆ తర్వాత స్థాయికి  తగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోయింది. ముఖ్యంగా మూడో సెట్లో భారత్‌ 36-40తో దెబ్బతింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మిక్స్‌డ్‌ విభాగంలో దేశానికిదే తొలి పతకం.


ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మూడు రజతాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. పోటీపడిన ప్రతి విభాగంలోనూ పతకం సాధించడం గొప్పగా అనిపిస్తోంది. కానీ మూడు విభాగాల్లోనూ పసిడికి అడుగు దూరంలో ఆగిపోవడం నిరాశ కలిగిస్తోంది. టాప్‌సీడ్‌ కొలంబియా ఆర్చర్లు మాకు.. స్వర్ణాలకు అడ్డుగా నిలిచారు. వ్యక్తిగత విభాగంలోనైనా పసిడి అందుకోవాలని గట్టిగానే ప్రయత్నించా కానీ ప్రత్యర్థి నా కంటే మెరుగ్గా ఆడింది. మహిళల జట్టులో ముస్కాన్‌, ప్రియాలతో నాకు మంచి అవగాహన కుదిరింది. ఇక మిక్స్‌డ్‌ టీమ్‌లో అభిషేక్‌తో చాలా కాలం నుంచి ఆడుతున్నా. ఈ సారి రెండో స్థానానికే పరిమితమయ్యా.. కానీ ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలనే నా లక్ష్యాన్ని చేరుకునే దిశగా ప్రయత్నిస్తూనే ఉంటా’’

- అమెరికా నుంచి ‘ఈనాడు’తో సురేఖ


1

ఒకే ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మూడు రజతాలు సాధించిన తొలి భారత ఆర్చర్‌ సురేఖ. ఈ టోర్నీ చరిత్రలో వ్యక్తిగత, జట్టు, మిక్స్‌డ్‌ విభాగాల్లో పతకాలు సాధించిన ఏకైక భారత్‌ ఆర్చర్‌ ఆమెనే.


6

ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో సురేఖ పతకాల సంఖ్య ఆరుకు చేరింది. 2017లో టీమ్‌ రజతం, 2019లో వ్యక్తిగత, టీమ్‌ కాంస్యాలు, ఇప్పుడేమో మూడు వెండి పతకాలు.


11

ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో ఇప్పటివరకూ భారత్‌ సాధించిన పతకాలు. అందులో ఏడు పతకాలు కాంపౌండ్‌ విభాగంలో రాగా.. అందులో ఆరు పతకాల్లో సురేఖ భాగస్వామ్యం ఉండడం విశేషం.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన