IPL: వేల కోట్ల వందనం
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 26/10/2021 05:59 IST

IPL: వేల కోట్ల వందనం

బీసీసీఐ పంట పండింది

లఖ్‌నవూ రూ.7090కోట్లు (ఆర్పీఎస్జీ గ్రూప్‌)

అహ్మదాబాద్‌ రూ.5625 కోట్లు (సీవీసీ)

రెండు ఫ్రాంఛైజీలతో రూ. 12715 కోట్లు

వచ్చే ఏడాది నుంచి పది జట్లతో ఐపీఎల్‌

దుబాయ్‌

అది 2008.. ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఆరంభించాలని బీసీసీఐ సన్నాహాలు.. అందులో పాల్గొనే జట్ల కోసం ఆహ్వానించిన బిడ్లలో గరిష్ఠంగా ముంబయి ఇండియన్స్‌ రూ.535 కోట్లు పలికింది. అప్పుడా ధర చూసి అందరిలో ఆశ్చర్యం. కానీ ఇప్పుడా ఆశ్చర్యం అనే పదమే చిన్నబోయేలా.. ఒక జట్టు కోసం ఇంత చెల్లిస్తారా? అని నమ్మడానికి సమయం పట్టేలా.. కొత్త ఫ్రాంఛైజీల కోసం సంస్థలు రూ.వేల కోట్లు కుమ్మరించాయి. లఖ్‌నవూ జట్టు కోసం ఆర్పీఎస్జీ గ్రూప్‌ రూ.7,090 కోట్లు.. అహ్మదాబాద్‌ ఫ్రాంఛైజీ కోసం సీవీసీ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ రూ.5,625 కోట్లు చెల్లించాయి. ఇలా కేవలం రెండు జట్లకే కలిపి రూ.12 వేల కోట్లకు పైగా రావడం సంచలనమే. క్రికెట్‌ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న ఐపీఎల్‌ విలువ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. ఇక వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌లో పది జట్లు టైటిల్‌ పోరులో తలపడనున్నాయి.

పీఎల్‌ అంటే కాసుల పంట.. ఆటగాళ్లకు మాత్రమే కాదు.. బీసీసీఐకి కూడా. ప్రపంచంలో బీసీసీఐని అత్యంత ధనిక బోర్డుగా మార్చిన ఈ టీ20 లీగ్‌ ఇంకో 12715 కోట్ల రుపాయాలను ఖజానాలో చేర్చింది. రెండు కొత్త ఫ్రాంఛైజీల కోసం ఆర్పీ-ఎస్జీ వెంచర్స్‌ లిమిటెడ్‌, ఇరెలియా కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (సీవీసీ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌) ఈ మొత్తం చెల్లించి లఖ్‌నవూ, అహ్మదాబాద్‌ ఫ్రాంఛైజీలను సొంతం చేసుకున్నాయి. లఖ్‌నవూ ఫ్రాంఛైజీ కోసం ఆర్పీఎస్జీ గ్రూప్‌ అత్యధికంగా రూ. 7090 కోట్ల బిడ్‌ వేయగా.. అహ్మదాబాద్‌ కోసం ఇరెలియా కంపెనీ రూ. 5625 కోట్ల విజయవంతమైన బిడ్‌ వేసింది. ఫ్రాంఛైజీ సొంతం చేసుకునేందుకు బీసీసీఐ రూ. 2000 కోట్లను కనీస బిడ్‌గా పేర్కొనగా ఆర్పీఎస్జీ 350 శాతం, సీవీసీ 250 శాతం అధికంగా బిడ్‌ వేయడం విశేషం.

9 సంస్థలు పోటీ..: రెండు ఫ్రాంఛైజీల కోసం తొమ్మిది పార్టీలు పోటీలో నిలిచాయి. మొత్తం ఆరు వేదికలు.. అహ్మదాబాద్‌, లఖ్‌నవూ, కటక్‌, ధర్మశాల, గువాహటి, ఇండోర్‌ కోసం బీసీసీఐ బిడ్డింగ్‌ నిర్వహించగా.. అహ్మదాబాద్‌, లఖ్‌నవూ కోసం అన్ని పార్టీలు బిడ్‌ వేశాయి. ఆర్పీఎస్జీ గ్రూప్‌ అహ్మదాబాద్‌, లఖ్‌నవూ కోసం రూ. 7090 కోట్లతో అత్యధిక బిడ్‌ వేసింది. ఆ తర్వాత ఇరెలియా కంపెనీ 5625 కోట్లతో అహ్మదాబాద్‌ కోసం రెండో అత్యధిక బిడ్‌ వేసింది. ఆర్పీఎస్జీ లఖ్‌నవూను ఫ్రాంఛైజీగా ఎంపిక చేసుకోవడంతో ఇరెలియాకు అహ్మదాబాద్‌ సొంతమైంది. ఐపీఎల్‌ జట్టు రేసులో ముందు వరుసలో కనిపించిన అదాని గ్రూపు అధినేత గౌతమ్‌ అదానికి చుక్కెదురైంది. రూ.5,100 కోట్లు బిడ్‌ చేసిన అదాని గ్రూపు ఏ ఫ్రాంఛైజీని దక్కించుకోలేకపోయింది. మాంచెస్టర్‌ యునైటెడ్‌ యాజమాన్యం, టొరెంట్‌ గ్రూపు కూడా బిడ్‌ రేసులో వెనుకబడ్డాయి. అహ్మదాబాద్‌ కోసం రూ. 4653 కోట్లతో బిడ్‌ వేసిన టొరెంట్‌ గ్రూపు.. లఖ్‌నవూ కోసం రూ. 4356 కోట్లను కోట్‌ చేసింది. అమ్రిత్‌ లీలా ఎంటర్‌ప్రైజెస్‌, అవశ్య కార్పోరేషన్‌, క్యాప్రి గ్లోబల్‌, ఛాంపియన్‌షిప్‌ క్రికెట్‌ ఎల్‌ఎల్‌సీ, హిందుస్థాన్‌ మీడియా వెంచర్స్‌ లిమిటెడ్‌ కూడా పోటీలో నిలిచాయి. మొత్తం 20 పార్టీలు ఆసక్తి ప్రదర్శించగా 3000 కోట్ల టర్నోవర్‌ ఉండాలన్న నిబంధనను చాలా సంస్థలు అందుకోలేకపోయాయి.

10 జట్లు 74 మ్యాచ్‌లు: వచ్చే సీజన్‌లో పాల్గొనే రెండు కొత్త జట్లేవో తేలిపోవడంతో ఫార్మాట్‌ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా ఐపీఎల్‌లో 10 జట్లు బరిలో దిగాయి. అయితే 2022 ఐపీఎల్‌ను 2011 పద్ధతిలో నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయని.. ప్రతి జట్టు ఇంటా బయట ఏడేసి మ్యాచ్‌లు ఆడుతుందని బోర్డు తెలిపింది. ఇటీవల ముగిసిన సీజన్‌లో మొత్తం 60 మ్యాచ్‌లు నిర్వహించారు. 2011 సీజన్‌లో 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. లీగ్‌లో 70, ప్లేఆఫ్‌లో 4 మ్యాచ్‌లు జరిగాయి. లీగ్‌ దశలో అన్ని జట్లు 14 మ్యాచ్‌లు ఆడాయి. అత్యధిక పాయింట్లు సాధించిన 4 జట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించాయి.

వేలంపై ప్రభావం: 2022 ఐపీఎల్‌కు ముందు జరిగే ఆటగాళ్ల మెగా వేలం పాటపై రెండు కొత్త జట్ల ప్రభావం ఎలా ఉంటుందన్న చర్చలు అప్పుడే మొదలయ్యాయి. 8 ఫ్రాంచైజీలు గరిష్టంగా నలుగురు ఆటగాళ్ల (ముగ్గురు స్వదేశీ, ఇద్దరు విదేశీ)ను అట్టిపెట్టుకోవచ్చని ఇటీవల ఊహాగానాలు వినిపించినా బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరించలేదు. అదే జరిగితే కొత్త జట్లకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆయా జట్లలో ఉన్న సారథుల్ని, స్టార్‌ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకుంటాయి. అప్పుడు కొత్త ఫ్రాంచైజీలకు జట్ల తయారీ కష్టమవుతుంది. దేశ, విదేశీ స్టార్‌ ఆటగాళ్లు దొరక్కపోవచ్చు. సారథుల ఎంపిక కష్టమవుతుంది. దీనిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


ఆటలపై ఆసక్తి

సంజీవ్‌ గోయెంకాకు చెందిన ఆర్పీఎస్‌జీ గ్రూప్‌నకు ఆటలపై ఆసక్తి ఎక్కువే. క్రీడల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌లో ఆడే ప్రముఖ ఏటీకే మోహన్‌ బగాన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌కు ప్రధాన యజమాని ఈ సంస్థనే. మరోవైపు ఫిక్సింగ్‌ కారణంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌పై రెండేళ్ల నిషేధం అమల్లో ఉన్న సమయంలో లీగ్‌లో ఆడిన రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌ కూడా ఈ సంస్థదే. 2016, 2017 సీజన్లలో ఆ జట్టు ఐపీఎల్‌లో ఆడింది.


ప్రచారం కల్పిస్తూ..

సీవీసీ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌.. ఐరోపా, ఆసియా విపణిలో వాలీబాల్‌, రగ్బీ యూనియన్స్‌, ఫార్ములా వన్‌, మోటో జీపీకి ప్రచారం కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. లక్సెంబర్గ్‌కు చెందిన ఈ సంస్థ 1998లో మోటో జీపీ బ్రాండ్‌ డోర్నాను కొనుగోలు చేసి 2006లో 700 శాతం లాభానికి అమ్మేసింది. సీవీసీతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రముఖ ఫుట్‌బాల్‌ లీగైన లా లిగా అంగీకరించింది. ఫార్ములా వన్‌ సర్క్యూట్‌లో, రగ్బీలోనూ పెద్ద మొత్తంలోనే పెట్టుబడులు పెట్టింది.


‘‘ఐపీఎల్‌లో వచ్చే సీజన్‌ నుంచి రెండు కొత్త జట్లకు స్వాగతం పలికేందుకు సంతోషంగా ఉంది. కొత్త ఫ్రాంఛైజీలు సొంతం చేసుకున్న సంస్థలకు అభినందనలు. ఐపీఎల్‌ ఇప్పుడిక రెండు కొత్త నగరాలకు వెళ్లనుంది. ఈ జట్ల కోసం ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రావడం గొప్పగా ఉంది. ఇది మన క్రికెట్‌ విలువను చాటుతోంది. ఈ కొత్త జట్ల ద్వారా మరింత మంది దేశవాళీ ఆటగాళ్లు ప్రపంచ స్థాయి ఆటను ఆడే అవకాశం దక్కుతుంది. భారత్‌ బయట నుంచి కూడా జట్ల కోసం బిడ్లు వచ్చాయి’’

- సౌరభ్‌ గంగూలీ


‘‘ఆర్పీఎస్‌జీ, సీవీసీ సంస్థలకు స్వాగతం. లఖ్‌నవూ, అహ్మదాబాద్‌ చేరికతో 15వ సీజన్‌ నుంచి ఐపీఎల్‌ మరింత భారీగా, ఉత్తమంగా ఉండబోతుందని మాటిస్తున్నా’’

- జై షా


‘‘ఇప్పుడు మేం కొనుగోలు చేసిన ఫ్రాంఛైజీ విలువ వచ్చే పదేళ్లలో మేం పెట్టిన పెట్టుబడి కంటే ఎన్నో రెట్లు పెరుగుతుందని నమ్మాం. కొంత కాలం నుంచే జట్టును సొంతం చేసుకోవాలని అనుకుంటున్నా. ఇప్పుడా అవకాశం వచ్చింది. తిరిగి ఐపీఎల్‌లో     అడుగుపెట్టడం బాగుంది. ఇది తొలి అడుగు మాత్రమే. మంచి జట్టును నిర్మించి ఉత్తమ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది’’

- సంజీవ్‌ గోయెంకా


15

ఇప్పుడు కొత్తగా రెండు జట్లు ఐపీఎల్‌లో చేరడంతో.. ఇప్పటివరకు ఐపీఎల్‌ ఆడిన, ఆడబోతున్న జట్ల సంఖ్య 15కు చేరింది. ఆర్థిక కారణాలతో డెక్కన్‌ ఛార్జర్స్‌ (2008-2012), కోచి టస్కర్స్‌ కేరళ (2011), పుణె వారియర్స్‌ (2011-2013) లీగ్‌కు దూరమయ్యాయి. చెన్నై, రాజస్థాన్‌పై రెండేళ్ల (2016, 2017) నిషేధం పడటంతో ఆ రెండు జట్ల స్థానంలో రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌, గుజరాత్‌ లయన్స్‌ వచ్చాయి. రెండు సీజన్‌ల తర్వాత ఒప్పంద కాలం పూర్తవడంతో కొత్త ఫ్రాంచైజీలు రద్దయ్యాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన