T20 World Cup: ఇది నయా పాకిస్థాన్‌
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 28/10/2021 07:22 IST

T20 World Cup: ఇది నయా పాకిస్థాన్‌

ఫోర్త్‌ అంపైర్‌

పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టంటేనే అనిశ్చితికి మారు పేరు. కానీ టీ20 ప్రపంచకప్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు ప్రదర్శన చూశాక.. ఇన్నాళ్లూ మనం చూసిన పాకిస్థాన్‌ ఇదేనా అనిపిస్తోంది. ఆ జట్టు పట్టుదలగా, ఇంత ఆత్మవిశ్వాసంతో ఆడి చాలా కాలం అయిపోయింది. ఉన్నట్లుండి వచ్చిన ఈ మార్పు చూసి క్రికెట్‌ ప్రపంచం విస్మయానికి గురవుతోంది. 90వ దశకంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ వైభవం గురించి అందరికీ తెలిసిందే. ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలో సమష్టిగా సత్తా చాటిన ఆ జట్టు 1992 ప్రపంచకప్‌ గెలవడమే కాక.. ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యాన్ని చలాయించిందా జట్టు. ఇమ్రాన్‌ జట్టులో నెలకొల్పిన సంస్కృతి ఆ తర్వాత కూడా కొనసాగింది. అతడి నిష్క్రమణ అనంతరం కూడా అక్రమ్‌, వకార్‌, ఇంజమామ్‌, అన్వర్‌, యూసుఫ్‌ లాంటి దిగ్గజాలతో కూడిన జట్టు ఎంతో ప్రమాదకరంగా కనిపించేది. నిలకడగా ఆడేది.

కానీ ఈ దిగ్గజాలు ఒక్కొక్కరే నిష్క్రమించడం, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కుంభకోణాలు, పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డులో అవ్యవస్థ, రాజకీయాలు.. లాంటి కారణాలతో ఆ జట్టు గతి తప్పింది. 2007 ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యానంతరం ఆ జట్టు మరింత క్షీణించింది. ఎప్పటికప్పుడు ప్రతిభావంతులైన క్రికెటర్లు జట్టులోకి వస్తున్నా.. వారిని సరైన దారిలో నడిపించే.. జట్టుకు, పాకిస్థాన్‌ క్రికెట్‌కు దిశా నిర్దేశం చేసేవారు కరవై ఆ జట్టు ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా తయారైంది. సెలక్షన్‌ కమిటీలో రాజకీయాల కారణంగా పదే పదే జట్టును, కెప్టెన్లను మార్చడం కూడా పాకిస్థాన్‌ జట్టులో అనిశ్చితికి దారి తీసింది. అలాగని పాక్‌ ప్రదర్శన పూర్తిగా పడిపోలేదు. ఎప్పటికప్పుడు జట్టులోకి ప్రతిభావంతులు వస్తుండటంతో అడపాదడపా మంచి విజయాలే సాధించిందా జట్టు. కాకపోతే నిలకడ అన్నదే లేకపోయింది. ఇప్పుడు ప్రపంచకప్‌లో ఆ జట్టులో కనిపిస్తోంది అదే.

ఒకప్పుడు ఛేదన అంటేనే తడబడిపోయే, ఒత్తిడికి గురయ్యే జట్టుగా పాకిస్థాన్‌కు పేరుండేది. ఒకట్రెండు వికెట్లు పడ్డాయంటే మంచి స్థితి నుంచి ఒకేసారి కుప్పకూలిపోయి మ్యాచ్‌లు చేజార్చుకోవడం ఆ జట్టుకు అలవాటు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. కానీ ఈ ప్రపంచకప్‌లో మాత్రం దీనికి భిన్నమైన దృశ్యాలు కనిపించాయి. భారత్‌పై 150 పైచిలుకు లక్ష్యాన్ని ఆ జట్టు వికెట్‌ కోల్పోకుండా ఛేదించడం అనూహ్యం. భారత బౌలర్లు ఎంతగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా పాక్‌ ఓపెనర్లు లొంగలేదు. ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 69 పరుగులకే 4 కీలక వికెట్లు పడ్డా ఆ జట్టు కోలుకుంది. మాలిక్‌ అండతో అసిఫ్‌ అలీ చెలరేగి ఆడి జట్టును గెలిపించాడు. ఛేదనల్లో సమీకరణం తేలిగ్గా ఉన్నప్పటికీ ఒత్తిడికి గురై మ్యాచ్‌లు అప్పగించేసే జట్టు.. టపటపా వికెట్లు పడిపోయి, సాధించాల్సిన రన్‌రేట్‌ 9 దాటిపోయిన సమయంలో దృఢంగా నిలబడి మ్యాచ్‌ గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పాకిస్థాన్‌ ఆటలో ఈ మార్పుకు ప్రధాన కారణం కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ అన్నది విశ్లేషకుల మాట. ఈ తరం ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో అతనొకడు. నిలకడైన బ్యాటింగ్‌తో సహచరులకు స్ఫూర్తినిచ్చే బాబర్‌ నాయకత్వంలో జట్టు ఎంతో మెరుగైంది. అతడికి తోడు నిర్భయంగా ఆడే రిజ్వాన్‌, జమాన్‌ లాంటి ఆటగాళ్లతో బ్యాటింగ్‌ బలం పెరిగింది. ఇక బౌలింగ్‌లో పాక్‌ క్రికెట్లో ప్రతిభకు ఎప్పుడూ లోటు లేదు. ఎప్పటికప్పుడు ప్రపంచ స్థాయి బౌలర్లు వస్తూనే ఉంటారు. షహీన్‌ అఫ్రిది అలాంటి ఆణిముత్యమే. రవూఫ్‌, హసన్‌ అలీల ప్రతిభ గురించీ తెలిసిందే. బాబర్‌ ముందుండి జట్టును నడిపించడం ద్వారా సహచరులపై ఒత్తిడి తగ్గించాడు. అనవసరంగా ఒత్తిడికి గురై మ్యాచ్‌లు చేజార్చుకునే బలహీనతను కూడా జట్టు వదిలించుకునే ప్రయత్నం పాక్‌ గట్టిగానే చేస్తోందనడానికి ప్రస్తుత ప్రపంచకప్పే నిదర్శనం.

కొన్ని నెలల ముందుతో పోలిస్తే పాకిస్థాన్‌ ఇంత కసిగా ఆడుతుండటానికి ఇంకో ముఖ్య కారణం కూడా ఉంది. ఏళ్లకు ఏళ్లు కష్టపడి సొంతగడ్డపై క్రికెట్‌ పునరుజ్జీవానికి చర్యలు చేపడితే.. ఇంకొన్ని గంటల్లో సిరీస్‌ ఆరంభం కావాల్సిన స్థితిలో న్యూజిలాండ్‌ అర్ధంతరంగా పర్యటనను రద్దు చేసుకుని వెళ్లిపోవడం, ఆ తర్వాత ఇంగ్లాండ్‌ సైతం పాకిస్థాన్‌ పర్యటనను విరమించుకోవడం వారికి పెద్ద షాక్‌. ఈ పరిణామాలు పాక్‌ క్రికెట్‌ను కుదిపేశాయి. అయితే ఈ పరిస్థితుల్లో తమ కసినంతా ఆటలో చూపించాలని ఆటగాళ్లకు పీసీబీ ఛైర్మన్‌ రమీజ్‌ రజా సహా మాజీలు సూచించారు. ఆటగాళ్లు కూడా అదే కసితో టోర్నీలో అడుగు పెట్టారు. భారత్‌తో వైరం కొత్తేమీ కాదు. కానీ తమ దేశ పర్యటనను విరమించుకుని వెళ్లిపోయిన న్యూజిలాండ్‌ను కూడా పాక్‌ ఆటగాళ్లు భారత్‌ లాంటి ప్రత్యర్థిగానే చూశారు. పకడ్బందీ ప్రణాళికలతో రంగంలోకి దిగి, ఎంతో పట్టుదలతో ఆడి ఈ రెండు జట్లనూ ఓడించి తమ ప్రథమ కర్తవ్యాన్ని పూర్తి చేశారు. తమకు రెండో సొంతగడ్డ అనదగ్గ యూఈఏలో లెక్కలేనన్ని సిరీస్‌లు, మ్యాచ్‌లు ఆడటం కూడా పాక్‌కు కలిసొస్తున్న అంశాలే. జోరు కొనసాగిస్తూ కప్పు కూడా గెలిచి క్రికెట్‌ ప్రపంచానికి తమ సత్తాను చాటి చెప్పాలని చూస్తోందా జట్టు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన