close

ప్రధానాంశాలు

Updated : 29/09/2020 17:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘టాప్’ లేచిపోయే విజయాలు‌

టాప్‌-6లో కోహ్లీసేనవే మూడు

క్రికెట్లో జయాపజయాలు మామూలే. కానీ ఎంత గొప్పగా గెలిచామన్నదే అత్యంత ముఖ్యం. నువ్వానేనా అన్నట్టు సాగే పోరులో గెలుపు ఎంత కిక్కిస్తుందో ప్రత్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించినా అంతే మజా వస్తుంది. లీగ్‌లో వంద పరుగుల తేడాతో గెలిచిన సందర్భాలు బాగానే ఉన్నాయి. సరికొత్త సీజన్‌ ఆరంభానికి ముందు వాటిలో టాప్‌-6 విజయాలేంటో రివైండ్‌ చేసుకుందామా!


ముంబయి @ 146

లీగ్‌లో పరుగుల పరంగా అతిపెద్ద విజయం సాధించింది ముంబయి. 2017లో దిల్లీను 146 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కరీబియన్‌ వీరులు లెండిల్‌ సిమన్స్‌ (66; 43 బంతుల్లో 5×4, 4×6), కీరన్‌ పొలార్డ్‌ (63*; 35 బంతుల్లో 5×4, 4×6) అర్ధశతకాలతో దుమ్మురేపారు. ఓపెనర్‌ పార్థివ్‌ పటేల్‌ (25) ఫర్వాలేదనిపించాడు. కానీ చివర్లో హార్దిక్‌ పాండ్య (29*; 14 బంతుల్లో 1×4, 3×6) మెరుపు సిక్సర్లతో విచురుకుపడటంతో స్కోరు 200 దాటేసింది. లక్ష్య ఛేదనకు దిగిన దిల్లీని ముంబయి బౌలర్లు 13.4 ఓవర్లకు 66 పరుగులకే కుప్పకూల్చారు. కర్ణ్‌శర్మ (3/11), హర్భజన్‌సింగ్‌ (3/22), లసిత్‌ మలింగ (2/5) ధాటికి దిల్లీ కుదేలైంది. కరుణ్‌ నాయర్‌ (21) టాప్‌ స్కోరర్‌.


బెంగళూరు @ 144

లీగ్‌లో రెండో అతిపెద్ద విజయం అందుకుంది బెంగళూరు. 2016లో గుజరాత్‌ను 144 పరుగుల తేడాతో ఘోరంగా ఓడించింది. లీగ్‌ చరిత్రలోనే ఈ మ్యాచ్‌ ఓ అద్భుతం. ఎందుకంటే ఒకే జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు శతకాలు బాదేశారు. ఏబీ డివిలియర్స్‌ (129*; 52 బంతుల్లో 10×4, 12×6), విరాట్‌ కోహ్లీ (109; 55 బంతుల్లో 5×4, 8×6) రెండో వికెట్‌ 229 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఊచకోత ఇలా ఉంటుందీ అని ప్రత్యక్షంగా చూపించారు. వారి దెబ్బకు బెంగళూరు 3 వికెట్ల నష్టానికి 248 చేసింది. ఛేదనలో గుజరాత్‌ 18.4 ఓవర్లకు 104కే కుప్పకూలింది. బెంగళూరు నుంచి వికెట్ కీపర్‌ మినహా మిగతా తొమ్మిది మందీ బౌలింగ్‌ చేయడం ప్రత్యేకం. క్రిస్‌ జోర్డాన్‌ (4/11), యూజీ (3/19), సచిన్‌ బేబీ (0.4-0-4-2) గుజరాత్‌ నడ్డి విరిచారు. ఆ జట్టులో ఆరోన్‌ ఫించ్‌ (21), రవీంద్ర జడేజా (21) టాప్‌ స్కోరర్లు.


కోల్‌కతా @ 140

లీగ్‌లో ఎప్పుడూ ప్రమాదకరమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉండే జట్టు కోల్‌కతా. అరంగేట్రం సీజన్ (2008)‌లోనే ఆ జట్టు అతిపెద్ద విజయం అందుకుంది. బెంగళూరును 140 పరుగుల తేడాతో చిత్తు చేసింది. బ్రెండన్‌ మెక్‌కలమ్‌ (158*; 73 బంతుల్లో 10×4, 13×6) వీరవిహారం చేసింది ఈ మ్యాచులోనే. అతడి విధ్వంసంతో కోల్‌కతా 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు ఒత్తిడికి లోనైంది. 15.1 ఓవర్లకు 82 పరుగులకే చాపచుట్టేసింది. అజిత్‌ అగార్కర్‌ (3/25), గంగూలీ (2/21), అశోక్‌ దిండా (2/9) బౌలింగ్‌లో రాణించారు. బెంగళూరులో ప్రవీణ్‌ కుమార్‌ (18) టాప్‌ స్కోరర్‌. కోల్‌కతా ఇచ్చిన ఎక్స్‌ట్రా (19)ల కన్నా ఒక పరుగు తక్కువే. ద్రవిడ్‌ (2), జాఫర్‌ (6), కోహ్లీ (1), కలిస్‌ (8), కామెరాన్‌ వైట్‌ (6), మార్క్ బౌచర్‌ (7), అఖిల్‌ (0), ఆష్లే నోఫ్కే (9), జహీర్‌ (3), సునిల్‌ జోషీ (3) ఏక అంకె స్కోరుకే పరిమితమయ్యారు.


బెంగళూరు @ 138

లీగ్‌లో నాలుగో భారీ విజయం అందుకున్న జట్టూ బెంగళూరే. 2015లో పంజాబ్‌ను 138 పరుగుల తేడాతో బోల్తా కొట్టించింది. యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌గేల్‌ (117; 57 బంతుల్లో 7×4, 12×6) శతక బాదుడుకు ‘మిస్టర్‌ 360’ (47; 24 బంతుల్లో 3×4, 4×6) మెరుపులు తోడవ్వడంతో బెంగళూరు 3 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. అయితే, ఛేదనకు దిగిన పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ను మిచెల్‌ స్టార్క్‌ (4/15), శ్రీనాథ్‌ అరవింద్‌ (4/27) కకావిలకం చేశారు. వారి దెబ్బకు పంజాబ్‌ ఏ దశలోనూ కోలుకోలేదు. 13.4 ఓవర్లకు 88 పరుగులకే కుప్పకూలింది. అక్షర్‌ పటేల్‌ (40*; 21 బంతుల్లో 5×4, 2×6) ఒక్కడే కాస్త పోరాడాడు. వృద్ధిమాన్‌ సాహా (13)ను మినహాయిస్తే మరెవ్వరూ పది పరుగులు కూడా చేయలేదు.


బెంగళూరు @ 130

స్టార్‌ బ్యాట్స్‌మెన్‌తో కళకళలాడే బెంగళూరు టాప్‌-5 విజయాల్లో మూడు సాధించిందంటే ఆశ్చర్యమేముంది. 2013లో పుణెపై ఆ జట్టు 130 పరుగుల తేడాతో విజయ బావుటా ఎగరేసింది. విధ్వంసకర క్రిస్‌గేల్‌ (175*; 66 బంతుల్లో 13×4, 17×7) టీ20 క్రికెట్లో మునుపెన్నడూ చూడని స్కోరును నమోదు చేశాడు. క్రీజులో బౌండరీల తాండవం చేశాడు. సింగిల్స్‌, డబుల్స్‌ అన్న మాటే లేదు. కొడితే బౌండరీ లేదా సిక్సర్‌ అన్నట్టుగా సాగింది అతడి ఊచకోత. దిల్షాన్‌ (33), డివిలియర్స్‌ (31; 8 బంతుల్లో 3×4, 3×6) మెరుపులు తోడవ్వడంతో బెంగళూరు 263/5 స్కోరు చేసింది. లీగ్‌లో ఇప్పటికీ ఇదే అత్యధిక స్కోరు కావడం ప్రత్యేకం. ఛేదనలో పుణె తేలిపోయింది. బెంగళూరు బౌలర్లు సమష్టిగా రాణించడంతో 133/9కి పరిమితమైంది. స్టీవ్‌స్మిత్‌ (41; 31 బంతుల్లో 6×4) టాప్‌ స్కోరర్‌.


హైదరాబాద్‌ @ 118

లీగ్‌లో అతిపెద్ద ఆరో విజయం సాధించింది హైదరాబాద్‌. ఎవరిపై అనుకుంటున్నారు? భారీ స్కోర్లు చేసే బెంగళూరు పైనే. 118 పరుగులతో ఆ జట్టును చిత్తు చేసింది. హైదరాబాద్‌ ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (114; 56 బంతుల్లో 12×4, 7×6), డేవిడ్‌ వార్నర్‌ (100*; 55 బంతుల్లో 5×4, 5×6) శతకాలు దంచేశారు. ఉప్పల్‌ మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. వారి ధాటికి బెంగళూరు బౌలర్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. హైదరాబాద్‌ 2 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన బెంగళూరుకి హైదరాబాద్ బౌలర్లు మహ్మద్‌ నబీ (4/11), సందీప్‌ శర్మ (3/19) చుక్కలు చూపించారు. పరుగులు చేసేందుకు అవకాశమే ఇవ్వలేదు. వరుసగా వికెట్లు తీయడంతో 19.5 ఓవర్లకు 113 పరుగులకు ఆలౌటైంది. ముగ్గురు ఆటగాళ్లు రనౌట్‌ అవ్వడం గమనార్హం. కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ (37; 32 బంతుల్లో 3×4, 2×6) టాప్‌ స్కోరర్‌.

-ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.