close

కథనాలు

1 జట్టు.. 9 తప్పులు.. 31 ఏళ్లకు వైట్‌వాష్‌

కోహ్లీసేనకు ఎందుకీ ఘోర పరాభవం???

ప్రపంచ నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌ సారథి. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కొన్నాళ్లకే అగ్రస్థానానికి చేరుకున్న పేసర్‌. తిరుగులేని టాప్‌ ఆర్డర్‌. భీకరమైన బౌలింగ్‌ దాడి. చురుకైన ఫీల్డింగ్‌ విభాగం. ఉడుకు రక్తంతో ఉరకలేసే యువతరం. ఎక్కువ సానుకూలతలు, తక్కువ బలహీనతలు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం. ప్రపంచ విజేత ఇంగ్లాండ్‌ కన్నా నాలుగే రేటింగ్‌ పాయింట్లు తక్కువ. మరి ఇలాంటి టీమ్‌ఇండియాను 31 ఏళ్ల తర్వాత ప్రత్యర్థి ఎలా వైట్‌వాష్ చేయగలిగింది???


దొరకని సలహాలు

టీమ్‌ఇండియా సారథ్యం అందుకున్నాక విరాట్‌ కోహ్లీ ఎన్నో సిరీస్‌ విజయాలు అందించాడు. కష్టాల్లో ఉన్నప్పుడు అనుభవజ్ఞుడైన ఎంఎస్‌ ధోనీ వైపు చూసేవాడు. అతడిచ్చే సలహాలతో విజయం కోసం ప్రయత్నించేవాడు. ప్రపంచకప్‌ తర్వాత ఆ పాత్రను రోహిత్‌ శర్మ పోషిస్తున్నాడు. అవసరమైన ప్రతిసారీ వైస్‌ కెప్టెన్‌గా విరాట్‌కు అండగా నిలిచాడు. ఐపీఎల్‌లో ముంబయిని నాలుగు సార్లు విజేతగా నిలిపిన అతడి అనుభవాన్ని ఎవ్వరూ కాదనలేరు. వీరిద్దరూ లేని లోటు సారథిపై భారం పెంచింది. సరైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు.


రో‘హిట్‌’ లోటు

న్యూజిలాండ్‌ వన్డే సిరీసులో రోహిత్‌ శర్మ లేని వెలితి స్పష్టంగా కనిపించింది. 12 నెలలుగా 57+ సగటుతో అతడు పరుగుల వరద పారించాడు. కెరీర్‌లోనే అత్యంత భీకర ఫామ్‌లో ఉన్నాడు. ధావన్‌తో కలిసి శుభారంభాలు అందించేవాడు. ఈ సారి వీరిద్దరూ లేరు. తొలిసారే కఠినమైన కివీస్‌ గడ్డపై అరంగేట్రం చేసిన మయాంక్‌, పృథ్వీషా సరైన భాగస్వామ్యాలు అందించకలేకపోయారు. మయాంక్‌ 12 సగటుతో 36, షా 28 సగటుతో 84 పరుగులే చేశారు.


విరాట్‌పై భారం

అత్యంత నిలకడకు విరాట్‌ కోహ్లీని ఉదాహరణగా చూపిస్తారు. అలాంటిది ఈ సిరీస్‌లో అతడు 25 సగటుతో కేవలం 75 పరుగులే చేశాడు. ఓపెనర్లు శుభారంభాలు ఇవ్వకపోవడం, రాహుల్‌ మిడిలార్డర్‌కు వెళ్లడంతో బ్యాటింగ్‌ భారం అతడిపై ఎక్కువగా పడింది. మరోవైపు పిచ్‌, వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ఇష్‌ సోధి, సౌథీ, బెనెట్‌ అతడిని త్వరగా పెవిలియన్‌ పంపించారు. వరుసగా మూడు సిరీసుల్లో కోహ్లీ శతకం చేయకపోవడం ఆశ్చర్యమే! విండీస్‌, ఆస్ట్రేలియా, కివీస్‌ సిరీసుల్లో అతడి సగటు సాధారణంగానే ఉంది. రారాజే పరుగులు చేయకుంటే జట్టుకు ఇక దిక్కెవరు?


వికెట్‌ తీయని పేసుగుర్రం

అరంగేట్రం నుంచే ప్రత్యర్థులను హడలెత్తించిన పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా. అతడి రన్నప్‌, చేతుల్లోంచి బంతిని విడుదల చేసే విధానం, కోణం, బౌలింగ్‌లో వైవిధ్యం, కట్టుదిట్టమైన లెంగ్త్‌కు బ్యాట్స్‌మెన్‌ గజగజ వణికేవారు. గాయపడ్డ తర్వాత జట్టులోకి వచ్చిన బుమ్రా లయ అందుకున్నట్టే కనిపించింది. ఐతే వికెట్‌ లేకుండా అతడు కివీస్‌ సిరీస్‌ను ముగించడం పెద్ద షాక్‌! తొలిసారి అతడి గణాంకాల్లో ‘సగటు’ అంశం కనిపించలేదు. 5.56 ఎకానమీతో 167 పరుగులే ఇచ్చినప్పటికీ బుమ్రా నుంచి కోరుకున్నది ఇది కాదు. న్యూజిలాండ్‌ పిచ్‌లపై అతడు లెంగ్త్‌లు కనుగొనడంలో ఇబ్బంది పడ్డాడు. ఇదే అదనుగా బ్యాట్స్‌మెన్‌ రెచ్చిపోయారు.


పేలవ బౌలింగ్‌

ఏ రకంగా చూసుకున్నా ఈ సిరీసులో టీమ్‌ఇండియా బౌలర్ల ప్రదర్శన స్థాయికి తగ్గట్టు లేదు. బుమ్రా వికెట్లు తీయలేదు. షమి ఒక్క మ్యాచే ఆడాడు. 4 వికెట్లు తీసిన శార్దూల్‌ ఠాకూర్‌ 8+ ఎకానమీతో 227 పరుగులు ఇచ్చాడు. 6.44తో నవదీప్‌ సైని ఫర్వాలేదనిపించినా వికెట్‌ తీయకపోవడం గమనార్హం. కుల్‌దీప్‌ యాదవ్‌ పరిస్థితి మరీ ఘోరం. ఆడిన ఒక్క మ్యాచులో 84 పరుగులిచ్చి కోరుకోని రికార్డు మూటగట్టుకున్నాడు. యుజువేంద్ర చాహల్‌ 5.25 ఎకానమీతో 6, జడ్డూ 4.80 ఎకానమీతో 2 వికెట్లు తీయడమే గొప్పగా కనిపిస్తోంది.


అవకాశాలు  నేలపాలు

క్యాచులే మ్యాచులు గెలిపిస్తాయన్న క్రికెట్‌ సూత్రాన్ని టీమ్‌ఇండియా ఫీల్డర్లు మర్చిపోయారేమో! కీలక సమయాల్లో వచ్చిన క్యాచ్‌లను నేలపాలు చేశారు. రాస్‌టేలర్‌ క్యాచ్‌ను కుల్‌దీప్‌ యాదవ్‌ చేజార్చడం తొలి వన్డేలో ఎంత చేటు చేసిందో చెప్పేదేముంది. ఇక మైదానంలోనూ ఆటగాళ్లు అంత చురుగ్గా కదిలినట్టు కనిపించలేదు. 100% కచ్చితత్వంతో త్రో చేసే జడేజా సైతం ఒక రనౌట్‌ మిస్‌ చేశాడు! అతడు నిందార్హుడు కాదు గానీ ఒక అవకాశం చేజారింది. విరాట్‌ కోహ్లీ ఒక్కడే తీవ్రతతో కనిపించాడు. ఫీల్డింగ్‌ సాధన చేసేందుకు సమయం దొరకలేదన్నది సరైన కారణమే అనిపించినా ప్రమాణాలకు సమీపంలోనైనా లేకపోవడం చర్చించదగ్గదే.


లక్ష్యం కాపాడుకోని వైనం

మొదట బ్యాటింగ్‌ చేసి లక్ష్యాలను కాపాడుకోలేక పోవడం ఎన్నాళ్లుగానో కోహ్లీసేనను వేధిస్తోంది. టీ20 సిరీస్‌లో ఈ సమస్యను అధిగమించినట్టే కనిపించినా వన్డేల్లో అది జరగలేదు. 347; 296 వంటి భారీ లక్ష్యాలను రక్షించుకోలేదంటే కచ్చితంగా బౌలింగ్‌, ఫీల్డింగ్‌ పేలవంగా ఉండటమే కారణం. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సైతం పరిష్కారం కోసం కోహ్లీ, రవిశాస్త్రికి సలహాలు ఇస్తానని చెప్పారంటే సమస్య తీవ్రత అర్థం చేసుకోవచ్చు.


మైదానాలపై లేని అవగాహన

మైదానాలకు సంబంధించి టీమ్‌ఇండియా ఎలాంటి వ్యూహాలు అనుసరించిందో తెలియదు. వాస్తవంగా న్యూజిలాండ్‌లో స్టేడియాలను రగ్బీ, క్రికెట్‌కు వినియోగిస్తారు. అందుకే బౌండరీ సరిహద్దులు షట్కోణాకృతిలో ఉంటాయి. వైశాల్యంలోనూ చిన్నవి. ఎటువైపు బంతిని తరలిస్తే త్వరగా బౌండరీకి చేరుతుందో, ఎక్కడ ఫీల్డర్లను మోహరిస్తే బంతిని అడ్డుకుంటారో ఆతిథ్య జట్టుకు బాగా తెలుసు. భారత ఆటగాళ్లకు దీనిపై అవగాహన లేకపోవచ్చు. వ్యూహాలు రచించే ముందు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారో లేదో తెలియాల్సి ఉంది.


గాయాల ప్రభావం

రిజర్వ్‌ బెంచీ బలమైనదే అయినా గాయాల ప్రభావం కోహ్లీసేనపై పడింది. కివీస్‌లో చల్లని గాలులు వీస్తాయి. ఇలాంటి పిచ్‌లపై స్వింగ్‌ బౌలర్లైన భువనేశ్వర్‌, దీపక్‌ చాహర్‌ రాణించేందుకు అవకాశాలు ఉంటాయి. వారు లేకపోవడంతో వైవిధ్యం కొరవడింది. పిక్క గాయంతో రోహిత్‌ దూరమయ్యాడు. మోకాలి గాయంతో ధావన్‌ ఎంపికవ్వలేదు. కుల్‌దీప్‌, షమి, కేదార్‌ జాదవ్‌ పూర్తి ఫిట్‌నెస్‌తో కనిపించలేదు.

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.