Virat Kohli-Rishabh Pant: ఆ ఇద్దరు పరుగెడితే.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ భారత్‌ వశమైనట్టే!
Array ( ) 1

కథనాలు

Updated : 18/08/2021 09:44 IST

Virat Kohli-Rishabh Pant: ఆ ఇద్దరు పరుగెడితే.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ భారత్‌ వశమైనట్టే!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌లో టీమ్‌ఇండియా అదరగొడుతోంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రెండో టెస్టును భారీ తేడాతో సొంతం చేసుకుంది. ఇక మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఏ రెండు గెలిచినా కోహ్లీసేనకు సిరీస్‌ ఖాయమైనట్టే. ప్రస్తుత పరిస్థితుల్లో అదంత కష్టమైన పనేం కాకపోయినా భారత్‌ను రెండు ప్రధాన సమస్యలు వెంటాడుతున్నాయి. అవీ సర్దుకుంటే టీమ్‌ఇండియాకు ఇక ఎదురుండదు! కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్ భారీ స్కోర్లు చేయగలిగితే ఇంగ్లాండ్‌ గడ్డపైనా కోహ్లీసేన కాలర్‌ ఎగరేసే రోజు దగ్గర్లోనే ఉంది.

కొనసాగుతున్న ఎదురుచూపులు..

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ కెరీర్‌లో సుమారు రెండేళ్ల పాటు ఒక్క శతకం కూడా సాధించకపోవడం బహుశా ఇదే తొలిసారి! పరుగుల యంత్రంగా పేరుతెచ్చుకున్న అతడు 2019 నవంబర్‌లో చివరిసారి టెస్టు శతకం బాదాడు. బంగ్లాదేశ్‌పై 70వ అంతర్జాతీయ శతకం సాధించాక ఇప్పటివరకూ మరో 10 టెస్టులు ఆడాడు. అందులో ఒక్కసారీ మూడంకెల స్కోర్‌ అందుకోలేకపోవడం గమనార్హం. 2020లో మొత్తం 3 టెస్టులు ఆడిన టీమ్‌ఇండియా సారథి.. ఈ ఏడాది 7 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలోనే పలుమార్లు అర్ధ శతకాలు సాధించినా వాటిని శతకాలుగా మలచడంలో విఫలమయ్యాడు. ఇక జూన్‌లో న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడినప్పటి నుంచి కోహ్లీ ఒక్క అర్ధశతకం కూడా నమోదు చేయలేకపోయాడు. దాంతో అభిమానులు అతడి నుంచి భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నారు. రాబోయే మ్యాచ్‌ల్లోనైనా భారత సారథి ఆ ఎదురుచూపులకు తెరదించాలి.

ఇవి సరిపోవు.. దంచి కొట్టాల్సిందే..

మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలో, తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కీలక ఇన్నింగ్సులు ఆడి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు రిషభ్‌ పంత్‌. ప్రస్తుత పర్యటనలో అంత దూకుడుగా ఆడలేకపోతున్నాడు. అతడు అరకొర పరుగులు చేస్తున్నా అవి సరిపోవడం లేదు. అంతకుముందు టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లోనూ (4, 41) పరుగులతో విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్టులో (97) దంచికొట్టిన పంత్‌.. గబ్బా టెస్టులో (89*) అజేయంగా నిలిచి ఏకంగా మ్యాచ్‌నే గెలిపించాడు. ఈ క్రమంలోనే తర్వాత భారత్‌లో ఇంగ్లాండ్‌తో ఆడిన నాలుగో టెస్టులో (101) శతకం సాధించి మరో అద్భుత విజయం అందించాడు. అలాంటి మేటి ఆటగాడు తాజా సిరీస్‌లో ఎక్కువ పరుగులు చేయలేదు. ఈ నేపథ్యంలో రాబోయే టెస్టుల్లో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌పై మరింత ఆధిపత్యం చెలాయించాలంటే పంత్‌ దంచి కొట్టాల్సిందే. అదే జరిగితే కోహ్లీసేనకు కప్పు గ్యారంటీ అని చెప్పొచ్చు.

వీళ్లు కూడా ఇకపై కుదురుకుంటే..

ఇక తాజా సిరీస్‌లో టీమ్‌ఇండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ అద్భుతంగా ఆడుతున్నారు. వీరిద్దరూ ఆరంభంలో జట్టుకు విలువైన పరుగులు జోడిస్తూ ఇన్నింగ్స్‌ను నిలబెడుతున్నారు. ఈ క్రమంలోనే ఒకరు కాకపోయినా మరొకరు పెద్ద ఇన్నింగ్స్‌ ఆడుతూ భరోసాగా నిలుస్తున్నారు. అయితే, జనవరిలో ఆస్ట్రేలియా పర్యటన తర్వాత తరచూ విఫలమవుతున్న పుజారా, రహానె లాంటి సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ రెండో టెస్టులో లయ అందుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నిలకడగా ఆడారు. ఒకవైపు వికెట్లు కాపాడుకుంటూనే మరోవైపు శతక భాగస్వామ్యం నిర్మించారు.

రహానె(61) అర్ధశతకంతో రాణించగా పుజారా(45) పరుగులతో మెరిశాడు. దాంతో వీరిద్దరూ పామ్‌లోకి వచ్చినట్టేనని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇతర మ్యాచ్‌ల్లోనూ వీరిద్దరూ ఇలాగే క్రీజులో పాతుకుపోయి ప్రత్యర్థి బౌలర్లను కాచుకుంటే ఇంగ్లాండ్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. అలాగే లోయర్‌ ఆర్డర్‌లోనూ జడేజా, బుమ్రా, షమి లాంటి బౌలర్లు పరుగులు చేస్తుండటంతో భారత్‌కు సానుకూలంగా మారింది. ఇక బౌలింగ్‌ విభాగంలో బుమ్రా ఫామ్‌లోకి రావడం, సిరాజ్‌ లాంటి యువ పేసర్‌ చెలరేగుతుండటంతో టీమ్‌ఇండియా సిరీస్‌ కైవసం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే, ఇంగ్లాండ్‌ను తక్కువ అంచనా వేయకుండా జాగ్రత్తగా ఆడగలిగితే తప్పకుండా కప్పు భారత్‌ వశమైనట్టే.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన